Share News

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:15 AM

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కే.రామకృష్ణారావు అన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ రామకృష్ణారావు

భువనగిరి (కలెక్టరేట్‌), జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కే.రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, ఆయిల్‌పామ్‌ పంటల సాగు, భూభారతి తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్లు జీ.వీరారెడ్డి, భాస్కరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 2.30లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను జారీ చేయగా, లక్షకు పైగా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ సీనరేజీని రద్దు చేసిందన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పెండింగ్‌ పనులను లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అదేవిధంగా పీఎం ఆవాస్‌ యోజన 2.0 కింద లక్షా 13 వేల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వన మహోత్సవం కింద పంపిణీ చేసే మొక్కలను నాటడమే కాకుండా సంరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ జిల్లాలో ఎరువుల లభ్యత, నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రస్తుతం జూలై వరకు నిల్వలు ఉన్నాయన్నారు. పీఏసీఎ్‌సలు, ఎరువుల దుకాణాల వద్ద కొరత రాకుండా చూడాలన్నారు. 1.25లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యంగా నిర్దేశించుకొని, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులలో వచ్చిన 8.27లక్షల దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలి

అన్ని శాఖల అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. సీఎ్‌సతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో అధికారులు పని చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వన మహోత్సవం కోసం మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, డీఆర్డీవో టీ.నాగిరెడ్డి, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:15 AM