తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:16 AM
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
నల్లగొండ క్రైం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరతచంద్రపవార్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడేనికి చెందిన ఉబ్బని యోగేశ్వర్, నల్లగొండ పట్టణంలోని బీటీఎ్‌సకు చెందిన వల్లూరి యువరాజ్, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన బాలెం రాజేష్, హైదరాబాద్‌కు చెందిన దస్తర్ బండిషఫీ సంవత్సర నుంచి రాచకొండ, వరంగల్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నల్లగొండ, మహుబూబ్‌నగర్ జిల్లాల్లో తాళం వేసిన ఇళ్లలో రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్నారు. వీరు నల్లగొండలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని మంగళవారం సాయం త్రం నల్లగొండ టూటౌన పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి నిందితులను అరెస్టు చేసి విచారణ చేశారు. బాలెం రాజేష్, దస్తర్ బండిషఫీ గతంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్, సరూర్‌నగర్, కూకట్‌పల్లి, బంజారాహిల్స్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేశారు. ఉబ్బని యోగేశ్వర్ తుర్కంజెల్‌లో నివాసం ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాలెం రాజేష్, దస్తర్ బండిషఫీ అతనికి పరిచయమయ్యారు. వీరు తాగుడుకు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని రాత్రి సమయాల్లో దొంగతనాలు చేసేవారు. యోగేశ్వర్ తన స్నేహితుడైన వల్లూరి యువరాజ్ చంద్ర, సాయికుమార్, శ్రీకాంతలకు ఈ విషయం చెప్పారు. రాజేష్, దస్తర్ బండిషఫీలు, మనోజ్ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలతో పాటు తాళం వేసిన ఇళ్లలో దొంగతనం చేసేవారు. నిందితుల నుంచి రూ.25లక్షలు విలువ చేసే 20 తులాల బంగారు అభరణాలు, 1.800కిలోల వెండి అభరణాలు, వెండి చెంబు, పళ్లెం, ద్విచక్ర వాహనం, రెండు ల్యాప్‌టా్‌పలు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో సభ్యుడు తలారి మనోజ్ గంజాయి కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మరో ఇద్దరు నిందితులు సాయికుమార్, శ్రీకాంతలు పరారీలో ఉన్నారు. నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్లగొండ టూటౌన సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో కేసు ఛేదించిన టూటౌన ఎస్‌ఐ సైదులు, రూరల్ ఎస్‌ఐ సైదాబాబు, హెడ్ కానిస్టేబుల్ పాయిలి రాజ్, కానిస్టేబుల్ లావురి బాలకోటి, శంకర్, జానకిరాం, ఎంఏ పరూఖ్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.