అందగత్తెలకు గుర్తుండేలా..
ABN , Publish Date - May 14 , 2025 | 12:46 AM
ప్రపంచస్థాయి అందగత్తెల పోటీదారులకు గుర్తుండేలా అతిథ్యం ఇచ్చేందుకు యాదగిరిగుట్ట దేవస్థానం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట దేవస్థానం ప్రొటోకాల్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో అధికారులకు పలు సలహాలు చేసి మాట్లాడారు.
యాదగిరిగుట్ట, పోచంపల్లిలో ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచస్థాయి అందగత్తెల పోటీదారులకు గుర్తుండేలా అతిథ్యం ఇచ్చేందుకు యాదగిరిగుట్ట దేవస్థానం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట దేవస్థానం ప్రొటోకాల్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో అధికారులకు పలు సలహాలు చేసి మాట్లాడారు. ఈ నెల 15న సాయంత్రం 5 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు మిస్‌వరల్డ్ పోటీదారులు వస్తున్నారని వివరించారు. యాదగిరిగుట్ట ఆధ్యాత్మిక క్షేత్రం ప్రపంచస్థాయి అందాలభామల సందర్శనతో అదే స్థాయిలో గుర్తింపు సాధించి టూరిజం స్పాట్‌గా నిలవనుందన్నారు. ఈవో సూచనల మేరకు పర్యటన రోజున సాయంత్రం బ్రేక్ దర్శనం, వెండి జోడు సేవలు రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. పర్యటన ముగిసిన వెంటనే యథావిధిగా కైంకర్యాలు కొనుగుతున్నట్లు వివరించారు. సమీక్షలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట తహసీల్దార్ దేశ్యానాయక్, ఆర్‌ఐ శ్రీకాంత్, ఆలయ డీఈవో దోర్భల భాస్కరశర్మ, సివిల్ సప్లయి ఈఈ జిల్లెల దయాకర్‌రెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ ఊడెపు వెంకటరామరావు పాల్గొన్నారు.
పర్యటన సాగుతుందిలా...
ఈ నెల 15న సాయంత్రం 5 గంటలకు 7 గంటల వర కు అందాలబామల యాదగిరిక్షేత్ర పర్యటన సాగనుంది. షెడ్యూల్ ప్రకారం ఇక్కడకు చేరుకున్న అందాలబామలు ముందుగా అఖండ దీపారాధన చేసి తర్వాత అక్కడినుంచి తూర్పురాజగోపురం (ఆలయం) వరకు వస్తారు. అక్కడినుంచి స్వర్ణ దివ్య విమాన రాజగోపురం దర్శించుకొని త్రితల రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి, అదే మార్గంలోని క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి, ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత అంతరాలయంలోని స్వయంభువులను దర్శించుకొని అనంతరం ఉపాలయాల్లో ఆండాల్ అమ్మవారు, ఆళ్వార్లను దర్శించుకొని గర్భాలయానికి అభిముఖంగా ఆశీర్వచనం తీసుకుంటారు. అక్కడినుంచి ఆలయ అందాలు వీక్షిస్తూ పశ్చిమ రాజగోపురం ద్వారా ఆలయం వెలుపలకు వస్తారు. అనంతరం ఆలయ ప్రాకార మండపాలు, తిరువీధుల్లో పర్యటించి తిరుగు ప్రయాణమవుతారు.
ప్రపంచ సుందరీమణుల సందర్శనకు పటిష్ఠ ఏర్పాట్లు
భూదాన్‌పోచంపల్లి, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ సుందరీమణుల సందర్శనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. భూదాన్‌పోచంపల్లికి ఈ నెల 15న ప్రపంచ సుందరీమణుల పర్యటన పురస్కరించుకుని మంగళవారం పోచంపల్లి రూరల్ టూరిజం సెంటర్‌లో చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. పోచంపల్లి టూరిజం పార్కులో పనులను వేగవంతం చేయాలన్నారు. పోచంపల్లి చేనేత వస్త్ర పరిశ్రమ మ్యూజియంలో పనులను టూరిజం అధికారులతోపాటు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు. రాష్ట్ర సంచాలకులు డాక్టర్ లక్ష్మీతోపాటు ఆయన టూరిజం సెంటర్ సందర్శించారు. మ్యూజియంలో చూపరులను ఆకట్టుకునేలా చేనేత వస్త్రాల ఫొటోలు ఏర్పాటు చేయాలన్నారు. హంపి థియేటర్‌లో ప్రదర్శనలు ఉంటాయన్నారు. విశ్వసుందరీమణుల రాకతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన చేనేత వస్త్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం కానుందన్నారు. అంతర్జాతీయపరంగా మార్కెట్ పెరిగి నేతన్నల జీవితాల్లో వెలుగులు చూస్తామన్నారు. కోలాటాలతో విశ్వసుందరీమణులకు స్వాగతం ఉంటుందని, చేనేత వస్త్రాలపై వివిధ స్టాల్స్ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇక్కత్, డబుల్ ఇక్కత్ లను వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో టూరిజం కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఉపేందర్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్‌రెడ్డి, ఏసీపీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.