Share News

రోడ్డు వెంటే విక్రయాలు

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:13 AM

కూరగాయలు, పండ్లు తదితర వ్యాపారులు ఇస్టానుసారం వ్యవహరిస్తున్నారు. వారిని నియంత్రించడంలో మునిసిపల్‌ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా భువనగిరి పాత బస్టాండ్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది.

 రోడ్డు వెంటే విక్రయాలు

భువనగిరి పాత బస్టాండ్‌ మార్కెట్‌ వద్ద ఇక్కట్లు

(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్‌): కూరగాయలు, పండ్లు తదితర వ్యాపారులు ఇస్టానుసారం వ్యవహరిస్తున్నారు. వారిని నియంత్రించడంలో మునిసిపల్‌ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా భువనగిరి పాత బస్టాండ్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. ఫలితంగా పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పలు రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలు సైతం ఉన్నాయి.

పాత బస్టాండ్‌ కూరగాయల మార్కెట్‌లో 64 మునిసిపల్‌ మడిగెలు ఉన్నాయి. వీటిలో మొదటి బ్లాకులోని 22 మడిగలను కూరగాయల వ్యాపారులకు, మిగతా 42 మడిగలను ఇతర వ్యాపారులకు కేటాయించారు. అద్దె ప్రాతిపాదికన వీటిని కేటాయించేందుకు 2022లో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ మేరకు అన్ని మడిగెలను వ్యాపారులు సొంతం చేసుకున్నారు. కానీ, రెండు, మూడో బ్లాక్‌లోని 22 మడిగెలను యజమానులు ఇతరులకు సబ్‌లీజ్‌కు ఇచ్చారు. మరో 20మడిగెల నుంచి అద్దెదారులు అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆ మడిగెలు నేటికీ ఖాళీగానే ఉన్నా యి. కానీ మొదటి బ్లాకులోని 22 మడిగెలను అద్దెకు తీసుకున్న కూరగాయల వ్యాపారులు మునిసిపాలిటీకి నెలవారీ అద్దె చెల్లిస్తూనే పలువురు వాటికి తాళాలు వేసి పట్టణ ప్రధా న రహదారి వెంట పాత బస్టాండ్‌ వద్ద కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌, రోడ్డు ప్రమాదాల నివారణకు రహదారుల వెంట వీధి వ్యాపారాలను నియంత్రించాలనే అధికారుల ప్రయత్నాలకు గండి పడుతోంది. అద్దెకు తీసుకున్న మడిగెలు చిన్నపాటి వర్షాని కి లీకవుతున్నాయని, షట్టర్లు ధ్వంసం అయ్యాయని, మరమ్మతులకు మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని వ్యాపారులు చెబుతున్నారు అంతేగాక కొనుగోలుదారులు మార్కెట్‌లోనికి రావడంలేదని, విక్రయాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నామని, దీంతో తప్పని పరిస్థితుల్లో రోడ్డు వెంట కూరగాయలు విక్రయిస్తున్నామని సంబంధిత వ్యాపారులు అంటున్నారు. అయితే రోడ్డుపై విక్రయాలతో వినియోగదారులు ఎవ్వరూ లోనికి రావడంలేదని, దీంతో కనీస విక్రయాలు జరగడంలేదని, అంతేగాక కంపోస్ట్‌ హౌస్‌లో వేస్తున్న వ్యర్థ కూరగాయలను మునిసిపల్‌ పారిశుధ్య సిబ్బంది సకాలంలో తరలించకపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా మునిసిపల్‌ అధికారులు స్పందించి రోడ్డు వెంట విక్రయాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.

నామమాత్రమవుతున్న తనిఖీలు

భువనగిరి పట్టణం నుంచి వరంగల్‌ వైపు రాకపోకలు సాగించే అన్ని బస్సులు పాత బస్టాండ్‌లో నిలుస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి గంజ్‌లోని మార్కెట్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు పనుల కోసం వచ్చే వారిలో పలువురు ఇక్కడ ఆగుతుంటారు. దీంతో నిత్యం పాత బస్టాండ్‌ రద్దీగా ఉంటోంది. అదే సమయంలో రహదారి వెంట కూరగాయల వ్యాపారులను నియంత్రించేందుకు మునిసిపల్‌ పట్టణ ప్రణాళికా విభాగం, తదితర అధికారులు చేస్తున్న తనిఖీలు నామమాత్రం అవుతున్నాయి. అధికారులు వచ్చినప్పుడు దుకాణాలను మూసివేయడం లేదా అద్దె మడిగెల్లోకి వెళ్తామని సర్దిచెబుతుండటం, అధికారులు వెనుదిరుగుతుండటం సర్వసాధారణమైంది. వాకింగ్‌ పాత్‌పైనే ఏర్పాటు చేసిన దుకాణాలు, హోటళ్లతో ఇబ్బందులు ఏర్పడుతున్నందున మునిసిపల్‌ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు అంటున్నారు. అదే సమయంలో శిఽథిల మడిగెలకు మరమ్మతులు చేయాలని, మార్కెట్‌ పరిసరాలను నిత్యం శుభ్రం చేయాలని, అలాగైతేనే సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై మునిసిపల్‌ కమిషనర్‌ జి.రామలింగంను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, అద్దె మడిగెల్లో ఉన్న వ్యాపారులు రోడ్డు వెంట విక్రయాలు సాగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Aug 25 , 2025 | 12:13 AM