Share News

జిల్లాకు కొత్త భవనాలు

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:25 AM

రెవెన్యూ కార్యాలయాలకు భవనాల్లేక ప్రజలు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. రూ.24.50 కోట్లతో జిల్లాలోని రెండు ఆర్డీవో, ఐదు తహసీల్దార్‌ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదించింది.

జిల్లాకు కొత్త భవనాలు

రెండు ఆర్డీవో, ఐదు తహసీల్దార్‌ కార్యాలయాల నిర్మాణం

రూ.24.50 కోట్లతో ప్రతిపాదించిన ఆర్‌అండ్‌బీ

తీరనున్న ప్రజల ఇబ్బందులు

భువనగిరి టౌన్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ కార్యాలయాలకు భవనాల్లేక ప్రజలు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. రూ.24.50 కోట్లతో జిల్లాలోని రెండు ఆర్డీవో, ఐదు తహసీల్దార్‌ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదించింది. రూపొందించిన అంచనాలను ప్రభుత్వానికి నివేదించింది. దీంతో అనుమతులు, నిధుల మంజూరు జరిగిన వెంటనే కార్యాలయాల నిర్మాణ పనులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులు భావిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ మంత్రిగా ఉండటంతో అనుమతులు, నిధులు త్వరగానే వస్తాయని ఆ శాఖతోపాటు రెవెన్యూ శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు.

ఏడు భవనాలు.. రూ.24.50కోట్లు

జిల్లాలో 17మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలున్నాయి. కా నీ కొన్ని కార్యాలయాల, భవనాలు శిథిలావస్థకు చేరడం, మరికొన్ని ఇరు కు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రూ. 24.50కోట్లతో రెండు ఆర్డీవో కార్యాలయాలు, ఐదు తహసీల్దార్‌ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదించింది. రూ.4.50కోట్ల చొప్పున రూ.9కోట్లతో భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్డీవో కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించనున్నారు. రూ.3.10కోట్ల చొప్పున రూ.15.50కోట్లతో భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, మోటకొండూరు, అడ్డగూడూరు, వలిగొండ తహసీల్దార్‌ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తారు. అనుమతులు రాగానే ప్రస్తుతం సొంత భవనాలు ఉన్న స్థలంలోనే నూతన కార్యాలయాలు నిర్మించాలా? లేక నూతన కార్యాల యం నిర్మాణానికి స్థల సేకరణ జరపాలోనని రెవెన్యూ అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే అద్దె లేదా ఇతర ప్రభుత్వ శాఖల భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్‌ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణానికి స్థల సేకరణ తప్పనిసరి కానుంది. ఏదేమైనా నూతన భవనాల ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే రెవెన్యూ శాఖతోపాటు ప్రజలకు శిథిల, ఇరుకు భవనాల ముప్పు తప్పనుంది.

Updated Date - Jun 04 , 2025 | 12:26 AM