పునరావాసం.. నిరుపయోగం
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:30 AM
పులిచింతల ప్రాజెక్టు పునరావాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు ప్రాంతాలైన మట్టపల్లి, సుల్తానపురం, గుండ్లపల్లి గ్రామాల నిర్వాసితుల కోసం పునరావాసాలు ఏర్పాటు చేశారు.
మఠంపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : పులిచింతల ప్రాజెక్టు పునరావాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు ప్రాంతాలైన మట్టపల్లి, సుల్తానపురం, గుండ్లపల్లి గ్రామాల నిర్వాసితుల కోసం పునరావాసాలు ఏర్పాటు చేశారు. గుండ్లపల్లి, సుల్తానపురంతండాలకు అధికారులు కేటాయించిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్నారు. మట్టపల్లి నిర్వాసితులకు సుల్తానపురంతండా పక్కన పెదవీడు రెవెన్యూలోని 540, 541 సర్వే నెంబరులో సుమారు 15 ఎకరాల్లో పునరావాసం కల్పనకు అన్నిరకాల చర్యలు చేపట్టారు. సుమారు 129 కుటుంబాలకు స్థలాలు కేటాయించారు. అయితే నేటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ స్థలాలు నిరుపయోగంగా మారాయి. అదేవిధంగా ఆయా స్థలంలో దట్టమైన కంపచెట్లు ఎదిగి చిట్టడివిని తలపిస్తోంది. ఈ కేంద్రంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనం, వాటర్‌ట్యాంక్‌లు వినియోగంలో లేక శిథిలావస్థకు చేరాయి. కొన్ని ధ్వంసమయ్యాయి.
అయితే మట్టపల్లి వాసులు మాత్రం పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మట్టపల్లి గ్రామాన్ని పూర్తిగా కాకుండా కొంతభాగమే ఫుల్ రిజర్వాయర్ లెవల్(ఎ్‌ఫఆర్‌ఎల్)కు తాకుతుందని సుమారు 129 కుటుంబాలే ముంపునకు గురవుతాయని తేల్చి వారికి మాత్రమే నష్టపరిహారం చెల్లించి పునరావాస కేం ద్రంలో ప్లాట్లు కేటాయించారు.గ్రామంలో మొత్తం 200 కుటుంబాలు ఉన్నాయని, గ్రామ మొత్తాన్ని ముంపులో తీసుకోవాలని కోరారు. అయితే అధికారులు అందుకు భిన్నంగా 129 మందిని మాత్రమే గుర్తించారు. దీంతో దశాబ్దాం దాటినా నేటికి బాధితులు, నిర్వాసితులు కాలనీలో ఇళ్లు నిర్మించుకోలేదు. దీంతో దట్టమైన కంపచెట్లు పెరిగి అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రం నిలయంగా మారింది. ఇప్పటికైనా అధికారులు పునరావాస కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అందరికీ న్యాయం చేయాలి
మట్టపల్లిలో అందరూ నిరాశ్రయులయ్యారు. ఆనాడు అందరికీ న్యాయం చేస్తామన్న అధికారులు ఆ తరువాత కొన్ని కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. దీనిని గ్రామస్థులంతా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం దక్కలేదు. దీంతో పునరావాస కేంద్రం నిరుపయోగంగా మారింది. ఇప్పటికైనా అధికారులు గ్రామంలోని అందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి.
రామిశెట్టి అప్పారావు, మట్టపల్లి గ్రామం
సమస్యను ఉన్నతాధికారులకు వివరించా
పులిచింతల ప్రాజెక్టులో ముంపునకు గురైన మట్టపల్లి పునరావాస కేంద్ర సమస్యను ఉన్నతాధికారులకు వివరించా. వారి ఆదేశాలకు అనుగుణంగా పునరావాస కేంద్రంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. ఖాళీగా ఉన్న స్థలంలో దట్టమైన కంపచెట్లు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. మరోమారు ముంపునకు గురైన గ్రామాల వారీతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతాం.
మంగా, మఠంపల్లి తహసీల్దార్