రోడ్డును ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:35 AM
రహదారులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నారు. జిల్లా కేంద్రంలో ఖమ్మం అండర్ పాస్ వద్ద సోమవారం రాత్రి ఎస్పీ తన సిబ్బందితో కలిసి పర్యటించారు.
సూర్యాపేట క్రైం, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : రహదారులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నారు. జిల్లా కేంద్రంలో ఖమ్మం అండర్ పాస్ వద్ద సోమవారం రాత్రి ఎస్పీ తన సిబ్బందితో కలిసి పర్యటించారు. స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ రోడ్డు ఆక్రమణలతో తలెత్తే సమస్యలపై అవగాహన కల్పించారు. రోడ్డు అక్రమించిన వ్యాపారుల బోర్డులను సిబ్బందితో తొలగింపజేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాకేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజలు వారి అవసరాల నిమిత్తం జిల్లాకేంద్రానికి వచ్చి పోతుంటారన్నారు. దీంతో వాహనాల రద్దీ పెరిగిందన్నారు. దానికి అనుగుణంగా పోలీసులు వాహనాల రద్దీని పునరుద్ధరిస్తూ పని చేస్తున్నారని తెలిపారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారులు చేయడంతో వాహనదారులు, సాధారణ ప్రజలు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దుకాణదారులు, చిరువ్యాపారులు ఎవరూ రోడ్లపై ఇక నుంచి వ్యాపారులు చేయవద్దని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. మునిసిపల్ అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలో రోడ్డు ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. వ్యాపారులు, దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రోడ్ల ఆక్రమణ విషయంలో దుకాణదారులు పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ సూచించారు.
ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
సూర్యాపేట క్రైం, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజల అర్జీలపై వెంటనే స్పందించాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజవాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి వారితో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు అండగా పోలీ్‌సశాఖ ఉంటుందన్నారు. ప్రజలు అందించే అర్జీలపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. భూసమస్యల విషయంలో ప్రజలు ఘర్షణలు పడవద్దని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.