Share News

వేసవిలో ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , Publish Date - Mar 17 , 2025 | 12:27 AM

వేసవిలో జిల్లా లో సాగు, తాగునీరు, విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

వేసవిలో ఇబ్బందులు లేకుండా చూడాలి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): వేసవిలో జిల్లా లో సాగు, తాగునీరు, విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో సాగునీటి సౌకర్యంతోపాటు సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని, ఫలితంగా విద్యుత్‌కు డిమాండ్‌ సైతం పెరిగిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సాగు, తాగునీరు, విద్యుత్‌ ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది వరి దిగుబడి భారీగా వచ్చే అవకాశం ఉన్నందున ఐకేపీ కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, టార్పాలీన్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వ్యవసాయశాఖకు 80 క్లస్టర్లు, ఏఈ పోస్టులు మంజూరు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి మంత్రి దృష్టికి తీసుకురాగా, వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడి క్లస్టర్లను మంజూరు చేయాలని కోరడంతో అందుకు ఆయన సమ్మతించారు. నెలలోపు క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. నల్లగొండ పట్టణంతో పాటు, గ్రామాల్లో ఎలాంటి విద్యుత్‌ కోతలు ఉండవద్దన్నారు. వచ్చే నెల 1 లేదా 2న రూ.36కోట్లతో నిర్మించనున్న కలెక్టర్‌ కార్యాలయ అదనపు భవనాల నిర్మాణాలకు, 15 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, మాడుగులపల్లి పోలీ్‌సస్టేషన్‌ భవనం, ఇతర కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలో కొత్త పోలీస్‌ క్వార్టర్ల నిర్మాణానికి అనుమతి రానున్నదని, డీఎస్పీ కార్యాలయం మంజూరైనందున శంకుస్థాపన చేస్తామన్నారు. రూ.520కోట్లతో మంజూరైన బైపాస్‌ రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా అందిస్తున్న సాగునీరు, పంటల పరిస్థితి, తాగునీరు, విద్యుత్‌, తదితర అంశాలను మంత్రికి వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌అమిత్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి శ్రవణ్‌, ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివా్‌సరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ‘ప్రజావాణి’ నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట

(ఆంధ్రజ్యోతి, కనగల్‌): రైతు సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం కనగల్‌ మైలసముద్రం చెరువుతో పాటు ఏఎమ్మార్పీ డిస్ట్రిబ్యూటరీ-25 పరిధిలోని 6-ఎల్‌ మైనర్‌ కాల్వను ఆయన పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏఎమ్మార్పీ కింద 2.20లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం 2.15లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోందన్నారు. ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మండల పరిధిలోని ఏఎమ్మార్పీ మైనర్‌ కాల్వలను రైతుల కోరిక మేరకు రూ.90లక్షలు సొంత నిధులతో పనులను చేపట్టి పూర్తిచేయించానన్నారు. రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్‌పాండ్లు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీల ఆధునీకరణ, లైనింగ్‌ పనులకు రూ.1,000కోట్లతో త్వరలో ప్రభుత్వం టెండర్లు పిలవనుందని తెలిపారు. పొనుగోడు, నర్సింగ్‌భట్ల, కంచనపల్లి,బక్కసాయికుంట ఎత్తిపోతల పథకాలకు ఈనెల 28న శంకుస్థాపన చేస్తానన్నారు. కార్యక్రమంలో అధికారులతోపాటు మాజీ జడ్పీటీసీలు నర్సింగ్‌ శ్రీనివా్‌సగౌడ్‌, మందడి రాంచంద్రారెడ్డి, గడ్డం అనూ్‌పరెడ్డి, భిక్షంయాదవ్‌, గోలి జగాల్‌రెడ్డి, నర్సింగ్‌ కృష్ణయ్యగౌడ్‌, మురళిగౌడ్‌, భారతివెంకన్న, వెంకట్‌రెడ్డి, రాజురెడ్డి, దిలీ్‌పరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఆయకట్టు చివరి వరకూ నీరు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి, తిప్పర్తి): ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మామిడాల గ్రామ చెరువును ఆయన పరిశీలించారు. సాగునీటి సమస్యకు కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. డీ-40 కాల్వ కింద ఉన్న 11-ఎల్‌ మైనర్‌ కాల్వ ద్వారా చెరువుకు చేరాల్సిన నీరు పూర్తిస్థాయిలో రావడంలేదని, దీనికి కొందరు కాల్వను పూడ్చడమే కారణమని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి స్పందించి వెంటనే సాగునీరు చెరువులోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠిని ఆదేశించారు. గ్రామానికి చెందిన నిరుపేద మహిళ ముత్తం రాజేశ్వరి చెరువు పక్కనే పూరిగుడిసెలో నివాసం ఉంటుండగా, ఆమెకు వచ్చే దఫాలో ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని ఎంపీడీవో ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. తాత్కాలికంగా రేకులతో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు రూ.50వేల ఆర్థిక సాయం చేయాలని సూచించారు. మంత్రి వెంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జూకూరి రమేష్‌, నాగులవంచ లింగారావు, పాదూరి శ్రీనివా్‌సరెడ్డి, బొల్లెద్దు నాగారాణి అంబేడ్కర్‌, ఈదయ్య, ఉన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 12:27 AM