క్షణ క్షణం.. ఉత్కంఠ
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:09 AM
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు తుది తీర్పు సందర్భంగా సోమవారం నల్లగొండ కోర్టు వద్ద క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది. కోర్టు వద్ద నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు.

ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు
ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు మరణశిక్ష
ఆరుగురికి జీవిత ఖైదు, జరిమానా
కోర్టు వద్ద ఉద్రిక్తత
శిక్ష పడిన నిందితుల కుటుంబ సభ్యుల కన్నీరు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు తుది తీర్పు సందర్భంగా సోమవారం నల్లగొండ కోర్టు వద్ద క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది. కోర్టు వద్ద నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎవ్వరినీ కోర్టు సముదాయంలోకి అనుమతించని పోలీసులు కోర్టు వాయిదాలు ఉన్న వారిని మాత్రమే లోనికి పంపారు. పట్టణంతో పాటు మిర్యాలగూడ నుంచి వచ్చిన ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, న్యాయవాదులతో కోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయిం ది. మీడియా ప్రతినిధులు సైతం పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకోగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఉదయం 11.10 గంటలకు నిందితుల్లో ఒకడైన అస్గర్ అలీని నల్లగొండ కోర్టుకు తీసుకువచ్చారు. అనంతరం 11.50 గంటలకు ఈ కేసులో ఏ-2గా ఉన్న సుభాష్ శర్మను కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే ఇతర నిందితులు కూడా రాగా, మధ్యాహ్నం సమయంలోగానే న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. జీవిత ఖైదు శిక్ష పడినట్లు తెలియడంతో అక్కడికి వచ్చిన నిందితుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కొంత మంది శిక్షపడిన నిందితులకు చిన్న పిల్లలకు ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఉద్వేగానికిగురై కన్నీరు పెట్టుకున్నారు. ఇక కోర్టు తీర్పుతో ప్రణయ్ తల్లిదండ్రులకు కూడా భావోద్వేగానికి గురయ్యారు. హత్యకు గురైన కుమారుడిని గుర్తుచేసుకొని కంటతడి పెట్టుకున్నారు.
కోర్టు వద్ద రోజంతా కొనసాగిన ఉద్రిక్తత
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుకి సంబంధించి ట్రయల్స్ ఈ నెల 7వ తేదీన ముగిశాయి. పదో తేదీన తుది తీర్పు వెలువరిస్తామని జడ్జి పేర్కొనడంతో, సోమవారం జిల్లా కోర్టు సముదాయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇద్దరు డీఎస్పీలు, అయిదుగురు సీఐలతో పాటు పలువురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిసి 150 మందితో బందోబస్తు నిర్వహించారు. కేసుకు సంబంధించిన నిందితుల్లో ఒకరైన అస్గర్ అలీ అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, గుజరాత్ రాష్ట్ర మాజీ హోంమంత్రి హీరేన్‌పాండ్యా హత్య కేసులో ముద్దాయి కావడంతో అతన్ని గుజరాత్ జైలు నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. అదేవిధంగా ప్రధాన నిందితుడు సుభా్‌షశర్మ రెండు రోజుల క్రితం ట్రయల్స్‌కు హాజరైన తర్వాత చర్లపల్లి జైలుకు తరలించగా, సోమవారం తీర్పు వచ్చాక ఇతనికి ఉరి శిక్ష ఖరారవడంతో మళ్లీ అక్కడికే తరలించారు. మిగిలిన అయిదుగురు బెయిల్ మీద ఉండటంతో సోమవారం కోర్టుకు హాజరయ్యారు. సంచలన కేసు కావడం, నేరస్థుల పూర్వచరిత్ర వివాదాస్పదంగా ఉండటంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మీడియా ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, నిందితుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
కేసువిచారణ చురుకైనపాత్ర
ప్రణయ్ హత్యకేసు విచారణలో అప్పట్లో మిర్యాలగూడ డీఎస్పీగా పనిచేసిన శ్రీనివాస్ చురుకైన పాత్రపోషించారు. ప్రణయ్ హత్య కేసును ఖండిస్తూ ప్రజా, కులసంఘాల ఆందోళనలు ఓ వైపు, శాంతిభద్రతల పరిరక్షణ మరోవైపు, వీటికితోడు కేసు విచారణ ఇలాంటి ప్రతికూల సవాళ్లను ఆయన చాకచక్యంగా ఎదుర్కొన్నారు. తన పనితనానికి తగ్గట్టు పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసుకొని, హత్య జరిగిన ప్రదేశంలో లభ్యమైన ఆయుధం, ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మొదలైన కేసు విచారణను కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కొలిక్కితెచ్చారు. అప్పటి ఎస్పీ ఏవీ.రంగనాథ్ పర్యవేక్షణలో తొమ్మిది నెలలపాటు నిర్విరామంగా కేసు విచారణ కొనసాగించి సైంటిఫిక్, టెక్నికల్ వంటి మౌలిక ఆధారాలతో కూడిన 1,600 పేజీల చార్జిషీట్‌ను తయారు చేసి కోర్టుకు సమర్పించారు. ప్రణయ్ హత్యకేసులో నిందితుల పాత్రకు సంబంధించి బలమైన ఆధారాలను చార్జిషీట్‌లో దాఖలు చేయడంతో నిందితులు ఏ మాత్రం తప్పించుకునేందుకు వీలు లేకుండాపోయింది.
