ప్రగతిపథంలో నడుద్దాం
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:58 AM
అంకితభావంతో పనిచేస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం భువనగిరిలోని జూనియర్ కళాశాల ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించా రు.
అందరి భాగస్వామ్యంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): అంకితభావంతో పనిచేస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం భువనగిరిలోని జూనియర్ కళాశాల ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించా రు. తొలుత మండలి చైర్మన్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి సందేశాన్ని ఇచ్చారు.
అందరి భాగస్వామ్యంతో జిల్లాను ప్రగతిపథంలో నిలిపేందుకు ఎన్నో ప్రణాళికలను రూ పొందిస్తున్నట్టు సుఖేందర్‌రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక అని, జిల్లాలో నూతనంగా 23,367 కార్డులు అందజేశామన్నారు. దీంతో పదేళ్ల తర్వాత రేషన్‌షాపుల వద్ద ప్రజల సందడి కన్పిస్తోందన్నారు. ఆడబిడ్డల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.46,689కోట్లు సమకూర్చిందన్నారు. ఉచితంగా సన్నబియ్యం, వంటగ్యాస్, విద్యుత్ రాయితీ, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్‌ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణను మహిళలకు అప్పగించిందన్నారు. గృహజ్యోతికింద జిల్లాలో రూ.217కోట్ల లబ్ధి చేకూరిందని, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.22,500కోట్లు కేటాయించిందని, 9,398మంది ప్రయోజనం పొందారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చి 17 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించిందన్నారు. 1,775 భూ సమస్యలను గుర్తించి, 1,200 వరకు పరిష్కరించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో మినీకిట్ పథకం ద్వారా 75శాతం సబ్సిడీతో రూ.4.98లక్షలతో 6.75టన్నుల విత్తనాలు రైతులకు సరఫరా చేశామన్నారు. యువతకు 20 నెలల కాలంలో 60వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, జాతీయ కుటుంబ సంక్షేమ నిధి కింద 1,084మందికి రూ.2.16కోట్లు అందించామన్నారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, 5,800 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరానని తెలిపారు. జిల్లాలో 53 అట వీ బ్లాకులు ఉండగా, అందులో 10 బ్లాకుల్లో అర్బన్ లాంగ్‌స్పే్‌సను అభివృద్ధి చేసి ప్రజల సందర్శనార్థం ప్రా రంభించామని తెలిపారు. 23,921 ఎకరా ల్లో ఉద్యాన, మల్బరీ పంటలు సాగులో ఉన్నాయని, మూడేళ్లలో 4,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేశామన్నారు.
ఆర్థిక పరిస్థితి సరిగాలేని రైతన్నకు అండ
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి రైతుల సంక్షేమానికి రూ.1.13లక్షల కోట్లు ఖర్చుచేశామన్నారు. యాసంగిలో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి 3.74లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతు రుణమాఫీ రూ.20,616కోట్లు పూర్తిచేశామన్నారు. రైతు భరోసా కింద రూ.12వేలు ఆర్థిక సహాయంగా 2.33లక్షల మంది రైతులకు రూ.306కోట్లు ఇచ్చామన్నారు. రైతు బీమాలో 1.36లక్షల మంది నమోదు చేసుకోగా, 588మందికి రూ.29.40కోట్ల పరిహారం అందిందన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లాలో రూ.2.45కోట్లు, డీఎంఎ్‌ఫటీ కింద రూ.1.41కోట్లు నిధులు కేటాయించామన్నారు. గంధమల్ల రిజర్వాయర్, బునాదిగాని కాల్వల పనులు పురోగతిలో ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీపడేదిలేదని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు రూ.189.50కోట్ల రుణాలు, స్త్రీనిధి పథకంలో రూ.13.38కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. ఉపాధి హామీ పథకం కింద 14లక్షల పనిదినాలు కల్పించి రూ.61.67కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లాకు రూ.400కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నేతన్నకు పొదుపు పథకం కింద 10,790మందికి రూ.2.17కోట్లు విడుదల చేశామన్నారు. నేతన్నకు బీమా పథకంలో 10,686 మంది కార్మికులు నమోదయ్యారని, వివిధ కారణాలతో మృతిచెందిన 135మంది కుటుంబాలకు రూ.6.75కోట్లు అందించామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డులు జిల్లాకు ఐదు దక్కాయన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 14,986 మందికి శస్త్ర చికిత్సలకు రూ.40.52కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఆరోగ్యలక్ష్మి కింద 3,680మంది బాలింతలకు 4,219మంది గర్భిణులకు, 12,450మంది చిన్నారులకు పోషక ఆహారం అందిస్తున్నామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం
ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేకూరిందని, దేశంలోనే తొలిసారి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎస్సీల కోసం ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతిగృహాల్లో ప్రవేశాలు కల్పించామని, 3,527మంది విద్యార్థులకు రూ.1.03కోట్ల ఉపకార వేతనాలు ఇచ్చామని తెలిపారు. పారదర్శకంగా కులగణన చేపట్టి, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద 3,250మంది లబ్ధిదారులకు రూ.35.26కోట్ల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలు 40శాతం, కాస్మెటిక్ చార్జీలు 200శాతం పెంచామన్నారు. తెలంగాణ వనమహోత్సవం కార్యక్రమంలో 20.53లక్షల మొక్కలు నాటామని, గీత కార్మికుల కోసం 26వేల ఈత, ఖర్జూర మొక్కలు నాటామన్నారు. రాచకొండ పోలీసులు నేరాల నియంత్రణలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. పలుశాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 162మంది ఉద్యోగులకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమాల్లో కలెక్టర్ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, ఎ.భాస్కర్‌రావు, డీసీపీ ఆక్షాం్‌షయాదవ్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ రాజలింగం పాల్గొన్నారు.