నెట్.. కట్
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:58 AM
ఇంటికి కరెంటు, నీళ్లు ఎంత అవసరమో ఇంటర్‌నెట్ కూడా అంతే అవసరంగా మారింది. టీవీలు పనిచేయాలన్నా, కంప్యూటర్లలో వర్క్ ఫ్రం హోం చేసుకోవాలన్నా ఇంటర్‌నెట్ అత్యావశ్యమైంది.
మూడు రోజులుగా స్తంభించిన ఇంటర్‌నెట్ సేవలు
రామాంతాపూర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో సమస్యలు
మూగబోయిన టీవీలు.. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు తిప్పలు
విద్యుత్‌స్తంభాలకు కట్టిన కేబుల్ వైర్లను తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): ఇంటికి కరెంటు, నీళ్లు ఎంత అవసరమో ఇంటర్‌నెట్ కూడా అంతే అవసరంగా మారింది. టీవీలు పనిచేయాలన్నా, కంప్యూటర్లలో వర్క్ ఫ్రం హోం చేసుకోవాలన్నా ఇంటర్‌నెట్ అత్యావశ్యమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడురోజులుగా ఇంటర్‌నెట్ సేవలు స్తంభించిపోవడంతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రామంతాపూర్ లో జరిగిన షార్ట్‌సర్క్యూట్‌తో జిల్లాలో ఇంటర్‌నెట్ సేవలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ కేంద్రంగానే జిల్లాలకు ఇంటర్నెట్ సేవలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో కలెక్టరేట్‌తోపా టు ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంస్థలకు సంబంధించిన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఐటీఉద్యోగులు, కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాల్లో ఇంటర్‌నెట్ లేకపోవడంతో అవస్థలు పడ్డారు. కేబుల్ వైర్లు తెగిపోవడంతో పలుచోట్ల టీవీలు మూగబోయాయి. విద్యుత్ స్థంభాలకు అస్తవ్యస్తంగా ఏర్పాటు చేస్తున్న కేబుల్ వైర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మూడురోజుల క్రితం కేబుల్ వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఐదుగురు మృత్యువాతపడటంతో ప్రభు త్వం తీవ్రంగా స్పందించింది. విద్యుత్ శాఖ అధికారులు స్తంభాల కు ఉన్న వైర్లను తొలగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేబుల్ వైర్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటుండ గా..., త్వరలోనే అన్ని మునిసిపాలిటీల్లోనూ కేబుళ్లను కట్ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో మొత్తం ఆరు మునిసిపాలిటీలు, 427 గ్రామ పంచాయతీలున్నాయి. అయితే అధికారులు యుద్ధప్రాతిపదికన కేబుల్ వైర్లను కట్‌చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురువుతాయని పలువురు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యం లో అధికారుల సూచనలమేరకు కేబుల్ సేవలన్నీ కూడా సింగిల్ కేబుల్ (ఒకే కేబుల్‌లో అన్ని సంస్థలకు చెందిన కనెక్షన్లు) ద్వారా అందించేందుకు ఏర్పాట్లపై టీవీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది.
జిల్లావ్యాప్తంగా కనెక్షన్లు..
జిల్లాలో గతంలో దాదాపు 70వేల కేబుల్ కనెక్షన్లు ఉండేవి. ఎయిర్‌టెల్, జియో, వీడియోకాన్, తదితర డిష్‌నెట్ ద్వారా కేబుల్ రావడంతో... ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా దాదాపు 45వేల వరకు టీ వీ కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో 2వేలకు పైగా పలు సంస్థలకు చెందిన ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 2.50లక్షల వరకు టీవీ కేబుళ్లు, ఐదువేలకు పైగా ఇంటర్‌నెట్ కనెక్షన్లున్నాయి. సాధారణంగా టీవీ కేబుల్‌తోపాటు ఇంటర్‌నెట్ కేబుళ్లకు కూడా విద్యుత్‌స్తంభాలు ఉన్నాయి. వీటిని కట్‌చేస్తే పలువురికి టీవీతోపాటు ఇంటర్‌నెట్ కనెక్షన్ సౌక ర్యం లేకుండా పోతోంది. దీంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 30 ఏళ్ల నుంచి ఉన్న కేబుల్ వ్యవస్థను రోజుల వ్యవధిలో మార్చడం కష్టమని అధికారులకు వివరించారు. ఈనేపథ్యంలో టీవీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించారు. ఉన్న ఫలంగా కేబుళ్లను తొలగించవద్దని, సింగిల్ కేబుల్ ద్వారా సౌకర్యం కల్పిస్తామని నిర్ణయించారు.
క్రమ పద్ధతిలో అమర్చుకోకపోవడంతోనే సమస్య..
జిల్లాలో టీవీ కేబుల్‌తోపాటు ఇంటర్‌నెట్ కేబుల్స్ కూడా విద్యుత్ స్థంభాల ద్వారా ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీల్లో కేబుల్ కనెక్షన్లతోపాటు ఇంటర్‌నెట్ కేబుల్స్‌ను విద్యుత్‌స్థంభాలకు వేలాడదీస్తుంటారు. ఆపరేటర్లు ఇష్టారీతిన వీటిని స్థంభాలకు వేలాడదీస్తుండటంతో విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు స్తంభం ఎక్కేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యుత్ శాఖ సిబ్బంది నుంచి ఫిర్యాదులు అందుతుంటాయి. తక్కువ ఎత్తులో తీగలను వేలాడదీస్తుండటంతో భారీ వాహనాలకు తగిలి తరుచూ ఇవి తెగిపడిపోవడం, కిందకు జారడంతో ద్విచక్ర వాహనదారుల, పాదచారులు ప్రమాదాలకు గురవుతుంటారు. కట్టలుగా కేబుల్ వైర్లను స్థంభాలకు కడుతుండటంతో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. కేబుల్ వైర్లను విద్యుత్‌స్థంభాలకు క్రమపద్ధతిలో అమర్చుకోవాలని విద్యుత్ శాఖ చెబుతున్నా.., ఇప్పటివరకు పెడచెవిన పెట్టిన కేబుల్ ఆపరేటర్లకు ఆ శాఖ ఝలక్ ఇచ్చింది. ఈ క్రమంలో మునిసిపాలిటీల్లో స్తంభాలకు వేలాడదీసిన వైర్లను ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో కేబుల్ వైర్లను కత్తిరించేందుకు సిద్ధమవుతున్నారు. భువనగిరి పట్టణంలో బొమ్మాయిపల్లి చౌరస్తా నుంచి రైల్వేస్టేషన్ వరకు విద్యుత్ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న చిన్న స్తంభాలను తొలగించి...విద్యుత్ టవర్లను ఏర్పాటుచేశారు. తద్వారా హైదరాబాద్, జగదేవ్‌పూర్, అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రస్తుతం కేబుళ్ల కనెక్షన్లు తొలగించారు. భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అయితే వీటిని కట్‌చేస్తే పలువురికి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా పోతోంది. వర్క్‌ఫ్రం హోం ద్వారా పనిచేసే ఐటీ ఉద్యోగులతోపాటు విద్యార్థులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇంటర్‌నెట్ సేవలు అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఆపరేటర్లకు ప్రభుత్వం గడువు విఽధించి, ఒకే సింగిల్ కేబుల్ ద్వారా క్రమపద్ధతిలో అమర్చుకోవాలని సూచించనుంది.
కనెక్షన్లు తొలగించకుండా గడువు ఇవ్వాలి : పోత్నక్ వేణుగోపాల్, తెలంగాణ టీవీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ నాయకులు
కొన్నేళ్లుగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించకుండా అధికారులు కొంత గడువు ఇవ్వాలి. అధికారుల సూచన మేరకు కేబుల్ సేవలన్నీ కూడా సింగ్ కేబుల్ ద్వారా అందించేందుకు తెలంగాణ టీవీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తోంది. కేబుళ్ల ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.