పట్టుదలకు.. సరస్వతీ ప్రసన్నం
ABN , Publish Date - May 20 , 2025 | 02:18 AM
పట్టుదలకు మారుపేరుగా నిలుస్తోంది పుట్టల ప్రసన్న. తల్లిదండ్రులు చిన్నతనంలోనే దూరమైనా నానమ్మ సంరక్షణలో పెరిగి దీక్షగా చదివింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇచ్చిన స్ఫూర్తితో హాస్టల్‌లో అదనంగా గంట పాటు చదివి అందరికంటే చివరగా నిద్రపోయేది.
పేదింట విరిసిన విద్యాకుసుమం
తల్లిదండ్రుల మృతితో నానమ్మ సంరక్షణలో ప్రసన్న
మొదటిర్యాంక్ వస్తే విమానం ఎక్కిస్తానన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రేరణగా తీసుకుని సాధించిన ప్రసన్న
ఎస్‌వోతో కలిసి వైజాగ్‌లో మూడు రోజుల పర్యటన
(ఆంధ్రజ్యోతి-మాడ్గులపల్లి): పట్టుదలకు మారుపేరుగా నిలుస్తోంది పుట్టల ప్రసన్న. తల్లిదండ్రులు చిన్నతనంలోనే దూరమైనా నానమ్మ సంరక్షణలో పెరిగి దీక్షగా చదివింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇచ్చిన స్ఫూర్తితో హాస్టల్‌లో అదనంగా గంట పాటు చదివి అందరికంటే చివరగా నిద్రపోయేది. కృషికి తగ్గట్టుగా 600లకు 563 మార్కులు(10జీపీఏ) సాధించి నల్లగొండ జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల్లో టాపర్‌గా నిలిచింది. కలెక్టర్ అన్ని ఖర్చులు భరించి విమానంలో విహారయాత్రకు పంపించారు. విశాఖపట్నంలో పర్యటించి సోమవారం స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆమె ఆంధ్రజ్యోతితో ముచ్చటించింది. డాక్టరై పేదలకు సేవ చేస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలకేంద్రానికి చెందిన పుట్టల గాబ్రియేల్, శైలజ దంపతులకు ఇద్ద రు సంతానం ప్రసన్న, ప్రమోద్‌లు. కూలీనాలి పను లు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. 2014 గాబ్రియేల్, 2015లో శైలజ అనారోగ్యంతో మృతి చెం దారు. అప్పటికి ప్రసన్న వయస్సు ఐదేళ్లు కాగా ప్రమోద్ వయస్సు మూడేళ్లు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే దూరంకావడంతో నానమ్మ సుశీల సంరక్షణ లో పెరిగారు. ఆమె కూలీనాలి చేస్తూ వారిని పోషిస్తోంది. తన ప్రతిభతో ప్రసన్న గురుకులలో సీటు సాధించింది. తల్లిదండ్రులు తమను బాగా చదివించాలని అనుకునేవారని నానమ్మ ద్వారా తెలుసుకున్నారు. కష్టపడి చదువుతూ ప్రతీ తరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తూ వస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు వేములపల్లిలోని రవీంద్రభారతి పాఠశాలలో, 6వ తరగతి మోడల్ స్కూల్‌లో చదివింది. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాడ్గులపల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యనభ్యసించింది. తమ్ముడు ప్రమోద్ ప్రస్తుతం 9వ తరగతి వేములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. ధైర్యాన్ని కోల్పోకుండా తల్లిదండ్రుల కలలను నెరవేర్చేందుకు చిన్నతనం నుంచి చదువులో ముందుంటున్నారు. సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి నిలపుతున్నారు.
ప్రసన్నే స్ఫూర్తి....
నానమ్మ ఒడిలో పెరిగిన ఆ ప్రసన్న తన కష్టాల ను అధిగమించి చదువుపైనే దృష్టిని కేంద్రీకరించి ఉత్తమ ఫలితాలను సాధించింది. ప్రసన్నను ఆదర్శం గా తీసుకుని గురుకులంలోని విద్యార్థినులు తాము కూడా కష్టపడి చదివి అనుకున్నది సాధిస్తామంటున్నారు. ప్రసన్న కష్టించిన తీరు మాకు ఆదర్శంగా నిలుస్తుందంటున్నారు.
