Share News

మట్టి గణనాథులనే పూజిద్దాం

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:14 AM

- (ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ టౌన) వినాయక ఉత్సవాల సమయం దగ్గర పడుతోంది. ఊరూరా, వాడవాడలా గణపతి ప్రతిమల ఏర్పాటు, గీతాల హోరు, ఊరేగింపు ల సందడి ప్రారంభం కానుంది. గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో పూజించిన గణనాథులను నిమజ్జనం చేయ డం ఆనవాయితీగా వస్తోంది.

 మట్టి గణనాథులనే పూజిద్దాం

మట్టి గణనాథులనే పూజిద్దాం

- (ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ టౌన)

వినాయక ఉత్సవాల సమయం దగ్గర పడుతోంది. ఊరూరా, వాడవాడలా గణపతి ప్రతిమల ఏర్పాటు, గీతాల హోరు, ఊరేగింపు ల సందడి ప్రారంభం కానుంది. గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో పూజించిన గణనాథులను నిమజ్జనం చేయ డం ఆనవాయితీగా వస్తోంది. అయితే మట్టికి బదులుగా రసాయనాలతో చేసిన విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేయడంతో మానవాళితో పాటు జలరాఽశులకు హాని కలుగుతోంది. ఈ నేపఽథ్యంలో మట్టి విగ్రహాలనే పూజించాలని, ప్రకృతి ప్రసాదించిన పత్రినే ఉత్సవాలకు వినియోగించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలూ వహిస్తున్నాయి. పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీ్‌స)తో తయా రు చేసి, రంగులు, రసాయనాలద్దే విగ్రహాలతో కలగనున్న నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. సత్యసాయి సేవా సమితి, కస్తూరి ఫౌండేషన, తలకోల శ్రీధర్‌రెడ్డి సంస్థ మట్టి విగ్రహాలను ఏటేటా పంచుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిదీ. రసాయనాలు, రంగులతో తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే జలం కాలుష్యమవుతుంది. ప్లాస్టిక్‌ ఉత్పత్తులను ఉత్సవాలకు వినియోగిస్తే అనేక దుష్ప్రభావాలున్నాయి. నీటిలో సులభంగా కరిగే విగ్రహాలను, ప్రకృతి ప్రసాదించిన పూలు, పత్రిని ఉత్సవాలకు ఉపయోగించాలి. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు 4 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాం. మరికొన్ని మట్టి విగ్రహాల పంపిణీకి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నాం.

- శ్రీనివాస్‌, మునిసిపల్‌ కమిషనర్‌, మిర్యాలగూడ

పద్నాలుగేళ్లుగా మట్టి గణనాథుల తయారీ ..

చిట్యాలరూరల్‌ : పర్యావరణానికి హానికరం లేని మట్టి విగ్రహాలను పూజించాలని ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన మండలోజు వినయ్‌ మట్టి విగ్రహాలను తయారు చేసి స్నేహితులతో కలిసి కాలనీలో ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నివాసాల్లో పూజ చేసే వారికి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా అందజేస్తున్నాడు మొదట్లో వినయ్‌ సరదాగా మట్టి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయాలనే ఆసక్తి కలగడంతో స్థానికంగా మట్టిని సేకరించి విగ్రహాన్ని చేసి నివాసంలో నిలిపి పూజించాడు. వృత్తి రీత్యా ప్రైవేటు ఉద్యోగి అయినా కులవృత్తి వడ్రంగి కావడంతో విగ్రహాన్ని తయారు చేయడం సులువు కావడంతో 14 ఏళ్ల క్రితం మట్టిని సేకరించి కొన్ని వినాయకుడి విగ్రహాలను తయారు చేశాడు. అనంతరం విగ్రహాల తయారీకి హైదరాబాద్‌లో దానికి సంబంధించిన మట్టిని కొనుగోలు చేశాడు. ముందుగా 2,4 అడుగులు, తరువాత 5, 6, 8 అడుగుల విగ్రహమే కాకుండా ఏకంగా 10 అడుగుల విగ్రహాన్ని తయారు చేశాడు.

వినయ్‌ విగ్రహాలను ఏటా వివిధ రూపాల్లో దేవతామూర్తుల చిత్రాలతో కలిపి తయారు చేస్తుంటాడు. వాటికి రంగులను అద్ది అందమైన రూపం వచ్చేలా చేస్తుంటాడు. అంతే కాకుండా చిన్నచిన్న మట్టి వినాయకుడి విగ్రహాలను తయారు చేసి స్నేహితులు, స్థానికులకు ఉచితంగా పంపిణీ చేస్తుంటాడు. వినయ్‌ తాను తయారు చేసిన మట్టి వినాయకుడిని ఆయన నివాసం సమీపంలో ఏర్పాటు చేసి సుమారు 12 ఏళ్ల వరకు పూజలు నిర్వహించాడు. అనంతరం కొందరు స్నేహితులు వివిధ ప్రాంతాల్లోకి వెళ్లడంతో పెద్ద విగ్రహం ఏర్పాటు చేయడం నిలిపివేశారు. అయితే తన నివాసంలో నిలుపుకునేందుకు మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుంటున్నాడు. ఈ ఏడాది తాను తయారు చేసిన వినాయకుడి విగ్రహం వెనుక విష్ణుమూర్తి అవతారం, పక్కన గరుడ వాహనం, మూషికం, అర్జునుడు నిల్చుండగా రథాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడి ప్రతిమ, మరో వైపు అర్జునుడికి గీతను బోధిస్తున్న అర్జునుడి చిరత్రాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహానికి రంగులు అద్ది తుది రూపానికి తీసుకువచ్చాడు.

మట్టి వినాయకుడి విగ్రహాలు చేయడం ఆనందంగా ఉంది

వినాయక చవితి వచ్చిందంటే మట్టి వినాయక విగ్రహమే మదిలో మెదలవుతాయి. మట్టిని కొనుగోలు చేసి 14 ఏళ్లు గా విగ్రహాలను తయారు చేస్తున్నాను. కులవృత్తి తనకు రావడంతో విగ్రహాలు తయారు చేయడం సులువైనది. విగ్రహాలను తయారు చేస్తున్నప్పుడు ఎంతో సంతోషం కలిగేది. పెద్ద విగ్రహాలతో పాటు చిన్న విగ్రహాలు తయారు చేయగా వాటిని చూసి న వారు మెచ్చుకునేవారు. మరికొందరైతే పొగడ్తలు అభినందనలతో ముంచెత్తేవారు. రానురాను విగ్రహాలు తయారు చేయడం తగ్గడంతో తమ నివాసం వరకే తయారు చేసుకుంటున్నాను.

- మండలోజు వినయ్‌, గుండ్రాంపల్లి, చిట్యాల మండలం

Updated Date - Aug 25 , 2025 | 12:14 AM