‘పల్లె నిద్ర’తో ప్రజలకు ప్రయోజనం
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:28 AM
అధికారుల ‘పల్లె నిద్ర’తో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని దూదివెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ పల్లెనిద్ర నిర్వహించారు.
కలెక్టర్ హనుమంతరావు
దూదివెంకటాపూర్‌లో కలెక్టర్ పల్లె నిద్ర
రాజాపేట, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): అధికారుల ‘పల్లె నిద్ర’తో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని దూదివెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ పల్లెనిద్ర నిర్వహించారు. గురువారం ఉదయం 5.30గంటలకు వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో కలియ తిరిగారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మురుగు కాల్వలు, తాగునీటి ట్యాంకులు, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి పలు సూచనలు చేశారు. గ్రామంలో వైద్య, పశు వైద్య శిబిరాలను, నూతన బస్ సర్వీసును ప్రా రంభించారు. ప్రాథమిక పాఠశాల ఆవరణలో, చెరువు పక్కన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ, అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి బస్సు సౌకర్యం లేదని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించారు. అదేవిధంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉండటంతో కలెక్టర్ ఆదేశంతో విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరించారు. కాగా, కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జడ్పీ సీఈవో శోభారాణి, పలు శాఖల అధికారులు నాగిరెడ్డి, సునంద, డాక్టర్ మనోహర్, జానయ్య, మోతీలాల్, విష్ణుమూర్తి, నాగవేణి ఉన్నారు.
చేనేత కళ అద్భుతమైనది
(ఆంధ్రజ్యోతి, భువనగిరి కలెక్టరేట్): చేనేత కళ అద్భుతమైనదని, కార్మికులు మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన డిజైన్లు రూపొందించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయిగిరి నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన చేనేత కార్మికుల భారీ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రాంభించారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్‌లో చేనేత దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటీవల భూదాన్‌పోచంపల్లిని ప్రపంచ సుందరీమణులు సందర్శించి చేనేత వస్త్రాలను ధరించడంతో ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు వస్తుందన్నారు. చేనేత సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలుచేస్తోందన్నారు. అనంతరం పలువురు కార్మికులకు ‘నేతన్నకు చేయూత, నేతన్న బీమా’ చెక్కులను అందజేశారు. చేనేత రంగంలో కృషి చేసిన కార్మికులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, డీవోలు రాజేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణ, చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు.