వర్షం.. పైపైకి భూగర్భజలం
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:53 AM
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయి. దుక్కిదున్ని, వరినారు పెంచి వర్షం కోసం ఎదురుచూస్తున్న వారికి వర్షాలు సాగుపై భరోసానిస్తున్నాయి.
పెరుగుతున్న జలమట్టం
గతేడాదితో పోల్చితే 0.940 మీటర్లపైకి నీరు
రైతులకు ఊరటనిస్తున్న ఇటీవలి వర్షాలు
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయి. దుక్కిదున్ని, వరినారు పెంచి వర్షం కోసం ఎదురుచూస్తున్న వారికి వర్షాలు సాగుపై భరోసానిస్తున్నాయి. ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. గురువారం ఉదయం నుంచి జిల్లా కేంద్రంలో మోస్తరు వర్షం పడుతూనే ఉంది. జిల్లాలో భభూగర్భజల నీటిమట్టం గతేడాది కంటే తగ్గింది. 2024లో సగటు 8.08 మీటర్ల లోతున ఉండగా, ఈ ఏడాది మే నెల చివరి నాటికి 6.69 మీటర్లకు భూగర్భజలం చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే నీటిమట్టం 0.940 మీటర్లపైకి వచ్చింది.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)
ప్రస్తుత వర్షాలు భూగర్భజలాల పెరుగుదలకు దోహదపడు తున్నాయి. ఇటీవల వర్షాలతో మోతె మండలంలోని చెరువులు నిండాయి. అనంతగిరి మండలం వాయిలసింగారం చెరువు కట్ట ప్రమాదపు అంచుల్లో ఉంది. గురువారం అన్నిచోట్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనంతగిరి మండలంలోని శాంతినగర్‌లో 11.8మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యల్పంగా 0.5 లక్కవరం రోడ్డు, తొగర్రాయిలో కురిసింది. నడిగూడెం, తుంగతుర్తి మండలాల్లో 10 మిల్లీమీటర్లు, మద్దిరాల మండలం రెడ్డిగూడెంలో, పాలకవీడు మండలం అలంగాపురంలలో 8 మిల్లీమీటర్లు, మోతె మండలం మామిళ్లగూడెంలో 7 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది.
ముమ్మరంగా సాగు పనులు
ఇటీవలి వర్షాలతో సాగు పనుల్లో రైతులు మునిగారు. వరినాట్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పత్తి విత్తనాలు వేసినా వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తలేదు. దాదాపు 18 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఎక్కడా కనీస పెట్టుబడి రాలేదు. ఈ ఏడాది జూన 1 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 212.01 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 192.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత ఏడాది ఈ కాలంలో 281.2మిల్లీమీటర్లు నమోదైంది.
మూడు గ్రామాల్లో 15 మీటర్ల లోతుల్లోకి...
జిల్లాలో ఈ ఏడాది మూడు గ్రామాల్లో 15 మీటర్ల లోతుగా నీటిమట్టం పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. తిరుమలగిరి మండలం తాటిపాముల, చింతలపాలెం మండలం దొండపాడు, చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామంలో 15 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. దీంతో సాగునీటికి కొరత ఏర్పడే అవకాశం ఉంది. మిగిలిన అన్ని మండలాల్లో 12.63 మీటర్ల వరకు నీటిమట్టం ఉంది. అయితే నాలుగు రోజుల నుంచి మాత్రమే వర్షాలు కురిసి రైతులకు ఊరటనిస్తున్నాయి.
ముందుజాగ్రత్తలు తీసుకోవాలి
భూగర్భజలాలు పెరిగేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపాధి పథకం కింద ఇంకుడుగుంతలు, నీటిని ఇంకించే రీచార్జ్ ఫీట్లను బోర్లపక్కన బిగించాలి. దీంతో వర్షం పడినప్పుడు బోర్లల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. ప్రతి రైతు పాంపాండ్స్ ఏర్పాటుచేసుకోవాలి. దీంతో రైతుల పొలాలు, చెలకలు ఎండిపోకుండా ఉంటాయి.
లాలు, భూగర్భజలవనరుల శాఖ జిల్లా అధికారి