నిమ్మధరలు ఢమాల్
ABN , Publish Date - May 06 , 2025 | 11:56 PM
వేసవి వచ్చిందంటే నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే ధర ఎక్కువగా పలుకుతుంది. అయితే అకాల వర్షాలతో డిమాండ్ తగ్గి ధర నేల చూపులు చూస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వేసవి వచ్చిందంటే నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే ధర ఎక్కువగా పలుకుతుంది. అయితే అకాల వర్షాలతో డిమాండ్ తగ్గి ధర నేల చూపులు చూస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లాలో మూడు వేల ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేశారు. ఎకరాకు సాగు కోసం రూ.1.20 లక్షలు ఖర్చు చేశారు. పంట దిగుబడి బాగుందని, ఈ ఏడాది మంచి ఆదాయం వస్తుందని భావించిన రైతులకు అకాల వర్షం నిరాశ మిగిల్చింది. ఏప్రిల్ కిలో రూ.80 ఉన్న ధర ప్రస్తుతం రూ.30కి పడిపోయింది.
(ఆంధ్రజ్యోతి-కోదాడ)
పంట చేతికందే దశలో ధర పలుకుతుండటంతో నిమ్మ సాగు చేసిన రైతులు లాభాలు ఆశించారు. మార్చి నెలలో అంతంత మాత్రం ఉన్న ధర, ఏప్రిల్‌లో పెరిగింది. మంచి ఆదాయం వస్తుందని ఆశించిన రైతులను వరుసగా కురుస్తున్న అకాల వర్షాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. వర్షాల పేరుతో దళారులు ధర తగ్గించటంతో రైతులు దిగాలు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులు, రవాణా ఖర్చులు, వ్యాపారుల కమిషన్లను ఎదుర్కొనేలా దిగుబడి వచ్చే సమయంలో మద్దతు ధర ఉంటుందని భావించగా ధర లేక రైతులు తల పట్టుకున్నారు. పెట్టుబడికి తగ్గ ఆదాయం రాక ఆందోళన చెందుతున్నారు. మార్చిలో కిలో ధర రూ.30 ఉండగా, ఏప్రిల్‌లో రూ.80కి పెరిగింది. ఈ నెల మొదటివారం వచ్చేటప్పటికీ ధర రూ.30 తగ్గిందని వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడులకు, సరైన ఫలితం లేక ఇబ్బందులు పడుతున్నామని బావురుమంటున్నారు. ప్రభుత్వం ఎప్పుడూ కిలోకి ధర రూ.45 ఉండేలా చర్యలు తీసుకుంటే రైతులు నష్టపోకుండా ఉంటారని పేర్కొంటున్నారు. అదేవిధంగా వరికి బోనస్ ఇచ్చిన మాదిరే, నిమ్మసాగు చేసే రైతులను గుర్తించి, వారికి తక్కువ ధరకు దుక్కి, పురుగు మందులు అందిస్తే నిమ్మ సాగు వైపు రైతులు మొగ్గుచూపుతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరైన ధర లేకపోవటంతో నష్టాలు భరించలేక రైతులు ఏటేటా నిమ్మ సాగును తగ్గిస్తూ, ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తే, ఆదాయం రూ1.44,000 వస్తుందని, ఖర్చులు పోను ఎకరాకు రూ.24 వేలు వస్తుందంటున్నారు. మూడు ఎకరాలు సాగు చేస్తే ఏడాదికి వచ్చే రాబడి రూ.72 వేలు అని, దీంతో పెరుగుతున్న ధరలతో ఇల్లు గడపటం కష్టమవుతుందంటున్నారు.
