Share News

ఉప్పల్‌ మార్గంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:32 AM

భువనగిరి- హైదరాబాద్‌ మార్గంలో ప్రయాణికుల కష్టాలను తీర్చే లక్ష్యంతో ఆరు నెలల క్రితం ప్రారంభించిన మెట్రో డీలక్స్‌ బస్సుల స్థానంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు వచ్చాయి.

ఉప్పల్‌ మార్గంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు

మెట్రో డీలక్స్‌ల ఉపసంహరణతో పురుష ప్రయాణికుల పరేషాన

సగం డీలక్స్‌లైనా నడపాలని డిమాండ్‌

‘ఉమ్మడి వరంగల్‌’ డీలక్స్‌లను ఆపాలని ఆకాంక్ష

భువనగిరి టౌన, జూలై16 (ఆంధ్రజ్యోతి): భువనగిరి- హైదరాబాద్‌ మార్గంలో ప్రయాణికుల కష్టాలను తీర్చే లక్ష్యంతో ఆరు నెలల క్రితం ప్రారంభించిన మెట్రో డీలక్స్‌ బస్సుల స్థానంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు వచ్చాయి. ఫలితంగా పురుష ప్రయాణికుల కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయని ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. భువనగిరి-ఉప్పల్‌ మధ్య రోజుకు 36 ట్రిప్పులు నడిచిన మెట్రో డీలక్స్‌ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలకు అనుమతించకపోవడంతో ఆ బస్సుల్లో పురుష ప్రయాణికులే ప్రయాణించేవారు. కొద్దిమంది మహిళలు మాత్రమే టికెట్టు కొనుక్కొని ఈ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేరేవారు. దీంతో టార్గెట్‌కు అనుగుణంగా ఆక్యుపెన్సి ఉండటం లేదంటూ ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉప్ప ల్‌ డిపో అధికారులు మెట్రో డీలక్స్‌ బస్సులను సోమవారం నుంచి రద్దు చేసి వాటి స్థానంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సులలో ఆధార్‌కార్డులతో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండటంతో మహాలక్ష్మి ప్రయాణికులతోనే ఆ బస్సులన్నీ కిక్కిరిస్తున్న పరిస్థితి. దీంతో ఇటీవల వరకు ఆ మార్గంలో 90 రూపాయల చార్జీలతో (ఒకవైపు ప్రయాణానికి) సులభ ప్రయాణం చేసిన పురుష ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ లెక్కలు ఇలా..

మెట్రో డీలక్స్‌ బస్సుల స్థానంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నడపడానికి ఆర్టీసీ అధికారులు తమదైన రీతిలో లెక్క లు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారం.. ఉప్పల్‌- భువనగిరి మధ్య ఒకవైపు డీలక్స్‌ బస్సు నడవడానికి ఆర్టీసీకి రూ. 2 వే లు ఖర్చవుతుంది. 90 రూపాయలు చార్జీ ప్రకారం 22 మంది ప్రయాణికులు బస్సు ఎక్కితేనే నోలాస్‌, నో ప్రాఫిట్‌ విధానంలో బస్సు నడుస్తుంది. ఈ మేరకు ప్రతీరోజు ఆరు బస్సు లు 36 ట్రిప్పులుగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కానీ రోజువారీ ప్రయాణికుల ఆక్యుపెన్సీ కేవలం 9శాతంగానే ఉంటోంది. దీంతో డీలక్స్‌ బస్సులు ప్రారంభమైన జనవరి 10 నుంచి జూలై 13 వరకు ఉప్పల్‌ డిపోకు తీవ్ర నష్టం జరిగింది. ఈనేపథ్యంలో డీలక్స్‌ బస్సులను రద్దుచేసి వాటి స్థానంలో ఆధార్‌కార్డు అనుమతులు ఉన్న ఆరు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను యాఽథావిధిగా 36ట్రిప్పులుగా నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. ఆధార్‌కార్డు చెల్లుబాటు అవుతుండటంతో మహిళల ఉచిత ప్రయాణాలకు జారీ చేస్తున్న జీరో టికెట్లకు ప్రభుత్వం చెల్లించే చార్జీలతో ఆర్టీసీకి నష్ట నివారణతో పాటు మహిళలకు ప్రయాణ అవకాశాలు పెరుగుతాయని, పురుషులకు ప్రయాణ సదుపాయం యాఽథావిధిగా ఉంటూ పాత చార్జీలతో పోలీస్తే రూ.10 తగ్గి రూ.80తోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చని సూత్రీకరిస్తున్నారు.

