కృష్ణమ్మ పరవళ్లు..పర్యాటకుల కేరింతలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:16 AM
నాగార్జునసాగర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు పర్యాటకుల కేరింతలు సాగర్‌లో కనువిందు చేస్తున్నాయి.
భారీగా తరలివచ్చిన పర్యాటకులు
నాగార్జునసాగర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు పర్యాటకుల కేరింతలు సాగర్‌లో కనువిందు చేస్తున్నాయి. ఎగువనుంచి వరద రాక, ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకుల రాకతో నాగార్జునసాగర్ పరిసరాలు సందడిగా మా రాయి. వారం రోజులుగా సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం సాగర్ జలాశయానికి ఎగువ నుంచి 4,16,324 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, నీటి మట్టం 585 అడుగులు (297.4350టీఎంసీలు)గా నమోదైంది. సాగర్‌నుంచి కుడి కాల్వ ద్వారా 9,019 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 7,518 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత కేంద్రం ద్వారా 33,373 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, 26 క్రస్ట్ గేట్ల నుంచి 3,63, 714 క్యూసెక్కుల నీటిని దిగువ కు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 4,16,324 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి 4,16,324 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది.
పర్యాటకులతో సందడి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తుండడం, ఆదివారం సెలవుదినం కావడంతో కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. దీంతో సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన బుద్ధవనం, విజయవిహార్, కొత్తవంతెన, ప్రధాన జలవిద్యుత కేంద్రంవద్ద పర్యాటకుల రద్దీ నెలకొంది. ఆంధ్రప్రదేశ-తెలంగాణ సరిహద్దులో కొత్త వంతెన వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు వాహనాలు కొత్త వంతెన మీదుగా రావడానికి గంట సమయం పట్టింది.