కేజీబీవీ విద్యార్థినికి విమాన ప్రయాణం
ABN , Publish Date - May 08 , 2025 | 12:13 AM
పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధిస్తే విమాన ప్రయాణం చేయిస్తానని కేజీబీవీ విద్యార్థినులకు ఇచ్చిన మాటను నల్లగొండ జిల్లా కలెక్టర్ నిలబెట్టుకున్నారు.
10/10 జీపీఏ సాధిస్తే విమాన ప్రయాణం చేయిస్తానని గతంలో హామీపత్రం
హామీ నిలబెట్టుకున్న నల్లగొండ జిల్లా కలెక్టర్
మాడ్గులపల్లి/ నల్లగొండ రూరల్, మే 7 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధిస్తే విమాన ప్రయాణం చేయిస్తానని కేజీబీవీ విద్యార్థినులకు ఇచ్చిన మాటను నల్లగొండ జిల్లా కలెక్టర్ నిలబెట్టుకున్నారు. కేజీబీవీలో జిల్లాలో మొదటి స్థానం సాధించిన మాడ్గులపల్లికి చెందిన విద్యార్థిని ప్రసన్న కలను కలెక్టర్ ఇలాత్రిపాఠి నెరవేర్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన కలెక్టర్ ఇలాత్రిపాఠి కనగల్ మండలంలోని కేజీబీవీని సందర్శించిన సమయంలో ఈ ఏడాది పదో తరగతిలో అత్యధిక మార్కులు సాఽధించే కేజీబీవీ విద్యార్థినులను తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయిస్తానని హామీపత్రం రాసి ఇచ్చారు. మాడ్గులపల్లికి చెందిన విద్యార్ధిని పుట్ల ప్రసన్న 563 మార్కులు సాధించగా, ఇచ్చిన మాట ప్రకారం విమాన ప్రయాణ టికెట్లను కలెక్టర్ ఇలాత్రిపాఠి బుధవారం తన ఛాంబర్‌లో విద్యార్థినికి అందించారు. విద్యార్థిని ప్రసన్న, మాడ్గులపల్లి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కె.సునీత ఈ నెల 17న హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు విమానంలో వెళ్లి 19వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. విమాన ప్రయాణ చార్జీలతోపాటు విశాఖపట్టణంలో అక్కడ వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కలెక్టర్ తన సొంత ఖర్చులతో కల్పిస్తున్నారు. ఆడ పిల్లలను చదువుకోవాలని ప్రోత్సహించడమే కాకుండా సొంత ఖర్చుతో విమాన ప్రయాణం అవకాశం కల్పించి విశాఖపట్టణం పంపిస్తున్నందుకు విద్యార్థిని ప్రసన్న, కేజీబీవీ ప్రత్యేక అధికారి కె.సునీత జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, డీఈవో భిక్షపతి తదితరులు ఉన్నారు.