వానాకాలం ప్రణాళిక ఖరారు
ABN , Publish Date - May 05 , 2025 | 11:54 PM
యాసంగి సీజన ముగిసింది. సాగు చేసిన వివిధరకాల పంటలు చేతికొచ్చాయి. ముఖ్యంగా జిల్లాలో వరిని రైతులు ఎక్కువగా సాగు చేశారు. ఇటీవల చాలాచోట్ల కోతలు పూర్తికావడంతో ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.
యాసంగి సీజన ముగిసింది. సాగు చేసిన వివిధరకాల పంటలు చేతికొచ్చాయి. ముఖ్యంగా జిల్లాలో వరిని రైతులు ఎక్కువగా సాగు చేశారు. ఇటీవల చాలాచోట్ల కోతలు పూర్తికావడంతో ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో కొనుగోళ్లు పూర్తికానున్నాయి. ఈ క్రమంలో రైతులు, అధికారులు వానాకాలం సాగుపై దృష్టిసారించారు. ఇందుకోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నా రు, ఎన్ని విత్తనాలు, ఎరువులు అవసరమో ఒక అంచనాకు వచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నారు.
- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట (కలెక్టరేట్)
జిల్లాలో వానాకాలం సీజనలో అన్నిరకాల పంట లు కలిపి 6.20లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఐదు లక్షల ఎకరాల్లో వరి, 90 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తార ని భావిస్తున్నారు. మిగిలిన కంది, పెసర, మినుము లు, వేరుశనగ పంటలు కొద్దిమొత్తంలో సాగు చేయనున్నారు. జిల్లాలో 15 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా కోదాడ, హుజుర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తేనే అక్కడ వరి సాగు చేయనున్నారు. లేకపోతే వరి సాగు విస్తీరం తగ్గనుంది. వర్షాలు కూడా సాదారణ స్థాయిలో ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో మూసీ, ఎస్సారెస్పీ నీళ్లు వస్తేనే వరి సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మెట్ట పంటలు సాగు చేయనున్నారు. గతేడాది వానాకాలం సీజనలో రైతులు ఆరుతడి పంటలైన కందులు 7,500 ఎకరాలు, పెసర 4వేల ఎకరాలు, వేరుశనగ 1,200 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. కానీ రైతులు మాత్రం ఆరుతడి పంటలు సాగు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎక్కువగా వరి పంట సాగుకే రైతులు మొగ్గు చూపారు.
విత్తనాలు సిద్ధం...
జిల్లాలో వానాకాలం సీజనలో సాగు చేసే అన్నిరకాల పంటలకు విత్తనాలు సిద్ధం చేశారు. వరి సాగు కోసం 87 వేల క్వింటాళ్ల విత్తనాలు, కంది సాగుకు 160 క్వింటాళ్లు, పెసర సాగుకు 110 క్వింటాళ్లు, మొక్కజొన్నల సాగు కోసం ఐదు క్వింటాళ్లు, వేరుశనగ కోసం 360 క్వింటాళ్లు విత్తనాలు సిద్ధంగా ఉంచారు. పత్తి పంట కోసం 2లక్షలకు పైగా ప్యాకెట్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి.
లక్షా 25 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు
జిల్లాలో వానాకాలం సీజనకు సంబంధించి రైతులు సాగు చేసే పంటలకు అన్ని రకాల ఎరువులు కలిసి 1,25,393 మెట్రిక్ టన్నులు అవసరం కానున్నాయి. అందులో యూరియా 60 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 14,580, కాంప్లెక్స్ ఎరువులు 45,250 మెట్రిక్ టన్నులతో పాటు ఇంకా పలురకాల ఎరువులు అవసరం కానున్నాయి. అయితే ప్రస్తుతానికి 22,143 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. యూరియా 11,800 మెట్రిక్ టన్నులు, డీఏపీ 900 మెట్రిక్ టన్నులతో పాటు మిగిలిన కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. సీజన ప్రారంభం కాగానే రైతులు సాగు చేసిన పంటలను బట్టి ఎరువులను అందుబాటులో ఉంచనున్నారు.
లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు తీసుకోవాలి
రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలి. అనుమతులు లేని దుకాణాల్లో కొనుగోలు చేసి మోసపోవద్దు. వానాకాలం సీజనకు సంబంధించి అన్నిపంటలకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా చేస్తున్నాం. అనుమతులు లేకుండా విత్తనాలను విక్రయిస్తే చర్యలు తీసుకున్నారు. ఎవరైనా విక్రయిస్తే మా దృష్టికి తీసుకురావాలి. రైతులు వ్యవసాయశాఖాధికారుల సూచనలు, సలహాలు పాటించాలి.
- శ్రీధర్‌రెడ్డి, డీఏవో, సూర్యాపేట.