Share News

బూరుగడ్డలో ప్రభుత్వ భూమి సర్వేకు సానుకూలత

ABN , Publish Date - May 15 , 2025 | 12:24 AM

హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డ గ్రామంలో వ్యవసాయ యూనివర్సిటీ భూసేకరణకు రైతుల నుంచి గ్రీనసిగ్నల్‌ లభించింది. ఈ నెల 3, 5, 6 తేదీల్లో భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు ఎట్టకేలకు బుధవారం శాంతించారు.

బూరుగడ్డలో ప్రభుత్వ భూమి సర్వేకు సానుకూలత
బూరుగడ్డ గ్రామంలోని సర్వే నెంబరు 604లో సర్వే చేస్తున్న బృందాలు

ఐదు బృందాలతో సర్వే

హుజూర్‌నగర్‌ , మే 14 (ఆంధ్రజ్యోతి) : హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డ గ్రామంలో వ్యవసాయ యూనివర్సిటీ భూసేకరణకు రైతుల నుంచి గ్రీనసిగ్నల్‌ లభించింది. ఈ నెల 3, 5, 6 తేదీల్లో భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు ఎట్టకేలకు బుధవారం శాంతించారు. తహసిల్దార్‌ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు సర్వేయర్ల బృందం సర్వే నెంబరులో 604 ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు రాగా కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ నెల 8న ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులు రైతులతో చర్చించారు. ఇందులో బూరుగడ్డ శ్రీవేణుగోపాలస్వామి దేవాలయ భూములకు యూనివర్సిటీ కోసం సేకరించాలని నిర్ణయించారు. ఈ నెల 12న 100 ఎకరాల ఆలయ భూమిని సర్వేచేశారు. దీని అనంతరం బుధవారం బూరుగడ్డ 604 సర్వే నెంబర్‌లోని 164 ఎకరాల ప్రభుత్వ భూములను సర్వే చేపట్టారు. ప్రభుత్వ భూమిలోని మొత్తం విస్తీర్ణం హద్దులను నిర్ణయించిన తర్వాత ఏ రైతు వద్ద ఎన్ని ఎకరాల భూమి ఉందో సర్వేలో తేల్చనున్నారు. బుధవారం రైతుల నుంచి సానుకూలత లభించిన నేపథ్యంలో వారం రోజుల్లో సర్వే బృందాలు భూమి కొలతలను పూర్తి చేయనున్నాయి. అధికారుల వద్ద ఉన్న మ్యాప్‌ ప్రకారం సర్వే చేపట్టారు. డొంకలు, రోడ్లు, జాలు కాలువలు, కుంటలు, అదేవిధంగా కాలవల ప్రకారం హద్దులు నిర్ణయించనున్నారు. 1928 గ్రామ నక్షా ప్రకారం జీపీఎస్‌ ద్వారా ప్రభుత్వ భూమిని గుర్తిస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి, ఆర్‌ఐ షరీఫ్‌, డివిజన్‌ సర్వేయర్లు వంశీధర్‌, పున్నా మంజుల, శ్రీనివాస్‌, గాయత్రి, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:24 AM