కాసులు కురిపిస్తున్న మట్టి దందా
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:03 AM
నల్లమట్టి బంగారంగా మారింది. ఈ మట్టి కాసులు కురిపిస్తుండటంతో అక్రమ దందాకు అడ్డులేకుండాపోయింది.
అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ
కంటితుడుపుగా అధికారుల చర్యలు
(ఆంధ్రజ్యోతి,రాజాపేట, భువనగిరి (కలెక్టరేట్): నల్లమట్టి బంగారంగా మారింది. ఈ మట్టి కాసులు కురిపిస్తుండటంతో అక్రమ దందాకు అడ్డులేకుండాపోయింది. బేగంపేటలోని గండిచెరువు, చల్లూరులోని మల్పవానిచెరువు ఇలా చెరువులను చెరబట్టి మట్టి తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టా భూములంటూ మట్టిని తోడేస్తుండగా, కట్టడిలో అధికారులు విఫలమవుతున్నారు.
రాజాపేట మండలంలో మట్టిదందా కొన్నిరోజులుగా య థేచ్ఛగా సాగుతోంది. మండలంలోని చల్లూరు, రేణికుంట,రాజాపేట,బేగంపేట,నెమిల, దూదివెంకటాపూర్ గ్రామాల నుంచి మట్టి, ఇసుక అక్రమంగా తరలుతోంది. చల్లూరు,కాల్వపల్లి, బసంతాపూర్ గ్రామాల్లో రియల్ వెంచర్లకు ఎర్రమట్టి ని తరలిస్తున్నారు. చల్లూరు,బేగంపేట గ్రామా ల నుంచి నల్లమట్టిని గుట్టు చప్పుడు కాకుండా కొందరు ఇతరప్రాంతాలకు తరలించి సొ మ్ము చేసుకుంటున్నారు. చల్లూరులోని మల్పవాని చెరువు నుంచి 10 రోజులుగా నల్లమట్టిని 30 టిప్పర్ల ద్వారా తరలించారు. రెండు హిటాచీలతో మట్టిని నింపుతూ సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు తరలించారు. ఇలా రోజుకు నాలుగు నుంచి ఆరు ట్రిప్పుల వరకు కీసర,బొమ్మలరామారం, చీకటిమామిడి, గజ్వేల్, కేసారం,జగదేవపూర్, తదితర ప్రాంతాలకు తరలించారు. టిప్పర్ మట్టిని రూ.8వేలనుంచి రూ.9 వేలవరకు ఇటుకబట్టీలకు విక్రయించారు.
నమోదవని కేసులు..
చెరువుల మట్టిని తరలిస్తున్నారని పోలీసుల కు సమాచారం అందగా, వారు 23 టిప్పర్లను టిప్పర్లను స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులకు అప్పగించారు. చెరువులో రెండెకరాల విస్తీర్ణంలో నాలుగు నుంచి ఐదు మీటర్ల మేర లోతు తవ్వి మట్టిని తరలించారు. అయితే మట్టి ని తరలించిన వారిపై కేసు నమోదుకు అధికారులు జాప్యం చేస్తున్నారని, అందరి కళ్ల ముం దు కన్పిస్తున్నా, ఏమీ జరగనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మట్టి తరలింపుపై అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు, జలసాధన సమితి నాయకులు చెరువును పరిశీలించి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అయితే పోలీసులు అప్పజెప్పిన టిప్పర్లకు నామమాత్రం జరిమానా విధించి మైనింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.5,342 వరకు జరిమానా విధించారు. బేగంపేటలోని గండిచెరువు నుంచి సైతం 15 రోజుల పాటు టిప్పర్ల ద్వారా మట్టి తరలించారని, ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు.
మరికొన్ని చెరువుల నుంచి..
మండలంలోని మరికొన్ని చెరువుల నుంచి మట్టి తరలించేందుకు కొందరు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. మండలంలోని నెమిల చెరువు నుంచి మట్టిని మోత్కూరులోని ఇటుక బట్టీలకు తరలించేందుకు యత్నించగా, కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిలిచిపోయింది. అదేవిధంగా పాముకుంట చెరువు నుంచి మట్టి తరలించేందుకు ఇద్దరు పట్టాదారులు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు కొద్ది కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. చెరువు నుంచి మట్టిని తరలిస్తే చెరువు కింద ఉండే వ్యవసాయ భూముల్లోని బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా రాజధానికి సమీపంలో ఉండటంతో అభివృద్ధి పేరుతో జరుగుతున్న వివిధ పనులకు, ఇటుక బట్టీలకు అక్రమార్కులు మట్టి తరలిస్తున్నారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఈ మట్టి దందా అధికంగా సాగుతోంది.
ఇతర జిల్లాలకు మట్టి
మండలంలోని చెరువుల నుంచి నల్లమట్టి తవ్వి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. రైతులకు నల్లమట్టి ఎంతో అవసరం. సాగు భూముల్లో పంటలు పండేందుకు నల్లమట్టి భూసారాన్ని పెంచుతుంది. గతంలో రైతులు ప్రభుత్వ సహకారంతో చెరువు మట్టిని పొలాలకు తరలించుకున్నారు. ప్రస్తుతం సైతం ప్రభుత్వం సహకారం అందిస్తే పొలాలకు మట్టిని తరలించుకుంటామని రైతులు అభిప్రాయపడుతున్నారు.
అనుమతులు ఉండాల్సిందే
మట్టిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించాలంటే ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకోవాలి. అందుకు దరఖాస్తు చేసుకోవాలి. చెరువు మట్టి తరలించాంటే ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీసుల అనుమతులు తీసుకోవాలి. ఆ తరువాత టన్ను మట్టికి రూ.20 రాయల్టీగా చెల్లించాలి. దీంతోపాటు మరికొన్ని పన్నులు ముందస్తుగా చెల్లించాలి. అన్ని అనుమతులు పొందిన తర్వాతనే మట్టి తవ్వకాలు ప్రారంభించాలి.
తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి: రాఘవరెడ్డి, జిల్లా మైనింగ్ ఏడీ
అక్రమ తవ్వకాలను ఉపేక్షించేది లేదు. ఎలాంటి తవ్వకాలకైనా అనుమతులు తప్పనిసరి. పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అక్రమ తవ్వకాలపై నిఘా పెడతాం. దృష్టికి వచ్చిన వాటిపై నిబంధనలకు అనుగుణంగా జరిమానా విధిస్తున్నాం. ఇటీవల చల్లూరు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న 23టిప్పర్ వాహనాలకు జరిమానా విధించాం.
కేసులు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నాం: అనిల్‌కుమార్, రాజాపేట ఎస్‌ఐ
చల్లూరు మల్పవాని చెరువు మట్టి తరలింపుపై ఐబీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. కేసు విచారణ అనంతరం చర్యలు తీసుకుంటాం.
బోర్లు ఒట్టిపోతున్నాయి : బండపల్లి రఘు, రైతు, చల్లూరు
మట్టి తవ్వకాలు చేసిన మల్పవాని చెరువు పైభాగంలో నాకు పొలం ఉంది. గతంలో ఇదే చెరువు లో మట్టిని తవ్వగా రైతుల ఆందోళనతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మళ్లీ తవ్వకాలు కొనసాగిస్తుండటంతో అడ్డుకొని ఫిర్యాదు చేశాం. మాటిమాటికి చెరువులో మట్టిని తీయడంతో నీరు నిల్వ ఉండక బోర్లు ఒట్టిపోయి రైతులు నష్టపోతున్నారు. మట్టి అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపాలి.