ఆయిల్‌పామ్ రైతులకు ఊరట
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:53 AM
ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆయిల్‌పామ్ రైతులకు రాయితీ నిధులను కేటాయించింది.

రాయితీ నిధులు రూ.9.71కోట్లకు పైగా విడుదల
ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ
ఆయిల్‌పామ్ రైతులను ప్రోత్సహించేలా నిర్ణయాలు
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ): ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆయిల్‌పామ్ రైతులకు రాయితీ నిధులను కేటాయించింది. నల్లగొండ జిల్లాలో 2,217 మంది రైతులకు 9768 ఎకరాలకు రూ.6. 14కోట్లు, యాదాద్రి జిల్లాలో మొత్తం 914 మంది రైతులకు 4,107ఎకరాలకు రూ.1. 72కోట్లు, సూర్యాపేట జిల్లాలో మొత్తం 1015 మంది రైతులకు 4,457 ఎకరాలకు రూ.1.85కోట్లు రాయితీ మొత్తంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.9.71కోట్లు నాలుగు రోజుల క్రితం మంజూరయ్యాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు ను విస్తరింపజేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూ పొందించారు. జిల్లాలో ఆయిల్‌పామ్ విస్తరణకోసం ఇటీవల కలెక్టరేట్‌లో మండల వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ, ఉద్యానశాఖ అధికారులతోపాటు మైక్రో ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్లు, పతంజలి ఫుడ్ ఫీల్డ్ స్టాఫ్‌తో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆయిల్‌పామ్‌పై రైతులకు అవగాహన పెంచడం, వారికి నచ్చజెప్పి ఈ తోటలు సాగు చేసేలా, రైతులు ముందుకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో పెద్దఎత్తున ఆయిల్‌పామ్ సాగయితే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని, ఇందుకు రైతులు ప్రభుత్వం నుంచి ఇస్తున్న రాయితీల దృష్ట్యా ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు తరుచూ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆయిల్‌పామ్ సాగును విస్తరింపజేసేలా తగిన విధంగా ఆయా శాఖలు ముందుకు సాగాలని నిర్ణ యం తీసుకున్నాయి. వ్యవసాయ, ఉద్యానశాఖలు సమన్వయం చేసుకోవడంతోపాటు వాటి వ్యవసా య అనుబంధశాఖల అధికారులు, ఉద్యోగుల సహకారం తీసుకుంటూ సాగు విస్తరణకు ముందుకు అడుగులు వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం సమృద్ధి అవకాశాలపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరణ పెంచడంతోపాటు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ఉద్యానశాఖకు లక్ష్యాలను నిర్ధేశిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తోంది. తొలి నాలుగేళ్ల వరకు చెట్ల పెరుగుదల ఉండగా, నాలుగో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. ఎరువులకోసం ప్రభుత్వం రాయితీని అందజేస్తుంది. రైతులకు 2,100 చొప్పున అంతర పంటలు మరో 2,100 చొప్పున సబ్సిడీ నాలుగేళ్లవరకు అందజేస్తుంది. ప్రభుత్వం ఆయిల్‌పామ్ రైతులకు డ్రిప్‌ను కూడా సబ్సిడీపై ఇస్తుంది.
జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు
జిల్లాలో ఇప్పటికే 10,700ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. అదనంగా మరో 15వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకొస్తే త్వర లో జిల్లాలో ఆయిల్‌పామ్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతోపాటు సంబంధిత కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీ ఏర్పాటుకు దాదాపు 200 ఎకరాలు అవసరం కాగా, అందులో ఆయిల్‌పామ్ తోటను 50 ఎకరాల్లో ఏర్పా టు చేసి రైతులకు అవగాహన కల్పించడానికి, శిక్ష ణా తరగతులు నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఒక్కో ఎకరానికి 10నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయిల్‌పామ్ కంపెనినీ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ-సూర్యాపేట జిల్లా ల మధ్యలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలంటే కనీసం 25వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు విస్తరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దిగుబడులు ఖమ్మం జిల్లాతోపాటు విజయవాడ ప్రాంతానికి ఆయా కంపెనీలు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం తోటలు వేస్తున్న రైతులు మార్కెటింగ్ సమస్యపై అయోమయానికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం భరోసా ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు పంటలు వేసిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోయేది లేదని స్పష్టత ఇస్తుంది. ఈ తోటల సాగు సులభం కావడంతోపాటు ఆయిల్‌పామ్ తోటలు పండించిన రైతులతో కంపెనీలు ఒప్పందం చేసుకుంటున్నాయి. ధరలు సైతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ నిర్ణయిస్తుండటంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆయిల్‌పామ్‌కు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరించాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో నీటి వనరులు అధికంగా ఉండటంతో తోటలు విస్తరించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం టన్ను ధర రూ.21వేలకు పైగా ఉండగా సంవత్సరానికి ఎకరానికి రూ.1.50లక్షల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఖర్చులు ఎకరానికి సుమారు రూ.60వేలు ఉండగా, వరి పంటతో పోలిస్తే 7 నుంచి 8 రెట్ల అధిక ఆదాయం పొందవచ్చు.
మంజూరైన రాయితీ నిధులు ఇలా...
నాలుగు సంవత్సరాల తోటలకు రైతులు విస్తీర్ణం సబ్సిడీ రూ.కోట్లల్లో
ఒకటో సంవత్సరం 491 1856 2.820కోట్లు
రెండో సంవత్సరం 934 3933 1.652కోట్లు
మూడో సంవత్సరం 651 3290 1.340కోట్లు
నాలుగో సంవత్సరం 141 789 0.332కోట్లు
మొత్తం 2217 9768 6.144కోట్లు
రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి : పిన్నపురెడ్డి అనంతరెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, నల్లగొండ
ప్రభుత్వం ఆయిల్‌పామ్ రైతులకు రూ.6.14కోట్లకు పైగా రాయితీ నిధులను విడుదల చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. వాటిని ప్రతీ రైతు ఆయిల్‌పామ్ తోటల అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలి. ఇకపోతే 25వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగయితే జిల్లాలో ప్రత్యేకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది.ఇప్పటికి 10,700 ఎకరాల్లో సాగైంది. మరో 15వేల ఎకరాల్లో తోటలను విస్తరింపజేసేందుకు కలెక్టర్ సూచన, సహకారంతో తోటలు విస్తరింపజేసేందుకు కృషి చేస్తున్నాం.