Share News

ఎత్తిపోతల పథకాలతో కొత్త ఆయకట్టు

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:05 AM

సూర్యాపేట జిల్లాలో నూతన ఎత్తిపోతల పథకాలతో కొత్తగా 1,39,037ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి అన్నారు.

ఎత్తిపోతల పథకాలతో కొత్త ఆయకట్టు
అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

1,39,037 ఎకరాలకు సమృద్ధిగా నీరు

యుద్ధ ప్రాతిపదికన పనుల పూర్తికి ఆదేశాలు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లాలో నూతన ఎత్తిపోతల పథకాలతో కొత్తగా 1,39,037ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల పురోగతిపై సోమవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హుజూర్‌నగర్‌ ప్రాంతంలోని చివరి ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతలపథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీలు పనుల పూర్తికి లక్ష్యాలను పెట్టుకుని వేగంగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణ విషయంలో కలెక్టర్‌ను భాగస్వామ్యం చేసి సత్వరమే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో నీటిలభ్యత అనుగుణంగా పథకాలను నిర్మించ తలపెట్టామని, అయితే పనుల్లో వేగాన్ని పెంచి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎత్తిపోతల పథకాలు పూర్తయితే హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో 82,341 ఎకరాల కొత్త ఆయకట్టు, కోదాడ నియోజకవర్గం పరిధిలో 56,696 ఎకరాల కొత్త ఆయకట్టుకు కలిపి 1,39,037 ఎకరాలకు సమృద్ధిఇగా నీరు అందుతుందన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లోని రైతాంగం సాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రారంభించిన ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం జరుగకుండా చూడాలన్నారు. రైతాంగానికి అండగా నిలబడాలని అధికారులకు, ఏజెన్సీ నిర్వాహకులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. సమావేశంలో ఈఎనసీ అంజద్‌హుస్సేన, ఈఎనసీ అడ్మినిస్ట్రేషన సూర్యాపేట జిల్లా సీఈ రమే్‌షబాబు, ఎస్‌ఈలు నాగభూషణ్‌రావు, శివధర్మతేజ, ఈఈలు సత్యనారాయణలతో పాటు హుజూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన నీటిపారుదల శాఖాధికారులు, ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు, ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 12:05 AM