శ్మశాన వాటిక స్థలం కబ్జా?
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:16 AM
చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్న కబ్జాదారులు చివరకు శ్మశాన వాటిక స్థలాన్ని సైతం వదలడం లేదు.
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
కలెక్టర్ ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
(ఆంధ్రజ్యోతి-త్రిపురారం)
చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్న కబ్జాదారులు చివరకు శ్మశాన వాటిక స్థలాన్ని సైతం వదలడం లేదు. త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని కోమటిగూడెం గ్రామ ప్రజలు 50 ఏళ్లుగా వినియోగిస్తున్న శ్మశాన వాటిక స్థలాన్ని కొందరు కబ్జాకు పాల్పడ్డారు. గ్రామస్థులు ఉపాధి హా మీ పథకంలో భాగంగా శ్మశాన వాటికలో మొక్కలు నాటడానికి ఇటీవల గుంతలు తీస్తుండగా కబ్జాదారులు అడ్డుకున్నారు. రెం డేళ్ల క్రితం ఓ వ్యక్తి చనిపోవడంతో అంత్యక్రియల కోసం శ్మశానంలో ఏర్పాట్లు చేస్తుండగా ఓ వ్యక్తి కుటుంబం సహా వచ్చి అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంత్యక్రియలను అడ్డుకున్నారు. దాంతో గ్రామస్థులు త్రిపురారం మం డల కేంద్రంలోని పోలీ్‌్‌సస్టేషన్ ఎదుట ధర్నా చేశారు. చివరికి పోలీసుల సాయంతో రెవె న్యూ అధికారులు తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. శ్మశానికి హద్దులు ఏర్పాటు చేస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చినా ఏళ్లు గడిచినా అధికారులు పట్టించుకోలేదు. తహసీల్దార్, ఆర్డీవోతో పాటు కలెక్టర్ ఫిర్యాదు చేశారు.. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దాంతో కబ్జాదారులు మరోసారి శ్మశానికి ఆక్రమణకు పూనుకున్నారు.. ప్రస్తుతం శ్మశాన వాటిక స్థలానికి నీరు పెట్టి పంటల సాగుకు సిద్ధమవుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
అంతా ప్రభుత్వ స్థలమే..
కోమటిగూడెం గ్రామంలో 275 సర్వే నంబర్‌లోని భూమిని 30 ఏళ్ల క్రితం ఓ ఆర్మీ జవాన్‌కు 2 ఎకరాల 8 గుంటల భూమిని ప్ర భుత్వం కేటాయించింది. అతడు ఈ భూమిని పదేళ్ల క్రితం దుగ్గేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి విక్రయించాడు. ఆ భూమి పక్కనే ఉన్న వ్యక్తి మరో రెండు ఎకరాలను ఆక్రమణ చేసి సాగు చేస్తున్నాడు. అందులో ఎకరం భూమిని ఇతరులకు రూ.12లక్షల వరకు విక్రయించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.. చివరకు అతడు శ్మశానం ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి. శ్మశానంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.