Share News

పునాదుల్లోనే ఎత్తిపోతలు

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:23 AM

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధి మొదటిజోన్‌లోని చివరి భూములకు సాగు నీరందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన ఎత్తిపోతల పథకాల పనులు ఇంకా పునాదుల్లోనే కదలాడుతున్నాయి.

పునాదుల్లోనే ఎత్తిపోతలు

పునాదుల్లోనే ఎత్తిపోతలు

లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యం

నత్తనడకన సాగుతున్న పనులు

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధి మొదటిజోన్‌లోని చివరి భూములకు సాగు నీరందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన ఎత్తిపోతల పథకాల పనులు ఇంకా పునాదుల్లోనే కదలాడుతున్నాయి. లక్ష ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఏడు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.కోట్లు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షలు చేస్తూ ఆదేశించడంతో కొద్దొగొప్పో పనులు జరుగుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.

- (ఆంధ్రజ్యోతి-హుజూర్‌నగర్‌)

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని పాలకవీడు, చింతపాలెం మండలాల్లోని భూములతో పాటు సాగర్‌ ఆయకట్టు చివరి భూముల కు సాగునీటిని అందించాలని కాంగ్రెస్‌ ప్రభు త్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆ యా మండలాల్లో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారు. వీటితో పాటు గతంలో ఉన్న ఎత్తిపోతల నూ పునరుద్ధరిస్తున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌ ని యోజకవర్గంలో కృష్ణా నది ప్రవహిస్తుండటంతో ఆ నీటిని సద్వినియోగం చేసుకునేలా ఎత్తిపోత ల పథకాలకు రూపకల్పన చేశారు. 2023లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే శరవేగంగా ఎత్తిపోతల పథకాలకు ఆమోదం లభించడడం, నిధులు మంజూరు చేయించారు. అయినప్పటికీ పనులు వేగవంతంగా సాగడం లేదన్న విమర్శలువెల్లువెత్తుతున్నాయి. ఏదిఏమైనా అభివృద్ధి పనుల వేగవంతానికి సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌ ఇప్పటికే అనేకసార్లు సమీక్షలు నిర్వహించారు. పనుల నిర్లక్ష్యంపై అధికారులు, కాంక్ర్టార్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. హైద్రాబాద్‌లోని జయశంకర్‌ విశ్వవిద్యాలయంలో ఈ నెల 5న ఎత్తిపోతల పథకాలపై మంత్రి ఉత్తమ్‌ సమీక్షించి పనుల వేగవంతానికి ఆదేశాలు జారీ చేశారు.

ఏడాదిన్నర కావస్తున్నా...

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఎత్తిపోతల పనులు వేగవం తం చేయడంలో అధికారులు, కాంట్రాక్టర్లు తా త్సారం చేస్తున్నారన్నారు. పనులు నెమ్మదిగా సా గడంపై ఈనెల 5వ తేదీన హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌ నిర్వహించిన సమీక్ష సందర్భం గా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

8 నియోజకవర్గంలో రూ.1450 కోట్లతో 53 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని చేపట్టిన అతిపెద్ద ఎత్తిపోతల పథకం ముక్త్యాల బ్రాంచ పథకం పనులు 25 శాతం మాత్రమే పూర్తయినట్లు సమాచారం. ఇప్పటి వరకు 200 ఎకరాల భూమి సేకరించడంతో పాటు కేవలం మూడు కిలోమీటర్ల పైప్‌లైన మాత్రమే నిర్మించారు. పాతవెల్లటూరు వద్ద కృష్ణానదిపై పంప్‌హౌస్‌ పనులు ప్రారంభించలేదు. అక్కడ పను లు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

8 చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్‌ దిగువ భాగంలో దొండపాడు రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకాన్ని రూ.394 కోట్లతో ప్రారంభించారు. 14,100 ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 35 ఎకరాలకు పైగా భూసేకరణ చేశారు. పనులు ప్రారంభదశలోనే కొనసాగుతున్నాయి. పులిచింతల పవర్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నీటితో ఈ ఎత్తిపోతలను నిర్మిస్తున్నారు. ఈ పథకాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిజైన్‌ చేశారు.

8 నక్కగూడెం ఎత్తిపోతల పథకాన్ని గతంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించగా దీని పునరుద్ధరిస్తున్నారు. రూ.33 కోట్లతో 2,300 ఎకరాల ఆయకట్టు కోసం మంత్రి ఉత్తమ్‌ పనులకు.. అంకురార్పణ చేశారు. ఈ పనులు చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

పాలకవీడు మండలం బెట్టెతండా పరిధిలో 2,040 ఎకరాలకు రూ.37 కోట్లు మంజూరుచేశారు. ఇక్కడ 30 శాతం పనులు మాత్రమే పూర్తిచేశారు. అదేవిధంగా ఇదే మండలంలోని జవహర్‌-జాన్‌పహాడ్‌ ఎత్తిపోతల పథకాన్ని రూ.302 కోట్లతో 10వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా రూపొందించారు. పనులు ప్రారంభించి ఆరు నెలలు దాటినా అనేక సాంకేతిక కారణాలతో పనులు నత్తనడకన సాగుతున్నాయని రైతు సంఘాల ఆరోపిస్తున్నాయి.

రైతుల డిమాండ్లు

గొలుసుకట్టు చెరువులకు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నేరేడుచర్ల మండలం సోమారం, కల్లూరు, పెంచికల్‌దిన్నె, చింతకుంట్ల, చిల్లేపల్లి గొలుసుకట్టు చెరువులను నింపేందుకు మూసీ నది నుంచి నీటిని ఎత్తిపోయాలని ఆయా ప్రాంతాల రైతులు కోరుతున్నారు. ఇక్కడి ఎత్తిపోతల ఏర్పాటు చేస్తే సుమారు 30వేల ఎకరాలకు సాగునీరందే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. అదేవిధంగా వేములూరు వాగు ప్రాజెక్ట్‌ నుంచి లింగగిరి చెరువుకు ఎత్తిపోతలను ఏర్పాటుచేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. గత 20 ఏళ్లుగా ఎత్తిపోతల ద్వారా లింగగిరి చెరువును నింపాలని అనేక ప్రతిపాదనలు పంపారు. అయినా వీటికి మోక్షం రాకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

పనులు నాణ్యతతో చేపట్టాలి

ఎత్తిపోతల పథకాల పనులను వేగంగా పూర్తిచేయాలి. పనుల్లో నాణ్యత లేకపోతే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రతి ఎకరానికీ నీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాలు ఉపయోగపడతాయి. ఆయకట్టు చివరి భూములను సస్యశ్యామలం చేస్తాం. నా హయాంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో రైతులకు మేలుచేసేలా పనులు చేస్తున్నాం.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పనులు వేగవంతం చేస్తున్నాం

ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేస్తున్నాం. కాలపరిమితి ముగిసేలోపు పనులు పూర్తిచేసేందుకు దృష్టి సారించాం. నిత్యం పనులు పర్యవేక్షణచేస్తున్నాం. సమీక్షలతో పనులు మరింత వేగవంతంగా జరుగుతున్నాయి.

రామ్‌కిషోర్‌, ఎన్సెస్పీ ఈఈ

Updated Date - Aug 08 , 2025 | 12:23 AM