కోదాడలో రూ.60 లక్షల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:06 AM
గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట క్రైం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ నర్సింహ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సెప్టెంబరు 23వ తేదీన కోదాడ పరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారి వెంబడి సుమారు 110 కిలోల గంజాయిని గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడు ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు, నమ్మదగిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టాయి. ఈ నెల 6వ తేదీన జాతీయరహదారిపై కట్టకొమ్ముగూడెం ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న కారును వెంబడించి పట్టుకున్నారు. అందులోని హైదరాబాద్‌కు చెందిన కణం రమేష్ వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రమే్‌షను విచారించగా ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన చాపల అశోక్, చాపల ఎరుకమ్మతో కలిసి సెప్టెంబరులో కోదాడ పరిధిలో 110 కిలోల గంజాయిని వదిలేసి వెళ్లినట్లు అంగీకరించాడు. దీంతో వారిని కూడా అదుపులోకి తీసుకుని రూ.60లక్షల విలువైన 120 కిలోల గంజాయిని, 8 సెల్‌ఫోన్లను, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నర్సింహ తెలిపారు. ఈ సందర్భంగా కోదాడ పోలీస్ సిబ్బందిని అభినందించారు. సమావేశంలో కోదాడ సీఐ శివశంకర్, సీసీఎస్ ఎస్‌ఐ హరికృష్ణ, కోదాడ పట్టణ ఎస్‌ఐ హనుమానాయక్, హెడ్ కానిస్టేబుళ్లు బాల్తు శ్రీనివాస్, ఎన.ఎల్లారెడ్డి, జి.సతీష్, ఎం.వెంకటేశ్వర్లు, కే రాంబాబు, ఫరీద్, సూర్యాపేట పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.