కోర్టు వద్ద ఉదయం నుంచి ఇలా..
ఉదయం 8.30నుంచి అప్రమత్తమైన పోలీసులు
9.00: కోర్టు ప్రాంగణానికి చేరుకున్న పోలీసు అధికారులు, సిబ్బంది
10.00: కోర్టు ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు
10.30: ఎవరినీ కోర్టులోకి అనుమతించని పోలీసులు
10.45: కోర్టుకు చేరుకున్న బెయిల్ పై ఉన్న నిందితులు
11.10: ఏ-3నిందితుడు అస్గర్ అలీని ప్రత్యేక పోలీసు వాహనంలో నల్లగొండ కోర్టుకు తీసుకువచ్చిన గుజరాత్ పోలీసులు
11.45: పోలీస్ ఎస్కార్ట్‌తో కోర్టుకు హాజరైన సుభాష్‌శర్మ
12.05: తీర్పును వెల్లడించిన జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి రోజా రమణి
1.10: తీర్పు తెలుసుకుని కోర్టు ప్రాంగణంలో కన్నీరు పెట్టిన కుటుంబసభ్యులు
1.10: శిక్ష పడిన నిందితులకు వైద్యపరీక్షలు
2.00 శిక్ష ఖరారు కావడంతో కోర్టు నుంచి జైలుకు తరలింపు
2.30: ఉరిశిక్ష పడిన సుభా్‌షశర్మ చర్లపల్లి జైలుకు తరలింపు
3.30: మిగతా నిందితులందరినీ నల్గొండ జైలుకు తరలింపు
3.40: నిందితులను తీసుకువెళ్లడంతో అక్కడినుంచి వెళ్లిపోయిన కుటుంబసభ్యులు, ప్రజలు ప్రజాసంఘాల నాయకులు
- ఆంధ్రజ్యోతి, నల్లగొండ క్రైం
కోర్టు తీర్పు కుల దురహంకారులకు చెంపపెట్టు
ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి
మిర్యాలగూడ, మిర్యాలగూడ అర్బన్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఇచ్చిన తీర్పు కుల దురహంకారులకు చెంపపెట్టు అని ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి అన్నారు. సోమవారం ప్రణయ్ కేసు తీర్పు అనంతరం భార్య ప్రేమలత, చిన్న కుమారుడు అజయ్‌తో కలిసివెళ్లి ప్రణయ్ సమాధిపై పుష్పాజంలి ఘటించి కన్నీటిపర్యాంతమయ్యారు. అనంతరం ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడుతూ, ఒక్క ప్రణయ్ కోసమే కాదు సమాజంలో మరెవరూ కులం, పరువు కోసం పిల్లలను, ఇతరుల పిల్లలను చంపడం లాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆరేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూశామన్నారు. ఈ తీర్పు పరువు కోసం హత్యలు చేసి తప్పించుకోవచ్చు అనే వారికి గుణపాఠం నేర్పుతుందన్నారు. కుల అహంకారంతో హత్య చేయడంతో చేతికి అంది వచ్చిన 23 ఏళ్ల నా కుమారుడు ప్రణయ్ తమకు దూరమయ్యాడని విలపించారు. అమృతకు భర్త, తన మనవడికి తండ్రి లేకుండా పోయాడని వాపోయారు. ఆత్మహత్య చేసుకుని మారుతీరావు, హత్య చేసి సుభాష్ శర్మ, ఇతర నిందితులకు శిక్షకు గురై కుటుంబాల్లో వ్యధను మిగిల్చిందన్నారు. సమస్య ఎదురైనప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇందరి కుటుంబాల్లో ఇంతటి విషాదం ఉండేది కాదన్నారు. అప్పటి ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వతంలో అన్ని ఆధారాలు సేకరించి కోర్టు ముందు బలమైన సాక్ష్యాలు ఉంచడంతోపాటు కేసును నిందులు తప్పుదోవ పట్టించకుండా అనుక్షణం అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారన్నారు. ఏ మాత్రం రాజీ పడకుండా కోర్టులో తమ తరపున వాదనలు వినిపించిన లాయర్ దర్శినం నర్సింహ సహకారం వల్లే తప్పు చేసిన వారికి న్యాయస్థానంలో శిక్ష తప్పదని రుజువైందన్నారు. భవిష్యత్‌లో పిల్లలతో అప్రమత్తంగా ఉండి, ఏవైనా ఘటనలు జరిగితే రాజీ మార్గం అనుసరించాలే తప్ప, కడుపుకోత మిగిల్చే హత్యలకు పాల్పడకూడదని ఆవేదన వ్యక్తం చేస్తూ పేర్కొన్నారు.
నిందితుడు సుభాష్ శర్మకు మరణ శిక్ష : ఎస్పీ
నల్లగొండ క్రైం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మిర్యాలగూడ వన్‌టౌన్ పరిధిలో కులాంతర వివాహం చేసుకున్న కారణంగా హత్యకు గురైన ప్రణయ్ కేసులో నిందితులకు శిక్ష విధిస్తూ జిల్లా రెండో అదనపు ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చారని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 జనవరి 31న అమృత, ప్రణయ్‌లు కులాంతర వివాహం చేసుకోగా, అది నచ్చని ఆమె తండ్రి మారుతీరావు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక చేశారన్నారు. ఈ మేరకు 2018 సెప్టెంబరు 14న మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద మాటు వేసిన నిందితుడు సుభాష్ శర్మ పదునైన కత్తితో ప్రణయ్‌పై దాడి చేసి కిరాతకంగా నరకడంతో అక్కడికక్కడే చనిపోయాడన్నారు. దీనిపై మిర్యాలగూడ వన్‌టౌన్ పీఎస్‌లో ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల మారుతీరావు బాలస్వామి ఫిర్యాదు మేరకు మొత్తం ఎనిమిది మంది నిందితులను గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయగా, ఐదేళ్ల పాటు కొనసాగిన వాదోపవాదనల అనంతరం ఏ-1 మారుతీరావు ఆత్మహత్య చేసుకుని మృతిచెందగా, మిగిలిన నిందితుల్లో ఏ-2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష, రూ.15వేల జరిమానా, మిగతా ఆరుగురు మహ్మద్ అస్గర్‌అలీ, అబ్దుల్ భారీ, అబ్దుల్ కరీం, తిరునగరి శ్రవణ్, సముద్రాల శివ, ఎంఏ.నిజాంకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధించారని వివరించారు. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్షపడేలా విచారణ చేసిన నాటి ఇన్వెస్టిగేసన్ ఆఫీసర్, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్‌ఐ సుధీర్‌కుమార్, ప్రస్తుత డీఎస్పీ రాజశేఖరరాజు, వన్‌టౌన్ సీఐ పీఎన్‌డీ.ప్రసాద్, ఎస్‌ఐ వీరస్వామి, ఏఎ్‌సఐ మధుసూదన్, లైజన్ అధికారులు పాక నరేందర్, ఎన్.మల్లిఖార్జున్‌ను ఎస్పీ అభినందించారు.