Share News

ఆకాంక్షలు నెరవేరాలి!

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:58 AM

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల ఆకాంక్షల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే పెండింగ్‌ ప్రాజెక్టులు, కాల్వలు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను పూర్తిచేయాలని కోరుతున్నారు.

ఆకాంక్షలు నెరవేరాలి!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజల వేడుకోలు

నల్లగొండ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల ఆకాంక్షల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే పెండింగ్‌ ప్రాజెక్టులు, కాల్వలు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను పూర్తిచేయాలని కోరుతున్నారు. జిల్లాలో సాగయ్యే ఉద్యాన పంటల ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, మార్కెటింగ్‌ సదుపాయలు కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేయాలంటున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో విద్య, వైద్యరంగాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించేలా పరిశ్రమల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల ఆకాంక్షలను మననం చేసుకొని వాటి సాధనకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశిస్తున్నవి ఇవే..

ఎస్‌ఎల్బీసీ సొరంగమార్గం పూర్తి చేసి ప్రతిపాదిత 3.50లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలి. 8 ఎస్‌ఎల్బీసీ(ఏఎమ్మా ర్పీ) హైలెవెల్‌ కెనాల్‌కు పూర్తిస్థాయిలో లై నింగ్‌ పూర్తి చేయించాలి. ఆయకట్టు చివ రి భూములకు నీరందేలా చర్యలు తీసుకోవాలి.

డిండి ఎత్తిపోతల పూర్తి చేసి ప్రతిపాదిత దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 3.50లక్షల ఎకరాలకు నీరివ్వాలి.

అందులో భాగమైన ఎదుల-డిండి లింక్‌ పనులు తక్షణం చేపట్టాలి.

డిండి ఎత్తిపోతల పథకం పరిధిలోని ఏడు రిజర్వాయర్లు, ఎస్‌ఎల్బీసీ పరిధిలోని పెండ్లిపాకల, నక్కలగండి రిజర్వాయర్లలో ముంపు భూములకు పరిహారం ఇప్పించాలి.

బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నిర్ణీత లక్ష ఎకరాలకు నీరందించే పనులు వేగవంతం చేయాలి.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న సుమారు 2,300 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలి.

ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు పెరిగినందున ఇక్కడే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలి.

బత్తాయి, నిమ్మ రైతులకు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలి.

మూసీ కాల్వలు ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి, అసి్‌ఫనహర్‌ కాల్వల పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలి.

గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లు పూర్తిచేయాలి. ముంపు భూములకు, నిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం ఇవ్వాలి.

ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ కాల్వల పునరుద్ధరణ చేపట్టాలి.

నాగార్జునసాగర్‌ కాల్వల మరమ్మతులు చేపట్టి వానాకాలం సాగుకు అడ్డంకులు లేకుండా చూడాలి.

ఎత్తిపోతల పథకాల నిర్వహణకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పథకాలు సక్రమంగా నడిచేలా చూడాలి.

మిర్యాలగూడ, నాగార్జుననసాగర్‌, దేవరకొండ, నల్లగొండ, హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో నిర్మాణంలో ఉన్న, కొత్తగా మంజూరైన ఎత్తిపోతల పథకాల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.

మిర్యాలగూడలో ఏరియా ఆస్పత్రి స్థాయి పెంచి 400 పడకల ఆస్పత్రిగా మార్చాలి.

నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి.

కేతేపల్లి టోల్‌ప్లాజా వద్ద ట్రామాకేర్‌ ఆస్పత్రి నెలకొల్పాలి.

ఉమ్మడి జిల్లాలోని దేవరకొండ, నాగార్జుననసాగర్‌, మిర్యాలగూడ, చౌటుప్పల్‌, నకిరేకల్‌, తిరుమలగిరి, కోదాడ, హుజూర్‌నగర్‌లో నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలి.

జాతీయ రహదారిపై చిట్యాల, నార్కట్‌పల్లి వద్ద డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలి.

నిర్మాణంలో ఉన్న ఏటీసీ (అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌)లను వెంటనే పూర్తిచేయాలి.

నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన యంగ్‌ ఇండియా సమీకృత రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి.

ప్రతీ నియోజకవర్గానికి ఒక స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

స్వామి రామానంద తీర్థ గ్రామీణాభివృద్ది సంస్థను స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీగా అవృద్ధి చేయాలి.

ప్రతీ మండల కేంద్రంలో జూనియర్‌ కళాశాల, ప్రతీ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలి.

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఇంజనీరింగ్‌, లా కళాశాలలు ఏర్పాటు చేయాలి.

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ ఉద్యమకారుడికి 200 చదరపు గజాల ఇళ్ల స్థలం కేటాయించాలి.

Updated Date - Jun 02 , 2025 | 12:58 AM