ముమ్మరంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
ABN , Publish Date - May 07 , 2025 | 12:18 AM
పేదవారి ఇంటి కల నేరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు మండలంలోని తిమ్మాపురంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఆత్మకూరు(ఎం) మే 6 (ఆంధ్రజ్యోతి): పేదవారి ఇంటి కల నేరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు మండలంలోని తిమ్మాపురంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జిల్లాలో ఆత్మకూరు(ఎం) మండలంలోని తిమ్మాపురాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసింది. తిమ్మాపురం గ్రామంలో 31 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు సొంత ఇంటి కల నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఇంటి నిర్మాణాలు చేపట్టారు. అందులో నలుగురివి బినామీ పేర్లు ఉండటంతో వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. మిగిలిన 27 మందిలో ముగ్గురు తమకు వద్దు అంటూ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. 24 మందిలో 20 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతుండగా, నలుగురు నిర్మాణాలు మొదలు పెట్ట లేదు. ఏడుగురు లబ్ధిదారుల ఇళ్లు రూఫ్ లేవల్, బేష్ మెంట్ వరకు నిర్మాణాలు చేపట్టారు. మరో 13 మంది ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా కొంత మంది లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇస్తామన్న రూ.5 లక్షలు ఇచ్చినా సరే కానీ పెద్ద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు సరిపోదని, ఇందిరమ్మ ఇంటికి అదనపు గదులు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పనులు చురుగ్గా సాగుతున్నప్పటికీ లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు ఇద్దరికి మాత్రమే రూ.లక్ష చొప్పున బిల్లులు వచ్చినట్టు తెలిపారు. ఇంటి నిర్మాణం జరిగిన వరకు రావాల్సిన బిల్లులు వెంట వెంటనే ఇవ్వాలని కోరారు. త్వరగతిన బిల్లులు ఇస్తే మిగిలిన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేస్తామని అంటున్నారు అబ్ధిదారులు.
ఇందిరమ్మ ఇల్లు పేదోడికి గొప్ప వరం
ఇందిరమ్మ ఇల్లు పథకం పేదోడికి గొప్ప వరం లాంటిది. అస లు ఉండటానికి ఇల్లు లేని వారికి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. నాకు సొంత ఇల్లు ఉందన్న సంతృ ప్తి కలిగింది. ఇప్పటికి నాకు రూ.లక్ష రూపాయల బిల్లు వచ్చింది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
-భట్టు అలివేలు, లబ్ధిదారు
వారం రోజుల్లో బిల్లులు వస్తాయి
లబ్ధిదారులకు వారం రోజుల్లో బిల్లులు వస్తాయి. వివిధ దశ ల్లో జరిగిన నిర్మాణాల వారీగా బిల్లులు ప్రభుత్వానికి పంపిం చాం. బేస్మెంట్, రూప్ లెవల్‌కు లక్ష, శ్లాబ్ లెవల్‌కు రూ.2లక్షలు, కంప్లీట్ అయన తర్వాత లక్ష చొప్పున బిల్లులు వస్తాయి.
-కోటయ్య, ఏఈ, ఆత్మకూరు(ఎం) మండలం