అబార్షన వికటించి గర్భిణి మృతి
ABN , Publish Date - May 22 , 2025 | 12:26 AM
అబార్షన వికటించి గర్భిణి మృతి చెందింది. మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బయ్య నగే్‌ష-అనూష(25) దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా అనూష మరోసారి గర్భం దాల్చింది.
సూర్యాపేట క్రైం : అబార్షన వికటించి గర్భిణి మృతి చెందింది. మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బయ్య నగే్‌ష-అనూష(25) దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా అనూష మరోసారి గర్భం దాల్చింది. జన్మించేది మగ పిల్లాడా? ఆడపిల్లా? తెలుసుకునేందుకు సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీని సంప్రదించారు. ఆయన నకిరేకల్‌లోని ఓ స్కానింగ్ సెంటరుకు ఆర్‌ఎంపీ అనూషను తీసుకువెళ్లి స్కానింగ్ తీయగా పుట్టబోయేది ఆడపిల్లగా నిర్ధారణ అయింది. దీంతో అనూష అబార్షన చేయించుకోవాలని నిర్ణయించుకుని ఆ బాధ్యత ఆర్‌ఎంపీకి అప్పగించారు. ఆయన సూర్యాపేటలోని రామలింగేశ్వర థియేటర్ సమీపంలోని ఓజో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అనూషకు అబార్షన చేయడానికి వైద్యులు యత్నించగా, వైద్యం వికటించి పెద్ద మొత్తంలో రక్తస్రావం అయింది. అనూష పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి యాజమాన్యం అంబులెన్సలో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ అనూష ఈ నెల 18న మృతి చెందింది. అనూషకు అదేరోజు రాఘవాపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికుల ద్వారా విషయం వెలుగుచూసింది. ఇదిలా ఉండగా అనూషకు ఆపరేషన చేసిన ఓజో ఆసుపత్రి వైద్య ఆరోగ్య శాఖ అనుమతిలేదు. కొన్నినెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తుంటే వైద్య ఆరోగ్యశాఖాధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో అబార్షన, గర్భ నిర్ధారణ స్కానింగ్‌లు చేయడంతో ఆసుపత్రి నిర్వాహకుడితో పాటు వైద్యులపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. కానీ నిర్వాహకులు మాత్రం అదే భవనంలో మరో పేరుతో యథేచ్చగా ఆస్పత్రిని నిర్వహిస్తూ మరో మహిళ మృతికి కారకులయ్యారు. ఆస్పత్రి యాజమాన్యం ఆస్పత్రిని మూసివేసి బోర్డును తొలగించి పరారైనట్లు సమాచారం.