Share News

కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:26 AM

వానాకాలం 2025-26 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు సూచించారు.

కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి
అవగాహన శిక్షణలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హనుమంతరావు,అదనపు కలెక్టర్లు

రోజువారీ కొనుగోళ్లను నమోదుచేయాలి : కలెక్టర్‌

భువనగిరి (కలెక్టరేట్‌), అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): వానాకాలం 2025-26 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం 2025-26 ఖరీఫ్‌ సీజన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధిత అధికారులకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన, శిక్షణలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావులతో కలి సి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వానాకాలం సీజనలో ధాన్యం కొనుగోలుకోసం ముందస్తు ప్రణాళికలు తయారుచేసుకొని, కొనుగోలుకేంద్రాల ఏర్పాటు నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకొని కేంద్రాల వద్ద మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఐకేపీ, సమభావన సంఘాల సభ్యులు, ప్రాథమిక వ్యవసా య పరపతి సంఘాల ద్వారా సుమారు 322 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాస్థాయి ధాన్యం కొనుగోళ్ల కమిటీ ద్వారా ప్రభుత్వ సూచనల ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించి కోటిమంది మహిళలను కోటీశ్వరుల ను చేయాలనే ప్రభుత్వ సంకల్పం జిల్లాలో అమలు చేయాలన్నారు. వివిధ కేంద్రాల్లో ప్రతీరోజు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించడానికి హమాలీలు, లారీలను సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. ఏ-గ్రేడ్‌ వరిధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకం క్వింటాకు రూ.2369గా ప్రభు త్వం మద్దతు ధర ప్రకటించిందని, రైతులు విక్రయించిన ధాన్యానికి వారి ఖాతాల్లో వెంటనే జమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి రమణారెడ్డి, డీసీవో శ్రీధర్‌, డీఎం హరికృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఆలేరు: అడ్వాన్స్డ టెక్నాలజీ సెంటర్‌(ఏటీసీ)లో శిక్షణ పొందిన వారికి భవిష్యత బాగుంటుందని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో తప్పక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. మండల కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఏటీసీని కలెక్టర్‌ మంగళవారం పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి శిక్షణ పూర్తి చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ హరికృష్ణ, ఏటీసీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 12:26 AM