నిరుపయోగంగా మునిసిపల్ స్థలాలు
ABN , Publish Date - May 17 , 2025 | 12:25 AM
జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో ప్రతీ గజం స్థలం అత్యంత విలువైనది. పట్టణ ప్రధాన రహదారి వెంట బహిరంగ మార్కెట్‌లో గజం ధర రూ. 2 లక్షల వరకు పలుకుతుండగా, బస్తీలు కాలనీల్లో కనీస ధర రూ.15వేలకు పైనే ఉంటున్న పరిస్థితి.
వ్యర్థాలకు, ప్రైవేట్ వ్యాపారులకు అడ్డాగా విలువైన స్థలాలు
భువనగిరి టౌన, మే 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో ప్రతీ గజం స్థలం అత్యంత విలువైనది. పట్టణ ప్రధాన రహదారి వెంట బహిరంగ మార్కెట్‌లో గజం ధర రూ. 2 లక్షల వరకు పలుకుతుండగా, బస్తీలు కాలనీల్లో కనీస ధర రూ.15వేలకు పైనే ఉంటున్న పరిస్థితి. దీంతో కేవలం ఒక ఫీట్ స్థలంపై ఇరుగపొరుగు వారి మధ్య హద్దు వివాదాలు చెలరేగుతూ పోలీ్‌సస్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్న వైనం. కానీ మునిసిపల్ యంత్రాంగానికి మాత్రం తమ స్థలాలను కాపాడుకోవడంలో, సద్వినియోగ పరచడంలో పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో కొన్ని స్థలాలు డంపింగ్ యార్డులను తలపిస్తుండగా మరికొన్నింటిని కొద్దిమంది వ్యాపారులు సొంత స్థలాలలుగా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే బస్తీలలోని కొన్ని మునిసిసల్ స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని కూడా ప్రచారంలో ఉన్నది. దీంతో ఇప్పఇటికైనా ఖాళీ స్థలాలను సద్వినియోగం పరచడంలో మునిసిపల్ అధికారులు శ్రద్ధ చూపాలని పట్టణవాసులు అంటున్నారు. ఈ తరహా పరిస్థితి పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉండగా మచ్చుకు ఇలా.
చెత్త కుప్పలా బ్రాహ్మణవాడ ఖాళీ స్థలం
పట్టణ ఆబాది ప్రాంతంలోని బ్రాహ్మణవాడ జనావాసాల మధ్య సుమారు 500గజాల మునిసిపల్ ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో గతంలో మహాత్మగాంధీ స్మారక కేంద్రం, గ్రంథాలయం నిర్వహించారు. అనంతరం ఆ స్థలంలో సుమారు 30 సంవత్సరాల క్రితం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించి, గోడల స్థాయిలో నిలిపివేశారు. దీంతో కొద్దికాలానికి ఆ గోడలు కనుమరుగు కావడంతో అప్పటినుంచి ఆ స్థలమంతా నిరుపయోగంగా ఉంది. అనంతరం ఆ స్థలంలో కమ్యూనిటీహాల్ లేదా పార్క్ నిర్మించాలని స్థానికులతో పాటు అధికారులు పలుమార్లు ప్రతిపాదించారు కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా స్థానికులు వేస్తున్న వ్యర్థాలు, పెరిగిన పిచ్చి మొక్కలతో ఆ స్థలం డంపింగ్ యార్డును తలపిస్తోంది. అక్కడి నుంచి దుర్వాసన, దోమలు వ్యాపిస్తుండగా పందుకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా ఆ ఖాళీ స్థలంలో పార్క్ లేదా కమ్యూనిటీ హాల్ నిర్మించి అశుభ్రత నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు అంటున్నారు.
మర్మమేమిటో ..?
పట్టణ 100 ఫీట్ల ప్రధాన రహదారి వెంట ఆర్‌బీనగర్ చౌరస్తాలో కొన్ని సంవత్సరాలుగా విలువైన మునిసిపల్ స్థలం నిరుపయోగంగా ఉండటం వెనక మర్మమేమిటోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలంలోని మడిగెల ద్వారా అద్దె రూపకంలో మునిసిపాలిటీకి ఆదాయం వచ్చే మడిగలు శిధిలావస్థకు చేరాయని సుమారు 10సంవత్సరాల క్రితం అధికారులు కూల్చివేశారు. కానీ తిరిగి నిర్మంచడంలో మాత్రం అధికారులు అప్పటినుంచి నేటి వరకు జాప్యం చేస్తూనే ఉన్నారు. ఈ జాప్యం వెనుక ఓ వ్యాపారి పార్కింగ్ స్థలం మర్మం దాగి ఉన్నదని స్థానికంగా చర్చ. కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన మునిసిపాలిటీకి రెండు మడిగెలను నిర్మించడం ఇబ్బంది కానప్పటికీ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువైన స్థలాన్ని సద్వినియోగం చేయాలని కోరుతున్నారు.
ఖాళీ స్థలంలో బస్తీ అంతా కంపరం
మా బస్తీలోని వందల గజాల మునిసిపల్ ఖాళీ స్థలంతో బస్తీ అంతా కంపరంగా మారుతోంది. వ్యర్థ పదార్థాలకు అడ్డాగా మారి పరిసరాల పరిశ్రుభతకు ఆటంకంగా మారుతోంది. ప్రజారోగ్యానికి చేటు తెస్తోంది. ఈ స్థలంలో పార్క్ లేదా కమ్యూనిటీ హాల్ నిర్మించాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
-కేమోజు భాగ్యలక్ష్మీ, బ్రాహ్మణవాడ, భువనగిరి
ఖాళీ స్థలాలను సద్వినియోగం చేస్తాం
పట్టణంలోని ఖాళీ స్థలాలను సద్వినియోగం చేస్తాం. లేఅవుట్ వెంచర్లలోని ఖాళీ స్థలాలన్నీ భద్రంగానే ఉన్నాయి. అయితే పాత బస్తీలు, కాలనీల్లోని కొన్ని స్థలాలు నిరుపయోగంగా ఉన్నట్టు తెలిసింది. ఈమేరకు ఖాళీ స్థలాలను గుర్తించి స్థానికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం. ప్రధాన రహదారి వెంట ఉన్న ఖాళీ స్థలాన్ని మునిసిపల్ ఆదాయ వనరుగా మారుస్తాం.
-జి.రామలింగం, కమిషనర్, భువనగిరి మునిసిపాలిటీ