Share News

ప్రభుత్వ ఆస్పత్రుల్లో..హాజరుకు ‘ఆధార’మే

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:19 AM

ప్రభుత్వ దవాఖానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి, ఉన్నత వర్గాలకు చెందిన వారంతా అనారోగ్యం బారిన పడితే ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యంకోసం వెళుతుంటారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో..హాజరుకు ‘ఆధార’మే

ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు

పారదర్శకంగా వైద్య సేవలందించడమే లక్ష్యం

వైద్యులు, సిబ్బందికి ఈ నెల 31లోగా శిక్షణకు ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): ప్రభుత్వ దవాఖానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి, ఉన్నత వర్గాలకు చెందిన వారంతా అనారోగ్యం బారిన పడితే ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యంకోసం వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. వైద్యులు, సిబ్బంది సకాలంలో ఆస్పత్రులకు రావడంతోపాటు రోగులకు అందుబాటులో ఉండేలా సన్నాహాలు చేస్తోంది.

వైద్య సేవల్లో మరింత పారదర్శకత తేవాలన్న లక్ష్యంతో ప్రభు త్వం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధార్‌ హాజరు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాల్సిందిగా వైద్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వైద్య ఆరోగ్య, వైద్య పరిషత్‌ ఆస్పత్రుల మెడికల్‌ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాలను వివరించనున్నారు. జిల్లాలో మొత్తం 27 ప్రభుత్వ ఆస్పతులు ఉన్నాయి. వీటిలో ఒక జిల్లా ఆస్పత్రి, ఒక ఏరియా ఆస్పత్రి, మూడు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఒక టీచింగ్‌ ఆస్పత్రి, 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌, వైద్య విధాన పరిషత్‌, ప్రజారోగ్య డైరెక్టర్‌, ఆయూష్‌ విభాగాల పరిధిలో పనిచేస్తున్నాయి. వీటన్నింటిలోనూ ఆధార్‌ ఆధారిత హాజరు ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి వైద్యులు, సిబ్బందికి ఈ నెల 31లోగా అవసరమైన శిక్షణ అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పక్కాగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వైద్య సేవలు మెరుగుపరించేందుకే..

ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్న లక్ష్యంతో ప్రభు త్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే వైద్య శాఖ ప్రస్తుతం ఉన్న విధానానికి స్వస్తిచెప్పి ఆధార్‌ ఆధారిత హాజరును ప్రవేశపెడుతోంది. ప్రస్తు తం జిల్లాలోని ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి బయోమెట్రిక్‌ విధానం ద్వారా హాజరు అమలు చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది ఆస్పత్రికి వచ్చిన సమయంలో, అక్కడినుంచి తిరిగి వెళ్లేటప్పుడు హాజ రు వేస్తున్నారు. ఈ విఽధానంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆధార్‌ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం ద్వారా వైద్యులు, సిబ్బంది తమ కు నిర్దేశించి సమయాలకు అనుగుణంగా వైద్య సేవ లు అందిస్తారని ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఉండవని ఆశిస్తోంది. ఆ మేరకు తగిన చర్యలు చేపడుతోంది.

24గంటల ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు రోడ్లు ప్రమాదాలు, ఇతర ఏదైనా ప్రమాదకరమైన రోగాలు వ్యాప్తి చెందితే హుటాహుటిన హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుంటారు. అయితే స్థానికంగా ప్రాథమిక చికిత్సకు కూడా నోచడంలేదు. భువనగిరిలోని జిల్లా ఆస్పత్రిలోనూ ప్రాథమిక చికిత్స నిర్వహించి, హైదరాబాద్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేస్తారు. జిల్లా కేంద్రంతోపాటు పల్లెల్లోనూ అత్యవసరమైన వైద్యం కరువైంది. జిల్లాలో ఎయిమ్స్‌, జిల్లా మెడికల్‌ కళాశాల అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అయితే జిల్లాయంత్రాంగం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు తరుచూ ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 22 పీహెచ్‌సీలకు ప్రభుత్వం ఆత్మకూరు(ఎం), బొమ్మలరామారం, బీబీనగర్‌, మోత్కూరు, సంస్థాన్‌నారాయణపురం, భూదాన్‌పోచంపల్లి, రాజాపేట, తుర్కపల్లి, వలిగొండ, యాదగిరిగుట్టలో పీహెచ్‌సీల్లో 24గంటల వైద్య సౌకర్యం కల్పించింది. ఈ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకపోవడంతోపాటు వైద్యులు సకాలంలో ఉండటం లేదన్న విమర్శలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వైద్య సేవలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు రాగానే అవసరమైన చర్యలు చేపట్టనున్నట్టు డీఎంహెచ్‌వో మనోహర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Jul 26 , 2025 | 12:19 AM