వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:38 AM
సూర్యాపేట జిల్లాలో అటవీశాతాన్ని పెంచేందుకు అఽధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వనమహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
సూర్యాపేట జిల్లాలో అటవీశాతాన్ని పెంచేందుకు అఽధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వనమహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 59 లక్షలకు పైగా వివిధ రకాల మొక్కలు నాటేందుకు అఽధికారులు ప్రణాళిక రూపొందించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏపుగా పెరిగిన మొక్కలను నాటాలని సూచించారు. దీంతో ఈసారి మరింత పకడ్బందీగా మొక్కలను నాటి సంరక్షించడానికి చర్యలు తీసుకున్నారు.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్)
ఈ ఏడాది వనమహోత్సవం కోసం అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గతంలో నాటిన మొక్కలు ఆశాజనకంగా పెరగకపోవడంతో ఈసారి పకడ్బందీగా చర్యలు చేపట్టనున్నారు. మొక్కల సంరక్షణ పక్కాగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. గ్రామాల్లోని నర్సరీల్లో పెంచిన మొక్కలను కావాల్సిన ప్రాంతాలకు తరలించి నాటించడానికి వివిధ శాఖల అధికారులు ప్రణాళికలను తయారుచేస్తున్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలను గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలు, పట్టణాల్లో అయితే మహిళా సంఘాలకు అప్పగించనున్నారు.
480 నర్సరీల్లో మొక్కల పెంపకం
జిల్లాలో ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో 59 లక్షలకు పైగా మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందుకోసం అటవీశాఖ ఆఽధ్యర్యంలో ఐదు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 475 నర్సరీలను ఇప్పటికే ఏర్పాటుచేసి 40.47లక్షల మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలో ఉన్న ప్రతీ కుటుంబానికి మొక్కలను పంపిణీ చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. గతంలో మాదిరిగానే పండ్ల మొక్కల(జామ, నిమ్మ, ఉసిరి, సీతాఫలం, అల్లనేరేడు)తో పాటు ఔషధ మొక్కలను పంపిణీ చేయడం కోసం జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమం విజయవంతానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో పాటుగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఆయా స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువజన సంఘాలు, ప్రజల సహకారంతో వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆయా గ్రామపంచాయతీ చెరువుల కట్టలపై, ఖాళీ స్థలాల్లో ఈత, ఖర్జూర మొక్కలను నాటడం కోసం నర్సర్సీల్లో మొక్కలను సిద్ధం చేసుకున్నారు. వ్యవసాయ భూముల్లో, గట్లపైన టేకు, సుబాబుల్, యూకలిప్టస్, ఈత, ఖర్జూర, వంటి మొక్కలను నాటనుండగా, ఖాళీ స్థలాలు, గ్రామీణ రోడ్లు, రహదారులకు ఇరువైపులా వేప, కానుగ, వంటి మొక్కలను నాటుతారు.
త్వరలో మొక్కలు నాటేందుకు చర్యలు
త్వరలో మొక్కలు నాటేందుకు చర్యలు చేపడతాం. ఇప్పటికే వివిధశాఖలకు లక్ష్యాలను కేటాయించాం. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. కేవలం ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సం స్థలు, పాఠశాలలు, కళాశాలల్లో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. అటవీ శాతం పెరిగితేనే పర్యావరణాన్ని పరిరక్షించే అవకాశం ఉంటుంది. జిల్లా అంతటా ఒకే రోజు పెద్దఎత్తున ఎక్కువ మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
తేజస్ నందలాల్ పవార్, కలెక్టర్, సూర్యాపేట జిల్లా