Share News

రైతు వేదికల ద్వారా మరిన్ని సేవలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:15 AM

వ్యవసాయరంగంలో సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు ప్రభుత్వం పూనుకుంది. పంటల సాగులో వస్తున్న మార్పులతో పాటు శాస్త్రవేత్తల సూచనలు రైతులకు ఎప్పటికప్పుడు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.

రైతు వేదికల ద్వారా మరిన్ని సేవలు

‘రైతు నేస్తం’ కేంద్రాల పెంపునకు సన్నాహాలు

అన్నదాతలకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 315 రైతు వేదికల్లో 77 ‘రైతు నేస్తం’ కేంద్రాలు

మండలానికి మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు

ప్రతినెలా నిధుల మంజూరు యోచన

స్థలం ఉంటే గోదాముల నిర్మాణం

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): వ్యవసాయరంగంలో సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు ప్రభుత్వం పూనుకుంది. పంటల సాగులో వస్తున్న మార్పులతో పాటు శాస్త్రవేత్తల సూచనలు రైతులకు ఎప్పటికప్పుడు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతులు సేంద్రీయ, కాంప్లెక్స్‌ ఎరువులు, విత్తనాల వినియోగంతోపాటు పంటల దిగుబడి పై తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరించనుంది. సాగులో సాంకేతిక అంశాలపై నిరంతరం రైతులకు అవగాహన కల్పించనుంది. రైతులకు ప్రస్తుతం అందుతున్న సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ సన్నాహలు చేస్తోంది.

రైతులకు ఆధునిక సాంకేతికను అందించ డం, దిగుబడుల సాధన, సమస్యలపై చర్చించేందుకు గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. ఉమ్మడి జిల్లాల్లో క్లస్టర్ల వారీగా వీటిని నిర్మించారు. రైతు వేదికల ద్వారా రైతులకు పం టల సాగు, దిగుబడితోపాటు పంటల మార్పిడి వంటి తగిన సూచనలు ఈవేదికల ద్వారా వ్యవసాయాధికారులు అందిస్తున్నారు. అయితే రైతు వేదికలను బలోపేతం చేసి, వీటి ద్వారా రైతుల కు సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రైతు వేదికల ద్వారా మరిన్ని సేవలందించనుం ది. వీటి నిర్వహణకు ప్రతీ నెల నిధులు విడుద ల చేసేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ ప్ర ణాళిక సిద్ధం చేస్తోంది.ఈ మేరకు ప్రభుత్వం జిల్లాల వారీగా ఉన్న రైతు వేదికలపై సమగ్ర సమాచారాన్ని వ్యవసాయశాఖను కోరింది. జిల్లాలో ఎన్ని రైతు వేదిక లు ఉన్నాయి? వీటిలో రైతులకు సేవలందించేందుకు ఉన్న పరికరాలు (టీవీ,ప్రొజెక్టర్‌, ఇంటర్నె ట్‌) ఏంటి?మౌలిక వసతు లుఉన్నాయా? రైతులకు అందుబాటులో ఉన్నా యా?అనే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది.

315 రైతువేదికలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 315 వరకు రైతువేదికలు ఉన్నాయి. వీటిలో యాదా ద్రి జిల్లాలో మొత్తం 17 మండలాల్లో 92 రైతు వేదికలు, నల్లగొండ జిల్లాలో 140, సూర్యాపేట జిల్లాలో 83 వరకు రైతు వేదికలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వేదికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి నిధులు మంజూరు కావడంలేదు. వ్యవసాయశాఖ అధికారులే సొంతంగా ఖర్చులు భరిస్తున్నారు. అయితే రైతులకు ఉపయోగపడేలా మరిన్ని సేవలందించేందుకు వీటిని తీర్చిదిద్దేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చితే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

గోదాముల నిర్మాణం సైతం

రైతువేదికలు ప్రస్తుతం సమావేశాలు నిర్వహించేందుకు ఉపయోగపడుతున్నాయి. ఒక్కో చోట 10 గుంటల నుంచి మొదలు ఎకరానికి పైగా ఉన్న స్థలాల్లో వీటిని నిర్మించారు. అయితే సమావేశాలతో పాటు అవసరాన్ని బట్టి గోదాములు, విత్తనాలు, ఎరువులు, ధాన్యం నిల్వ కేంద్రాలుగా వీటిని వినియోగించుకుంటున్నారు. ఈ వేదికలు నిర్మించిన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే గోదాములు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. వానాకాలం, యాసంగిలో రైతులు పండించిన పలు పంటల దిగుబడిని భద్రపరిచేందుకు సరైన గోదాములు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థలం ఉంటే ఆయా ప్రాంతాల్లో గోదాములు నిర్మించనున్నారు.

మరిన్ని రైతు నేస్తం కేంద్రాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరిన్ని రేతు నేస్తం కేంద్రాలను విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 315 రైతువేదికల్లో 77చోట్ల రైతు నేస్తం సేవలు అందుతున్నాయి. వీటిలో రైతులు నేరుగా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడే అవకాశం ఉంది. ఆధునిక సాంకేతిక ద్వారా పంటల సాగు విధానంపై శాస్త్రవేత్తలతో మాట్లాడటంతోపాటు వారి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరిన్ని వేదికల్లో రైతు నేస్తం కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం మండలానికి ఒక రైతు నేస్తం కేంద్రం ఉండగా, మండలానికి మరో రెండుచోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో కేంద్రంలో సుమారు రూ.3లక్షలకు పైగా సాంకేతిక పరికరాలు మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం ప్రతీ 5వేల హెక్టార్లకు వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)నియమించింది. ఈ వేదికల్లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి జిల్లాలో మరిన్ని కేంద్రాల్లో రైతు నేస్తం సేవలు అందించిన పక్షంలో రైతులకు అవసరమయ్యే సాంకేతిక విజ్ఞానం అందించేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వేదికల ద్వారా సేవలు : గోపాల్‌, యాదాద్రి జిల్లా వ్యవసాయాధికారి

రైతు వేదికల ద్వారా మరిన్ని సేవలందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని ‘రైతు నేస్తం’ కేంద్రాలను విస్తరించనున్నాం. వీటిని బలోపేతం చేసి, రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. జిల్లాలోని రైతు వేదికలపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. ప్రభుత్వం ఎంపిక చేసిన కేంద్రాలకు సాంకేతిక పరికరాలు మంజూరు కానున్నాయి. మండలానికి రెండుమూడు చొప్పన ‘రైతు నేస్తం’ కేంద్రాలు ఏర్పాటుకానుండటంతో, రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

Updated Date - Mar 16 , 2025 | 12:15 AM