Share News

రియల్‌, రవాణా రంగాలకు ప్రతికూలం

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:32 AM

రవాణా, రియల్‌ రంగాలకు ఈ ఏడాది ప్రతికూల ఫలితాలే వచ్చాయి. వాహన కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గించినా రవాణా చార్జీలు పెంచటంతో అదనపు భారం పడినట్లయ్యింది.

రియల్‌, రవాణా రంగాలకు ప్రతికూలం

రవాణా, రియల్‌ రంగాలకు ఈ ఏడాది ప్రతికూల ఫలితాలే వచ్చాయి. వాహన కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గించినా రవాణా చార్జీలు పెంచటంతో అదనపు భారం పడినట్లయ్యింది. దీంతో 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గితే రవాణా చార్జీలను 12 నుంచి 18 శాతానికి పెంచింది. దీంతో కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో తీసుకున్నట్లు ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇక రియల్‌ ఎస్టేట్‌ రంగం ఈ ఏడాది కుదేలైంది. ఇప్పటికే భూముల ధరలు అధికం కావడంతో పెట్టుబడిదారులు ఎవరూ కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. దీంతో క్రయ, విక్రయాలు మందగించాయి.

(ఆంధ్రజ్యోతి-కోదాడ)

రవాణా రంగం పరిస్థితి ఉగాది పచ్చడిలా మారింది. జీఎస్టీ తగ్గింపు తీపిలా కనిపించినా ఇతర చార్జీలు, తెలుగు రాష్ట్రాల్లో అమలు కాని సింగిల్‌ పర్మిట్‌ విధానం చేదుగా మిగిలి ఉంది. జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో వాహనం ధరలు తగ్గినా అదేస్థాయిలో చార్జీల పేరుతో కేంద్రం భారం మోపింది. 16 టైర్ల లారీకి రూ.5 లక్షల వరకు తగ్గింది. అదే సమయంలో కేంద్రం రవాణా చార్జీలను 12 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. 2024లో సరుకు రవాణాపై లారీ యజమానులు రూ.లక్ష ఆదాయంపై రూ.12 వేలు చార్జీ చెల్లిస్తే ఈ ఏడాది రూ.18 వేలు చెల్లించాల్సి వస్తోంది. రూ.లక్ష ఆదాయంపై అదనంగా రూ.6 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఆ చొప్పున జీఎస్టీ తగ్గింపుతో ఆదాయం కన్నా, చార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించేది అధికంగా ఉంటుందని లారీ యజమానులు వాపోతున్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మధ్య నేటికీ సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలు కాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు.

ఊపందుకున్న ఎలకి్ట్రక్‌ వాహనాలు

జీఎస్టీలో మార్పులు ద్విచక్రవాహన కొనుగోలుదారులకు కలిసివచ్చింది. జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో ద్విచక్రవాహనదారులపై రూ.6నుంచి రూ.17వేలు వరకు ధర తగ్గింది. ఇదిలా ఉండగా ఈ ఏడాదిలో ఎలక్ర్టిక్‌ వాహనాల(కార్లు, ద్విచక్రవాహనాలు) కొనుగోళ్లు భారీగా పెరిగాయి.

ట్రాక్టర్లపై జీఎస్టీ తగ్గింపుతో తగ్గిన భారం

ట్రాక్టర్ల, వాటి విడిభాగాలకు సంబంధించి 2024లో జీఎస్టీ 12 నుంచి 18శాతం వరకు ఉండేది. కేంద్రం ఈ ఏడాదిలో 5 శాతానికి తగ్గించింది. దీంతో టైర్లు జత రూ.50వేలు ఉంటే 18శాతం చొప్పున రూ.9వేలు ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించేవారు. జీఎస్టీని 5 శాతానికి తగ్గించటంతో రూ.2,500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా రైతుకు రూ.6,500 మిగిలినట్లయ్యింది.