పెరుగుతున్న ఖర్చులు, పిల్లల చదువులకు డబ్బుల్లేక ముందుకు సాగడంలేదని వాపోతున్నారు. రైతులు నిమ్మ సాగు వైపునకు మళ్లాలంటే మార్కెట్‌తో పనిలేకుండా ప్రభుత్వమే నేరుగా కిలో రూ.45 చొప్పున కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో మూడు వేల ఎకరాల్లో సాగు
సూర్యాపేట జిల్లాలో మూడు వేల ఎకరాల్లో నిమ్మ సాగు చేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ఎకరాకు 80 నిమ్మ మొక్కలు వేస్తారు. నాలుగు సంవత్సరాల నుంచి కాపు మొదలవుతుంది. అక్కడ నుంచి వానాకాలంలో ఎండుపుల్ల తీయటానికి ఒక్కో చెట్టుకు రూ.60, పాదులు తీసేందుకు రూ.80, పైమందులకు రూ.415, సేంద్రీయ ఎరువు, దుక్కి మందుకు రూ.330, కూలీల రవాణాకు రూ.200, కమీషన్‌దారుడికి రూ.100కి రూ.15,కూలీకి రూ.200, నిమ్మకాయల టిక్కీ రవాణాకు రూ.200 మొత్తంగా ఒక నిమ్మచెట్టుకు ఏడాదిలో రూ.1,471 ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. ఆ చొప్పున 80 మొక్కలకు(ఎకరాల్లో) రూ.1.20 ఖర్చు వస్తుంది. ఒక చెట్టు వానాకాలంలో 50 కిలోలు, వేసవిలో 50 కిలోలు టిక్కి(సిమెంట్ బస్తా) ఇస్తుంది. కాగా వానాకాలంలో కిలో నిమ్మకాయలు రూ.6 ఉండగా, మార్చిలో కిలో రూ.30కి పెరిగింది. ఎకరాకు వానాకాలంలో ఒక చెట్టుకు(6 సంవత్సరాలు) 50 కిలోల టిక్కీ(సిమెంట్‌బస్తా) రాక, కిలో రూ.6 చొప్పున రూ.300 ఆదాయం వస్తుంది. మార్చి నెలకు ఒక టిక్కీకి(50కేజీలు) కిలో రూ.30 చొప్పున రూ.1500, వానాకాలం క్వింటా, మార్చిలో వచ్చే క్వింటా కలిపి రూ.1800 ఆదాయం వస్తుంది. ఆ చొప్పున ఎకరంలో 80 చెట్లకు రూ.1.44 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చు రూ.1.20 లక్షలు పోను మిగిలేది రూ.24 వేలు మాత్రమే అని రైతులు అంటున్నారు. సీజనతో సంబంధం లేకుండా ప్రభుత్వం కిలో నిమ్మకాలను రూ.45కు కొనుగోలు చేస్తే లాభంతో పాటు రైతులకు ఇబ్బంది ఉండదంటున్నారు. ప్రతి ఏడాది రేటు తక్కువగా ఉండటం, చేసిన ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం రాక, కొత్త వారికి సాగు చేయాలని ఆలోచన రావటం లేదంటున్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మార్కెట్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
చేతి ఖర్చులు కూడా రావడం లేదు
పదిహేను ఏళ్ల నుంచి నిమ్మతోట సాగు చేస్తున్నా. వేసవిలో రేటు వచ్చినట్లే ఉంటుంది. తీరా పంట చేతికి వచ్చే సమయానికి ధర పడిపోతుంది. ఫలితంగా భార్యాభర్తలం ఆరుగాలం చేసిన కష్టానికి, ఖర్చుకు ఆదాయానికి పొంతన లేకుండా ఉంటుంది. చివరకు చేతి ఖర్చులు కూడా మిగిలే పరిస్థితి లేదు. ఏప్రిల్‌లో కిలో రూ.80 ఉంటే, ప్రస్తుం రూ.30కి తగ్గింది. దిగుబడి వచ్చేనాటికి అకాలవర్షాల పేరుతో దళారులు ధరను సగానికి తగ్గించారు. దీంతో చేసేదేమీ లేక ఇచ్చిన ధర తీసుకొని సర్దుకోవాల్సి వస్తోంది. రైతు పరిస్థితి ఏడాదికేడాది దిగజారుతోంది. 15 ఏళ్ల కిందట 10 ఎకరాల్లో నిమ్మసాగు చేస్తే, నేడు మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నా. బహిరంగ మార్కెట్‌లో ఒక నిమ్మకాయ వచ్చి రూ.15పైనే పలుకుతోంది. రైతుకు వచ్చేటప్పటికీ ఆ ధర ఉండదు. అన్నిరకాల ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. నిమ్మకాయల ధర మాత్రం పెరగటంలేదు. సూర్యాపేట జిల్లాలో 15 ఏళ్ల కిందట నిమ్మసాగు అధికంగా ఉండేది. ఖమ్మం డిపో వారు ప్రత్యేకంగా నడిగూడెం మండలానికి నిమ్మకాయలు తీసుకెళ్లేందుకు ఉదయం, సాయంత్రం బస్సు నడిపేవారు. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఏడాది 10 ఎకరాల్లో నిమ్మ చెట్లు తీసివేసి, ఇతర పంటలను వేస్తున్నారు. నిమ్మసాగుతో సరైన ఆదాయం ఉండటం లేదు. మంచి దుస్తులు వేసుకోలేకపోతున్నాం. పిల్లలను చదివించాలన్నా ఇబ్బంది పడుతున్నాం. పెట్టుబడికి రాబడి వచ్చేలా దళారులు లేకుండా, నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
పగడాల వెంకటనారాయణ, నిమ్మ రైతు