Share News

నత్తనడకన రోడ్డు పనులు

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:19 AM

రాజాపేట మండలంలోని పాముకుంట-మొల్లగూడెం బీ టీ రోడ్డు పనులు నత్తకు నడకను నేర్పుతున్నాయి.

నత్తనడకన రోడ్డు పనులు
కంకర పోసి వదిలేసిన రాజాపేట మండలం పాముకుంట-మొల్లగూడెం రోడ్డు

రాజాపేట, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాజాపేట మండలంలోని పాముకుంట-మొల్లగూడెం బీ టీ రోడ్డు పనులు నత్తకు నడకను నేర్పుతున్నాయి. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై పనులు ప్రారంభించినా నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోనూ సాగుతూనే ఉన్నాయి. కంకర పోసి మూడేళ్లు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తికావడం లేదు. మండలంలోని పాముకంట నుంచి మొల్లగూడెం వరకున్న 3 కిలోమీటర్ల మట్టి రోడ్డును బిటి రోడ్డుగా మార్చేందుకు మొదటి దఫాగా రెండు కిలోమీటర్లకు గాను రూ.1.20కోట్లు సీఆర్‌ఆర్‌ నిధులు మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి 2022 జూన30న పనులకు శంఖుస్థాపన చేశారు. పనులను ప్రారంభించి మట్టి, కంకర పోసి బీటీ వేయకుండానే మధ్యలోనే పనులను వదిలేశారు. పనులు పూర్తి కాకపోవడంతో మూడేళ్లుగా గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలి ఉండటంతో వాహనాలు పాడవడంతో పాటు ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. మరో కిలోమీటరు బీటీ రోడ్డుకు రూ.1.30కోట్లు రెండో దఫా సీఆర్‌ఆర్‌ నిధులు మంజూరు చేశారు. ఇప్పటి ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య పనులను ఏడాది క్రితం ప్రారంభించారు. కాగా పనులను చేపట్టి రోడ్డు పక్కన మట్టి కుప్పలను పోసి వదిలేశారు. వర్షాలు కురిసినప్పుడు రోడ్డుపై నీరు నిల్వ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన కొందరు గ్రామస్థులు మట్టిని చదును చేసి నీరు నిల్వకుండా చేశారు. అయినప్పటికీ అధ్వాన్నంగా, అసంపూర్తిగా ఉన్న రోడ్డుతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు ను పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామస్థులు పలుమార్లు మొర పెట్టుకున్నారు. ఇప్పటికెనా అధికారులు చర్యలు చేపట్టి పనులను పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఏళ్లు గడిచినా పూర్తి చేయరా?

మండలంలోనే మారుమూల గ్రామం. అటవీ ప్రాంతానికి అనుకుని ఉంటుంది. గ్రామానికి ఉన్న మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు పనులను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. కంకర, మట్టి పోసి వదిలేశారు. రోడ్డు అధ్వాన్నంగా మారింది. రాత్రిపూట ఏదైనా ఆపద వస్తే ఈ రోడ్డుగుండా వెళ్లాలంటే నరకమే. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలను తీర్చాలి.

-రెడ్డబోయిన రాజు, గ్రామస్థుడు, మొల్లగూడెం

పనులు త్వరగా పూర్తి చేస్తాం

పాముకుంట-మొల్లగూడెం బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేస్తాం. రెండు కిలోమీటర్ల మేర రోడ్డు పనులను చేపట్టిన కంట్రాక్టర్‌కు పనులు పూర్తి చేసేందుకు నోటీసులు ఇస్తున్నాం. చర్యలు తీసుకుంటాం.

-తాడోజు శ్రీనివా్‌స, ఏఈ, పంచాయతరాజ్‌, రాజాపేట

Updated Date - Oct 24 , 2025 | 12:19 AM