Share News

ఎరువుల నిల్వలపై ఆరా

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:32 AM

వానాకాలం సీజన్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండగా, రెండు వారాల కిత్రం వరిని సాగుచేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్న రైతులు పంటల సాగుపై ఆశలు పెంచుకున్నారు. దీంతో వారం రోజులుగా వరి నాట్లు ఊపందుకున్నాయి.

ఎరువుల నిల్వలపై ఆరా

40 బస్తాల కంటే అధికంగా ఎవరు కోనుగోలు చేశారు ?

వివరాలు సేకరిస్తున్న అధికారులు

ఎరువుల, విత్తన దుకాణాల్లో విస్తృత తనిఖీలు

ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

సర్కారు ఆదేశాలతో క్షేత్రస్థాయికి అధికారులు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): వానాకాలం సీజన్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండగా, రెండు వారాల కిత్రం వరిని సాగుచేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్న రైతులు పంటల సాగుపై ఆశలు పెంచుకున్నారు. దీంతో వారం రోజులుగా వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎరువుల వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ప్రధానంగా యూరియా వినియోగం పెరగ్గా, రాష్ట్రానికి కేంద్రం కోటా కేటాయింపు తగ్గిందన్న వార్తల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో క్షేత్రస్థాయిలో ఎరువుల నిల్వలను ఆరా తీయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయికి కదిలారు.

జిల్లాలోని 17మండలాల్లో వానాకాలం సీజన్‌లో 4.60లక్ష ల ఎకరాల్లో రైతులు పలు రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల విక్రయాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు అందుబాటులో ఎరువులు ఉంచేందుకు చర్యలు తీసుకుంది. వారం రోజులుగా జిల్లాలో ఎరువులు, విత్తనాల విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం డీఏపీ, యూరియాతో పాటు మరికొన్ని కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం అధికంగా ఉంటుంది. పలు జిల్లాల్లో యూరియా కోసం బారులు తీరుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాల బెడద లేకుండా, డీలర్లు ఎరువుల కొరత సృష్టించకుండా తగి న చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రస్తుతం జిల్లాలో అందుబాటులోఉన్న ఎరువుల నిల్వలను రైతులకు సకాలంలో పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లాలోని అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ నిల్వలను పరిశీలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులు ఎరువుల దుకాణాలను తనిఖీచేసి రికార్డులను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2,550మెట్రిక్‌ టన్ను ల యూరియా అందుబాటులో ఉంది. మరో వారం రోజుల్లో 1,000 మెట్రిక్‌టన్నుల మేరకు యూరియా దిగుమతి కానుంది. ఈ నెల లో సుమారు 9,550 మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఎరువుల విక్రయాలపై నిఘా

రైతులకు ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించేందుకు వ్యవసాయశాఖతోపాటు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. జిల్లావ్యాప్తంగా ఎరువుల విక్రయాలపై నిఘా ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏమండలాల్లో ఎంత మేరకు యూరియాతోపాటు ఎరువుల నిల్వలు ఉన్నాయనే పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు రైతులు కొనుగోలు చేసిన వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం యూ రియా కొరత నేపథ్యంలో ఉన్నతాధికారులు జిల్లాలో 40 బస్తాల కంటే అధికంగా యూరియా కొనుగోలు చేసిన రైతుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 17 మండలాల్లో ఏడుగురు రైతులు 40బస్తాలకు మించి యూరియాను కొనుగోలు చేసినట్టు తేలింది. దీంతో పెద్ద మొత్తంలో యూరియా కొనుగోలు చేసేందుకు ఉన్న కారణాలపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎరువుల విక్రయాల ను పరిశీలించేందుకు ఇప్పటికే అధికారులు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో నాలుగు తనిఖీ బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందంలో ఇద్దరు ఏడీఈలు, ఏవోలు, పోలీసు అధికారి, కానిస్టేబుల్‌ ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే 45దుకాణాల్లో ఈ బృందాలు తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాల్లో నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించకుండా అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 229 విత్తన, ఎరువుల దుకాణాలు ఉన్నాయి. వీటిలో పీఏసీఎస్‌, ఏఆర్‌ఎ్‌సకేతో పాటు ప్రైవేట్‌ డీలర్లు ఉన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు తనిఖీ బృందాలు జిల్లా వ్యాప్తంగా ఽధరలను పరిశీలించి, ఎమ్మార్పీకే రైతులకు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అదేవిధంగా జిల్లాలో రాష్ట్రస్థాయి తనిఖీ బృందాలు కూడా పర్యటిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే జిల్లాస్థాయి, డివిజన్‌, మండల స్థాయి బృందాలు పర్యటిస్తున్నాయి. దుకాణాలను తనిఖీ చేసి డీలర్ల వద్ద ఉన్న పాత, కొత్త స్టాక్‌ వివరాలను పరిశీలిస్తున్నాయి. డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్‌ను పాత ధరలకే రైతులకు విక్రయించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది డీలర్ల వద్ద మిగిలిపోయిన ఎరువులను పాత ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఎరువుల కృత్రిమ కొరతను స్పష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డీలర్ల వద్ద స్టాక్‌ ఉన్నంత వరకు రైతులకు విక్రయించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. జిల్లాలో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎరువుల లభ్యత విషయంలో ఎలాంటి అపోహలు, ఆందోళనలు చెందవద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఎరువుల కృత్రిమ కొరతను స్పష్టిస్తే చర్యలు: జి.వీరారెడ్డి, అదనపు కలెక్టర్‌

ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టితే కఠిన చర్యలు తీసుకుంటాం. వానాకాలం సీజన్‌లో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎఫ్‌సీవో 85 చట్టం ప్రకారం కల్తీ విత్తనాలు,ఎరువులు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ ఎరువులు, విత్తనాలు అరికట్టేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నాం.

Updated Date - Aug 20 , 2025 | 12:32 AM