వెనకబడ్డ రియల్‌ రంగం

రియల్‌ రంగంపై ఈ ఏడాది తీవ్ర ప్రభావమే చూపింది. 2024లో అంతంతా మాత్రమే ఉండగా, ఈ ఏడాది పూర్తి తగ్గింది. పెరగాల్సిన దానికన్నా భూములు, ప్లాట్స్‌ రేట్లు పెరగడంతో పెట్టుబడికి పావలా వడ్డీ కూడా రాదనే భావనలో పెట్టుబడిదారులు వ్యవసాయ భూములు, ప్లాట్స్‌ కొనుగోలుకు ఆనాసక్తి చూపించారు. 2023లో గ్రామాల్లో ఎకరా భూమి రూ.35లక్షలు ఉంటే, ఈ ఏడాది చివరినాటికి రూ.25 నుంచి రూ.30 లక్షలకు పడిపోయింది. అంతేకాక పట్టణాల్లో గజం రూ.10వేలకు మించిపోవటంతో, 250గజాల ప్లాట్‌కు రూ.25లక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. వెంటనే విక్రయించలేకపోతే దానిపై పావలా వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎవరూ కొనుగోలు చేయటానికి ముందుకు రావడం లేదు. 2023లో చిన్నపట్టణాల్లో 100 మంది, పెద్దపట్టణాల్లో సుమారు 300 నుంచి 400 మంది ఏజెంట్లు, ఇతరులు రియల్‌ రంగంపై ఉపాధిపొందేవారు. ఒక్కొక్కరు నెలకు 10 నుంచి 15 ప్లాట్స్‌ విక్రయించేవారు. ప్రస్తుతం నెలకు ఒక్కటి కూడా విక్రయించే పరిస్థితి లేదు. అంతేకాక బిల్డర్స్‌ కట్టిన ఇళ్లు విక్రయం అవ్వడంలేదు. దీంతో వారంతా అయోమయంలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 రిజిస్టర్‌ కార్యాలయాల్లో ఈ ఏడాది తగ్గిన క్రయ, విక్రయాలు స్పష్టం చేస్తున్నాయి. జనవరి నుంచి ఈ నెల 29 నాటికి 10,839 రిజిస్ట్రేషన్లు తగ్గగా, ఆదాయం రూ.22.57 కోట్లు తగ్గింది. 2026లోనైనా ఆశాజనంగా ఉంటుందని రియల్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది గోల్డ్‌, వెండి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌, మ్యూచివల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపించారు.

ఇలా ఇచ్చి.. అలా తీసుకున్నట్టు..

జీఎస్టీ తగ్గింపుతో ఒక్కో లారీ కొనుగోలుపై రూ.5లక్షలు మిగులుతుంది. అంతవరకు బాగానే ఉంది. రవాణా చార్జీలు పెంచటంతో వచ్చే మిగులు ఎక్కడది. ఒక చేతి ఇచ్చి, ఇంకో చేతితే లాక్కున్నట్లు ఉంది. జీఎస్టీతో పాటు రవాణాచార్జీలు లేకుండా చేస్తే కొంతభారం తగ్గేది. దీనికి తోడు తెలుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలుకాకపోవంటతో అదనపు భారం పడుతోంది. ఈ ఏడాదిలో కొత్తగా రవాణా రంగానికి లాభం లేకపోగా, భారం ఎక్కువైంది.

కనగాల నాగేశ్వరరావు, ఏఎంసీ మెంబర్‌

పెట్టుబడి పెట్టి ఎదురుచూడాల్సి వస్తోంది

రియల్‌ రంగం 2023కు ముందు బాగా ఉంది. దీంతో లక్షల పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి వస్తేచాలు అన్నట్లుగా ఉంది. వాస్తవానికి భూముల, ప్లాట్స్‌ రేట్లు పెరగటం కూడా రియల్‌ వ్యాపారం తగ్గటానికి కారణం. ధరలు ఎక్కువ ఉండటంతో చాలామంది బంగారం, వెండి, ఇతర వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అసలు వ్యాపారాలే లేవు. వందల ఎకరాలు అమ్మిన వారం, కనీసం గజాలలో కూడా విక్రయించలేకపోతున్నాం

పాశం శ్రీకృష్ణమోహన, రియల్టర్‌

Updated Date - Dec 31 , 2025 | 12:32 AM