ప్రేరణ కల్పించిన కలెక్టర్ హామీ
నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా వ్యాప్తంగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల సందర్శనలో భాగంగా మాడ్గులపల్లి కేజీబీవీని సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఆ సందర్భంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను విశాఖపట్టణంకు సొంత ఖర్చులతో విమానం ఎక్కించి అక్కడ అయ్యే ఖర్చులను సైతం తానే భరిస్తానని తెలిపారు. కలెక్టర్ మాటలతో ప్రసన్న ప్రేరణ పొందింది. ప్రతీ రోజూ అందరికంటే ఒక గంట ఎక్కువగా (రాత్రి 11 గంటల వరకు) చదివి నిద్రపోయేది. అందరితో పాటే ఉదయం 4.30 గంటలకే నిద్రలేచేది. ప్రతీ పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా చదవడం, అర్థం చేసుకోవడం కోసం మరింత శ్రమించింది. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో కష్టపడి చదివి పరీక్షలు రాసింది. పదవ తరగతిలో 563 మార్కులు(10జీపీఏ) సాధించి నల్లగొండ జిల్లా స్థాయి కేజీబీవీలో మొదటి ర్యాంక్ సాధించింది.
విమానంలో విహారయాత్రకు...
నల్లగొండ జిల్లా స్థాయి కేజీబీవీల్లో మొదటి ర్యాంక్ సాధించిన ప్రసన్న విషయం తెలుసుకు న్న కలెక్టర్ ఇలా త్రిపాఠి బాలికతో పాటు ఆమె విజయానికి కృషి చేసిన కేజీబీవీ ఎస్‌వో సునీత ను తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు. తాను ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తమ మార్కులు సాధించిన ప్రసన్నతో పాటు ఎస్‌వో సునీతను సొంత ఖర్చులతో విమానంలో విశాఖపట్టణం వెళ్లేందుకుగాను విమాన టికెట్లను అం దించారు. దీంతో ప్రసన్న, సునీతలు ఈ నెల 17న విశాఖపట్టణానికి వెళ్లి మూడు రోజులపా టు అక్కడ జూ పార్క్, కైలసిగిరి, రుషికొండ, స బ్‌మరైన్ బీచ్‌తోపాటు పలు అందమైన ప్రదేశాల ను తిలకించి ఆహ్లాదాన్ని పొందారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
డాక్టర్ అయి పేదలకు సేవచేస్తా : పుట్టల ప్రసన్న, విద్యార్థిని
కలెక్టర్ ఇచ్చిన ప్రేరణతో కష్టపడి చదివి పదవ తరగతి లో ఉత్తమ మార్కులు సాధించా. కలెక్టర్ మేడం సొంత ఖర్చులతో నన్ను, ఎస్‌వో మేడం సునీతను విశాఖపట్టణం పంపించారు. అక్కడ మేము పలు అందమైన ప్రదేశాలను చూశాం. తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ నాన మ్మ సంరక్షణలో పెరిగి కష్టపడి చదివి మంచి మార్కులు సాధించా. చదువుకు పేదరికం అడ్డుకాదు. భవిష్యత్‌లో మెడిసిన్ చదివి డాక్టర్ అయి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తా.
మా విద్యార్థిని చూసి సంతోషంగా ఉంది : సునీత, మాడ్గులపల్లి కేజీబీవీ, ఎస్‌వో
పదవ తరగతి ఫలితాల్లో మా పాఠశాలకు చెందిన విద్యార్థిని ప్రసన్న ఉత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సా ధించడం సంతోషంగా ఉంది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎక్కువ మార్కులు వచ్చిన వా రిని సొంత ఖర్చులతో విశాఖపట్టణం పంపిస్తానని చెప్పగా అందుకు ప్రసన్న ఎంపిక కావడం ఆనందంగా ఉంది. విశాఖపట్టణంలో పలు ప్రదేశాలను తిరిగి చూశాం. కలెక్టర్ హామీ మరెంతోమంది పేద విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుంది.
అన్నీ తానై చూసుకుంటున్నా : సుశీల, ప్రసన్న నానమ్మ
నా కొడుకు, కోడలు అనారోగ్యంతో చనిపోయారు. దీంతో వారి పిల్లలు ప్రసన్న, ప్రమోద్ బాగోగులు నాన్నమ్మగా అన్ని నేనే చూసుకుంటూ చదివిస్తున్నా. నా మనుమరాలు ప్రసన్న మొదటి నుంచి చదువులో ముందుంటుంది. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించడంతో కలెక్టర్ నా మనుమరాలిని విమానంలో విశాఖపట్టణానికి పంపించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం నా మనుమరాలి, మనుమడి చదువుకు సహాయ, సహకారాలు అందించాలి.