కల్యాణలక్ష్మి మొత్తం పెంచాలి
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:21 AM
పెళ్లిళ్ల ఖర్చులు పెరిగినందున కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సహాయాన్ని పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం మోత్కూరు మండల పరిషత్ కార్యాలయంలో 87 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.87,10,092 విలు వైన చెక్కులను ఆయన పంపిణీచేసి మాట్లాడారు.
విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా : సామేలు
మోత్కూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): పెళ్లిళ్ల ఖర్చులు పెరిగినందున కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సహాయాన్ని పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం మోత్కూరు మండల పరిషత్ కార్యాలయంలో 87 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.87,10,092 విలు వైన చెక్కులను ఆయన పంపిణీచేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో పని చేస్తుందన్నారు. బునాదిగాని కాల్వ నిర్మాణానికి రూ.267కోట్లు మంజూరయ్యాయని, కాల్వ తవ్వకం కోసం భూ సేకరణ జరుగుతుందని, సర్వే, భూసేకరణ పూర్తికాగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. బునాదిగా ని కాల్వకు బస్వాపురం రిజర్వాయర్ ద్వారా గోదావరి జలా లు కూడా వ చ్చే అవకాశముందన్నారు. తేలికపాటి వర్షాలకు విత్తనాలు విత్తి రైతు లు నష్టపోవద్దని,విత్తనాలకు తేమ సరిపోతుందునుకుంటేనే విత్తనాలు వే యాలన్నారు. మోత్కూరులో ఆర్టీసీబస్సు డిపో, 30 పడకల ఆస్పత్రి, బిక్కేరు వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. మోత్కూరులో పోలీస్ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఆయన ఫోన్‌లో సీపీ ని కోరగా మోత్కూరు, అడ్డగూడూరులో సీఐ కార్యాలయాలు ఏర్పాటు చే సేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీవో డి.బాలాజీ, పాల్గొన్నారు.
తులం బంగారమేది సారూ...
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కల్యాణలక్ష్మి డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రచారం చేశారని, తులం బంగారు ఏది సారు అని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా గోరేమియా అనే వ్యక్తి ప్రశ్నించారు. ఎమ్మెల్యే సామేలు ఆయన్ను వేదిక వద్దకు పిలుచుకుని ప్రభుత్వాన్ని కుటుంబంతో పోల్చుతూ కుటుంబం ఆర్థికంగా ఉంటేనే కదా ఏదైనా కొనుక్కోగలుగుతామన్నారు. అందుకు గోరేమియా అవుననగా, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని, ప్రభుత్వం నిధులు సమకూర్చుకున్నాక ఇస్తుందని చెప్పి ఎమ్మెల్యే ఆయన్ను సంతృప్తి పర్చారు.