పారిశుధ్యంపై అవగాహనేదీ?
ABN , Publish Date - May 24 , 2025 | 11:54 PM
వ్యర్థాల నిర్వహణలో జిల్లాలోని మునిసిపాలిటీలకు ఆదర్శంగా ఉండాల్సిన భువనగిరి మునిసిపాలిటీలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.

పరిసరాల పరిశుభ్రతకు ముప్పుగా వ్యర్థాలు
భువనగిరి టౌన, మే 24 (ఆంధ్రజ్యోతి): వ్యర్థాల నిర్వహణలో జిల్లాలోని మునిసిపాలిటీలకు ఆదర్శంగా ఉండాల్సిన భువనగిరి మునిసిపాలిటీలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మునిసిపల్ యంత్రాంగం ఇంటింటా చెత్త సేకరణను ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయనేది వాస్తవం. అయితే ఈ తరహా పరిస్థితికి ప్రజల నిర్లక్ష్య వైఖరి కూడా కారణమవుతోందని పారిశుధ్య కార్మికులు బహిరంగంగా వాపోతున్నారు. కాగా పట్టణ పరిసరాల పరిశుభ్రతకు ఫంక్షనహాల్స్ నిర్వహణ తీరు ఆటంకంగా మారుతోందని పలువురు పేర్కొంటున్నారు.
పరిసరాలలోనే ఫంక్షనహాల్స్ వ్యర్థాలు
భారీ మొత్తంలో చార్జీలను పంక్షనహాల్స్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. పంక్షనహాల్ అదేతో పాటు శానిటేషన, లేబర్ తదితర రూపకాలలో అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. దీంతో ఫంక్షనహాల్స్‌లో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలను జాగ్రత్తగా మునిసిపల్ డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యత కూడా ఫంక్షనహాల్ నిర్వాహకులదే. కానీ పలువురు ఫంక్షనహాల్స్ నిర్వాహకులు వినియోగదారుల నుంచి చార్జీలను పకడ్బందీగా వసూలు చేస్తూ వ్యర్థాల నిర్వహణను మాత్రం విస్మరిస్తున్నారు. ఇదే సమయంలో మునిసిపల్ పారిశుధ్య సిబ్బంది కూడా ఫంక్షనహాల్స్ వ్యర్థాలను సేకరించడంలో పలు కారణాలతో అలసత్వవైఖరి ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఫంక్షనహాల్స్‌లో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలు రహదారులపైకి చేరుతూ పరిసరాల పరిశుభ్రతకు ఆటంకంగా మారుతున్నాయి. విందుల పేరిట మేకలు, గొర్రెల వధతో వ్యాపిస్తున్న దుర్గంధం వెలువడుతున్న వ్యర్థాలు పట్టఫ పరిశ్రుభతకు ఆటంకంగా మారుతున్న పరిస్థితి. దీంతో ఫంక్షనహాల్స్ పరిసరాల్లోని ప్రజలు పారిశుధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఇప్పటికైనా ఫంక్షనహాల్స్ నిర్వహణపై మునిసిపల్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.
వ్యర్థాలన్నీ రహదారులపైనే
శుభ కార్యాలు, విందులు జరగడం పరిపాటే. ఆర్థిక స్తోమత, అవసరాలు ఆధారంగా గృహాలు లేదా ఫంక్షనహల్స్‌లో కార్యక్రమాలు, విందులు నిర్వహిస్తుంటారు. అయితే శుభకార్యాల నిర్వహణపై శ్రద్ధను చూపుతూ కార్యక్రమాల అనంతరం ఉత్పత్తి అయ్యే వ్యర్థాల నిర్వహణను పలువురు విస్మరిస్తున్నారు. ఫలితంగా ఏదేని ఇంటిలో శుభకార్యం, విందు జరిగినా మరుసటి రోజు ఆయా ప్రాంతాల రహదారులపై విస్తరాకులు, ప్లాస్టిక్ గ్లాసులు, పువ్వులు, ఇతర వ్యర్థాలు పేరుకపోతున్నాయు. దీంతో పరిసరాల పరిశుభ్రతకు తీవ్ర ఆటంకంగా మారుతున్న పరిస్థితి. మునిసిపల్ పరిధిలో సుమారు 15కు పైగా ఫంక్షనహాల్స్ ఉన్నాయి. కొన్ని పంక్షనహాల్స్ నిర్వాహకులు మాత్రం వ్యర్థాల నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తుంగా మెజార్టీ ఫంక్షన హాల్స్ యాజమానులు మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. అలాగే పట్టణ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం పరిసరాల్లో సుమారు 25 మినీ హాల్స్‌లో విందులు నిత్యం జరుగుతుంటాయి. మంగళ, ఆదివారాలలో ఆరుబయటే విందులు సర్వసాధారణం. అంతే స్థాయిలో బహిరంగంగా వ్యర్థాలు పేరుకుపోతూ పరిసరాలు దుర్గంధపూరితంగా మారుతున్నాయి.
చర్యలు తీసుకోవాలి
పరిసరాల పరిశుభ్రతకు మునిసిపల్ యంత్రాంగం శ్రద్ధ చూపాలి. వ్యర్థాలను రహదారులపై పారవేసే ఫంక్షన హాల్స్ నిర్వాహకులు, ప్రజలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. రేణుక ఎల్లమ్మ ఆలయ పరిసరాలలో వ్యర్థ పదార్థాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలి.
-మేడి కోటేష్, భువనగిరి
వ్యర్థాలను రహదారులపై పారబోస్తే కఠిన చర్యలు
వ్యర్థాలను రహదారులపై పారబోస్తే మునిసిపల్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఫంక్షనహాల్స్ నిర్వాహకులు వ్యర్థాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి. రేణుక ఎల్లమ్మ ఆలయ పరిసరాలలో ఉత్పత్తి అవుతున్న చెత్తను డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యత ఫంక్షనహాల్ నిర్వాహకులదే. విస్మరిస్తే చర్యలు తప్పవు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను చెత్తసేకరణ సిబ్బందికే అందించాలి.
-జి.రామలింగం, కమిషనర్, భువనగిరి మునిసిపాలిటీ