Share News

మూడు నెలలుగా ‘మీన’మేషాలు

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:56 PM

‘అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని తీరులా’ మత్స్యశాఖ పనితీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మూడు నెలలుగా ‘మీన’మేషాలు

‘అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని తీరులా’ మత్స్యశాఖ పనితీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువుల్లో సమృద్ధిగా నీరున్నా సకాలంలో చేపపిల్లలను వదలడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. జూన, జూలైలలో చేపట్టాల్సిన చేపల పంపిణీ అక్టోబరు ప్రారంభమైనా టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించలేదు. చేప ఎదిగే సమయమంతా గడిచిపోతోందని, ఆలస్యంగా పంపిణీ చేస్తే ఎదుగుదల నిలిచి ఆదాయం తగ్గుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యానికి తోడు ఎన్నికల కోడ్‌ రావడంతో టెండర్ల ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందనన్న ఆందోళనలో ఉన్నారు.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)

మత్స్యకారులను ఆర్థికంగా నిలబెట్టేందుకు గత ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీ, పెంపకం పథకాన్ని తీసుకువచ్చింది. టెండర్ల ద్వారా చేపపిల్లలను తెప్పించడం వాటిని చెరువుల్లో వదలడం వంటి బాధ్యతలు మత్స్యశాఖ చేపడితే, చేపల పెంపకం బాధ్యత మత్స్యకార్మిక సంఘ సొసైటీ సభ్యులు చేపట్టేవారు. పెరిగిన చేపలను విక్రయించి ఆ ఆదాయాన్ని పొందేవారు. ఆ మేరకు కొన్నేళ్లుగా నడుస్తూ వస్తోంది.అయితే ఈ ఏడాది అక్టోబరు వచ్చినా నేటికీ టెండర్లు పిలవకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువుల్లోకి నీరు చేరింది. అయితే వరద నీటి సమయమైన జూన, జూలైలలో టెండర్లు వేసి చేపలను వదిలితే ప్రస్తుత వరద నీరు చేపల ఎదుగుదలకు ఉపయోగపడేది. ప్రస్తుతం ఇంకా టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించలేదు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి చేపలను చెరువుల్లో వదలడానికి నెల రోజులు పట్టే అవకాశం ఉంది. సమయం దాటిన తర్వాత చేపలను వదిలితే ఎదుగుదల అంతగా ఉండదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

లెక్కాపత్రం ఏది?

చెరువుల్లో చేపపిల్లల పంపిణీపై స్పష్టత కరువైందని మత్స్యకార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లోపంతో పాటు కాంట్రాక్టర్‌ చెబుతున్న మేర చేపపిల్లలను పంపిణీ చేయడం లేదంటున్నారు. గతేడాది సరఫరా చేసిన చేపపిల్లలు నాణ్యతగా లేవని, ఆశించిన స్థాయిలో పెరగలేదని ఆరోపిస్తున్నారు. కోట్లలో చేపపిల్లలు వదులుతున్నట్లు పేర్కొంటున్నా చేపపిల్లలు వదిలే సమయాల్లో కనీసం కాంట్రాక్టర్‌ ఎన్ని చేపపిల్లలు సరఫరా చేశారో లెక్క చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయలు నీళ్లలో పోసిన విధంగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. చేపపిల్లలను డబ్బాల్లో, ప్యాకెట్లలో తెస్తుండగా అందులో ఎన్ని చేపపిల్లలు ఉన్నా యనే విషయాన్ని ఏఅధికారి కూడా పరిశీలించడం

లేదని, గుత్తేదారు చెప్పిన లెక్క ప్రకారమే రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నట్లు మత్స్యకార్మికులు పేర్కొంటు న్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడుతోందని, ఈసారైనా అధికారులు చేపపిల్లలను సరఫరా చేసే సమయాల్లో, చెరువుల్లో చేపలను వదిలే సందర్భంలో పక్కా లెక్కింపు చేపట్టాలని కోరుతున్నారు. 80 నుంచి 100 ఎంఎం సైజు ఒక రకం, 35 నుంచి 40 ఎంఎం సైజు మ రో రకం చేపలను వదలాల్సి ఉండగా నాణ్యత లేని పిల్లలను వదులుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మూడేళ్లుగా ఇలా...

జిల్లాలో గ్రామపంచాయతీల్లోని చెరువులతో పాటు ఇరిగేషన్‌ శాఖ ఆధీనంలోని చెరువుల్లో చేపల పెంపకానికి చర్యలు చేపట్టారు. అయితే వాటిని సంరక్షించే బాధ్యత మత్సకారులు అప్పగిస్తుంటారు. జిల్లాలో 154 మత్స్యసహకార సంఘాలు ఉండగా అందులో 15,540మంది సభ్యులు ఉన్నారు. చేపల పెంపకం అనంతరం విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మత్స్యకారులు పొందుతారు. అయితే గతేడాది నీటి లభ్యత అంతగా లేక 315 చెరువుల్లో 1.01 కోట్ల చేపపిల్లలను పెంచారు.

టెండర్‌ ప్రక్రియ త్వరగా ప్రారంభించాలి

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టెండర్‌ ప్రక్రియ ప్రారంభించాలి. సరైన సమయంలో చేప పిల్లలను వదలకపోతే సరైన ఎదుగుదల లేక దిగుబడి రాదు. అధికారులు గతంలో మాదిరిగానే కావాలనే టెండర్‌ ప్రక్రియ ఆలస్య చేస్తున్నారు.

-ఈదుల యాదగిరి, మత్స్యకార్మిక సంఘ నాయకుడు

త్వరలోనే వేలం నిర్వహిస్తాం

త్వరలోనే చెరువుల వేలం నిర్వహిస్తాం. చేపల పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటాం. మత్స్యకార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుంది. ఎన్న్లికల కోడ్‌ను దృష్టిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

నాగులునాయక్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి

Updated Date - Oct 08 , 2025 | 11:56 PM