పురుష ప్రయాణికుల ఆగ్రహం

మెట్రో డీలక్స్‌ బస్సుల రద్దుపై పురుష ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల ఉచిత ప్రయాణాలతో బస్సులన్నీ కిక్కిరిస్తూ కనీసం నిలబడే పరిస్థితి కూడా ఉండేదికాదని, ఈ నేపథ్యంలో ఆరు నెలల కిత్రం ప్రారంభించిన మెట్రో డీలక్స్‌ బస్సులతో ఈ మార్గంలో అందరికీ ప్రయాణ కష్టాలు తీరడంతో పాటు పురుషులకు సులభ ప్రయాణం సాధ్యమైందని పేర్కొంటున్నారు. కానీ పలు కారణాలు చూపుతూ డీలక్స్‌ బస్సులను రద్దుచేసి మెట్రో బస్సులను నడపడం సరికాదని వాదిస్తున్నారు. ఆరు బస్సులు, 36 ట్రిప్పులలో కనీసం సగం బస్సులు సగం ట్రిప్పులైనా మెట్రో డీలక్స్‌ బస్సులు నడపాలని, అంతేగాక ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిపోలకు చెందిన అన్ని డీలక్స్‌ ఆపై స్థాయి బస్సులను భువనగిరి బస్టాండ్‌ గుండా నడపాలని అంటున్నారు. లేనిపక్షంలో ప్రైవేట్‌, సొంత వాహనాల వైపు మళ్లుతామని స్పష్టం చేస్తున్నారు.

కనీసం సగమైనా నడపాలి

నేను ప్రతీరోజు హైదరాబాద్‌ నుంచి భువనగిరికి ఉద్యోగ విధుల కోసం వచ్చి పోతుంటాను. కిక్కిరిసిన బస్సులతో పలుమార్లు బస్సులను అర్ధాంతరంగా బస్సు దిగి ఉద్యోగానికి వెళ్లకపోవడం లేదా ఆలస్యంగా వెళ్లిన పరిస్థితులున్నాయి. ఆరు నెలల క్రితం ప్రారంభించిన మెట్రో డీలక్స్‌ బస్సులతో సులువుగా రాకపోకలు సాగిస్తున్నాను. కానీ అర్ధాంతరంగా డీలక్స్‌ బస్సులను రద్దు చేయడంతో తిరిగి పూర్వ పరిస్థితులు నెలకొన్నాయి. పరిష్కార మార్గంగా ఆర్టీసీ అధికారులు గత డీలక్స్‌ బస్సుల సంఖ్యలో సగమైనా మూడు బస్సులు, 18 ట్రిప్పులు రద్దీ సమయంలో నడిపితే ఆక్యుపెన్సీ పెరగడంతో పాటు ప్రయాణ కష్టాలు తీరుతాయి.

-అభినవ్ రెద్ది, ప్రభుత్వ ఉద్యోగి

‘ఉమ్మడి వరంగంల్‌’డీలక్స్‌ బస్సులన్నీ భువనగిరి బస్టాండ్‌నుంచి నడపాలి

మెట్రో డీలక్స్‌ బస్సుల ఉపసంహరణతో ఉప్పల్‌-భువనగిరి మార్గంలో రాకపోకలు సాగించే పురుషులకు ప్రయాణ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆక్యుపెన్సీ లెక్కలు చూపుతూ డీలక్స్‌ బస్సులను రద్దుచేసిన ఆర్టీసీ అధికారులు భువనగిరి ప్రయాణికుల ఇబ్బందులను విస్మరించడం సరికాదు. సమస్య పరిష్కారానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆరు డిపోల డీలక్స్‌ పై స్థాయి బస్సులన్నీంటినీ భువనగిరి నుంచి నడిపేలా చర్యలు తీసుకోవాలి.

-డి.రవీంద్రనాథ్‌, న్యాయవాది

Updated Date - Jul 17 , 2025 | 12:32 AM