Share News

ముమ్మరంగా మునిసిపాలిటీ భవన నిర్మాణ పనులు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:16 AM

యాదగిరిగుట్ట మునిసిపల్‌ కార్యాలయ భవన నిర్మాణం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ముమ్మరంగా మునిసిపాలిటీ భవన నిర్మాణ పనులు
ప్రారంభమైన మునిసిపల్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులు

రూ. 3.20 కోట్లు మంజూరు

యాదగిరిగుట్ట రూరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట మునిసిపల్‌ కార్యాలయ భవన నిర్మాణం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టీయూఎ్‌ఫఐడీసీ ద్వారా మంజూరైన రూ. 3.20కోట్ల వ్యయంతో చేపడుతున్న నిర్మాణ పనులను సంబంధిత కాంట్రాక్టర్లు ఎట్టకేలకు ప్రారంభించారు. టెంపుల్‌సిటీగా ప్రఖ్యాతి గాంచనున్న యాదగిరిగుట్ట మునిసిపాలిటీని అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేయడానికి అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం నూతన మునిసిపాలిటీని ఏర్పాటు చేసినప్పటికీ మునిసిపల్‌ కార్యాలయ భవన నిర్మాణం శంకుస్థాపన చేసి, నిఽధులు కేటాయించడంలో జాప్యం జరిగింది. 60 సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం పూర్తిగా శిథిలం కావడంతో దానిని తొలగించి ప్రస్తుతం అదే స్థలంలో సుమారు రెండు ఎకరాల స్థలంలో భవన నిర్మాణం చేపడుతున్నారు. తాత్కాలికంగా గతంలో నిర్మించి లాడ్జీ వ్యాపారం కోసం నిర్మించిన భవనంలో అసౌకర్యంగా ఉన్నప్పటికీ గత్యంతరం లేక మునిసిపల్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత కాంట్రాక్టర్‌, అధికారులు వీలైనంత త్వరగా భవన నిర్మాణం పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

పనులు త్వరగా పూర్తిచేయాలి

రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణంలో ప్రజలు, పరిపాలనకు అనుకూలంగా ఉండే విధంగా మునిసిపాలిటీ భవనం తీర్చిదిద్దాలి. మునిసిపాలిటీ ఏర్పాటు అయినప్పటికీ అందుకు అనుకూలంగా భవనం లేకపోవడంతో పరిపాలన అసౌకర్యాల నడుమకొనసాగుతోంది. కాంట్రాక్టర్‌, సంబంధిత అధికారులు పనులు జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసి, నూతన పాలకవర్గానికి అందించాలి.

-పేరబోయిన మహేందర్‌, స్థానికుడు

పనుల విషయం నిర్లక్ష్యం జరుగదు

మునిసిసిపల్‌ కార్యాలయ భవన నిర్మాణం విషయంలో జాప్యం జరగదు. ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య పూర్తి సహకారంతో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రజలు, పరిపాలనకు అనుకూలంగా చక్కగా తీర్చిదిద్దుతాం. భవన నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.

-మిర్యాల లింగస్వామి, మునిసిపల్‌ కమిషనర్‌

Updated Date - Nov 21 , 2025 | 12:16 AM