Share News

పండ్ల తోటలకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:40 AM

ప్రజల అవసరాలకు అనుగుణంగా పండ్లు, కూరగాయలు రాష్ట్రంలో, జిల్లాలో కొరత ఉంది. దీంతో పక్క రాష్ట్రాల నుంచి పండ్లు దిగుమతి అవుతున్నా యి. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లాలో పండ్ల తోటలను విధిగా సాగుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

పండ్ల తోటలకు ప్రోత్సాహం

ఉపాధి హామీ కింద పనులు

ఐదు ఎకరాలలోపు చిన్న, సన్నకారు రైతులకు అవకాశం

ఈ ఏడాది లక్ష్యం 300ఎకరాలు

ఇప్పటివరకు 210.7ఎకరాల గుర్తింపు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ప్రజల అవసరాలకు అనుగుణంగా పండ్లు, కూరగాయలు రాష్ట్రంలో, జిల్లాలో కొరత ఉంది. దీంతో పక్క రాష్ట్రాల నుంచి పండ్లు దిగుమతి అవుతున్నా యి. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లాలో పండ్ల తోటలను విధిగా సాగుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు పండ్ల తోటలను సాగు చేసే రైతుల ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. సంప్రదాయ పంటలను సాగుచేస్తున్న రైతులను పండ్ల తోటల సాగువైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంది. జిల్లాలో పండ్ల తోటల సాగుకు ఉద్యానశాఖతోపాటు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. తద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స) ద్వారా పనులు నిర్వహించనుంది. జిల్లావ్యాప్తంగా ఐదు ఎకరాలలోపు చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించనుంది. ఈ ఏడాది 300 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయాలన్నది లక్ష్యం. ఈమేరకు గ్రామీణాభివృద్ధిశాఖ మండలాల వారీగా తోటల సాగు లక్ష్యాన్ని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. జిల్లా లో 17 మండలాలు, 428 పంచాయతీల్లో ఇప్పటివర కు 210.7ఎకరాలను అధికారులు పండ్ల తోటల సాగు కు గుర్తించారు. తోటల సాగుకు ఆసక్తి ఉన్న రైతులు ముందుకొస్తే వారికి ప్రభుత్వ సాయాన్ని మంజూరు చేసేందుకు డీఆర్‌డీఏ అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులు అర్హులు

ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలాల వారీగా పండ్ల తోటల పెంపకానికి జిల్లా అధికారులు లక్ష్యాన్ని నిర్ణయించారు. ఐదు ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులను అర్హులుగా అధికారులు గుర్తించనున్నారు. క్షేత్రస్థాయిలో మండల అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది ఆసక్తి ఉన్న రైతులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మామిడి, నిమ్మ, నారింజ, జీడి మామిడి, జామ, సీతాఫలం, సపోటా, ఆయిల్‌పామ్‌, నేరేడు, యాపిల్‌బేర్‌, దానిమ్మ, మునగ, డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి పండ్ల తోటలను భూముల పరిస్థితికి అనుగుణంగా రైతులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. మొక్కలను ప్రభుత్వం ఎంపిక చేసిన నర్సరీల నుంచి తెచ్చుకోవచ్చు. అవి నచ్చని పక్షంలో రైతులు వారికి నచ్చిన నర్సరీల నుంచికూడా మొక్కలు కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

300ఎకరాల లక్ష్యం

జిల్లాలో ఈ ఏడాది 300 ఎకరాల్లో పండ్ల తోటల సాగు చేయాలన్నది లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. కాగా, ఇప్పటివరకు 210.7ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు వచ్చారు. గుర్తించిన రైతుల భూముల్లో పండ్ల మొక్కలు నాటేందుకు గుంతలు తీసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పలుచోట్ల గుంతలు తీయడం కూడా పూర్తయింది. ప్రస్తుత వర్షాకాలంలో వానలు కురవగానే మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టనున్నారు.

నిర్వహణ ఖర్చులు సైతం

పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలు అందజేయనుంది. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు అధికారులు తవ్విస్తారు. మొక్కల రవాణా, నాటడం ఉపాధి హామీ కింద చేపట్టనున్నారు. మొక్క నాటే సమయంలో కొన్ని రకాల ఎరువులు అందజేస్తారు. ఆ తర్వాత మొక్కలు ఎదిగేలా నీటిని అందించేందుకు సైతం చేయూత ఇస్తారు. ఇలా మూడేళ్ల పాటు నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో జిల్లాలో పలుచోట్ల ఈ పథకం కింద రైతులు పండ్ల తోటల పెంపకం చేపట్టి ఆదాయం పొందుతున్నారు.

ఉపాధి హామీ కింద పండ్ల తోటల పెంపకం : నాగిరెడ్డి, డీఆర్‌డీఏ

ఉపాధి హామీ పథకం కిం ద పండ్ల తోటల పెంపకాని కి ప్రభుత్వం ప్రోత్సాహకా లు అందజేస్తోంది. ఈ ఆర్థి క సంవత్సరంలో 300ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటివరకు 17 మండలాల్లో 210.07 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి రైతులను గుర్తించాం. గుంతలు తీయడం, మొక్కలు ఎంపిక చేయడం వంటివి రైతులకు వివరిస్తున్నాం. జిల్లాలో ఆసక్తి ఉన్న రైతులు ముందుకు వచ్చిన పక్షంలో వారికి కూడా అవకాశం కల్పిస్తాం.

Updated Date - Jul 15 , 2025 | 12:40 AM