Share News

ఇలా అయితే.. ఎలా?

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:37 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో సామాన్య భక్తులను పట్టించుకునే వారే కరువయ్యారు. కొండకు బస్సుల్లో చేరుకునే భక్తులకు ఆర్టీసీ బస్టాండ్‌లో చోటులేకుండా పోయింది.

ఇలా అయితే.. ఎలా?

బస్టాండ్‌లోనే వాహనాల పార్కింగ్‌

ప్లాట్‌ఫాంలలో దుకాణ సముదాయాలు

బస్సులెక్కే చోట భక్తుల ఇబ్బందులు

యాదగిరిగుట్ట, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో సామాన్య భక్తులను పట్టించుకునే వారే కరువయ్యారు. కొండకు బస్సుల్లో చేరుకునే భక్తులకు ఆర్టీసీ బస్టాండ్‌లో చోటులేకుండా పోయింది. కుటుంబసమేతంగా వచ్చిన భక్తులకు బస్టాండ్‌ నుంచి వెళ్లేందుకు స్థలం సరిపడాలేదు. అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించినా, అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు కొండపైన ఆర్టీసీ బస్టాండ్‌ అసౌకర్యంగా మారింది. వైటీడీఏ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా కొండపైన ఉత్తరంలో ఇరువైపుల 20 ప్లాట్‌ఫాంలతో ప్రత్యేకంగా బస్టాండ్‌ నిర్మించారు. ప్రస్తుతం ప్లాట్‌ఫాంలను పార్కింగ్‌ స్థలంగా మార్చడంతో సామాన్య భక్తుల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.

పూర్తిగా పార్కింగ్‌ స్థలంగా మార్చడంతో..

ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా క్షేత్ర సందర్శన కు తరలివచ్చే భక్తులకోసం దూరదృష్టితో కొండపైన, కింద ఆర్టీసీ బస్టాండ్లు అందుబాటులోకి తెచ్చారు. కాగా, అధికారులు కొండపైన బస్టాండ్‌ ప్రాంగణాన్ని పూర్తిగా పార్కింగ్‌ స్థలంగా మార్చడంతో సాధారణ భక్తులకు తిప్పలు పడుతున్నారు. రూ.500 చెల్లించి వాహనాల్లో కొండపైకి వచ్చిన భక్తులకు పార్కింగ్‌ స్థలం లేనందున భక్తులతో కిటకిటలాడే బస్టాండ్‌నే పార్కింగ్‌ స్థలంగా మార్చేశారు. కొండపైకి వాహనాల ను నియంత్రించే ఆలోచనతో ప్రత్యేక రుసుం ప్రవేశపెట్టినప్పటికీ బస్సుల్లో రద్దీని తట్టుకోలేక సొంత వాహనాలు ఉండగా, ఆటోలు ఎందుకని కొంతమంది వాహనదారులు రుసుం చెల్లించి కొండపైకి చేరుకుంటున్నారు. ఇలా చేరిన వాహనాలతో పార్కింగ్‌ ప్రదేశం (బస్టాండ్‌ ప్రాంగణం) ప్రత్యేక రోజుల్లో రద్దీగా మారుతుంది. దీంతో బస్సులు ఎక్కేందుకు సాధారణ భక్తులు నానా తంటాలు పడుతున్నారు.

భక్తులు నడిచేందుకు కూడా స్థలం లేదు

బస్టాండులోనే టెండరుదారులు, వర్తక సంఘానికి దుకాణాలు కేటాయించడంతో భక్తులు నడిచేందుకు కూడా స్థలంలేదు. బస్సుల్లో వచ్చిన సాధారణ భక్తు లు ఉచిత (ధర్మ) దర్శనం చేసుకునేందుకు దారి ఇటువైపు నుంచే ఉన్నందున ఇక్కడ రద్దీ ఉంటుంది. ఉచిత దర్శనం భక్తులకు ఇక్కడ మొదలయ్యే కష్టాలు కొండదిగే వరకూ వెంటాడుతూనే ఉంటాయి. బస్టాం డ్‌ ప్రాంగణంలో పార్కింగ్‌, దుకాణ సముదాయాల ఏర్పాటుతో భక్తులు నిలబడేందుకు కూడా చోటు లేక వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు, మహిళలు అసహనాని కి లోనవుతున్నారు. వీటికితోడు (ప్రధాన కార్యాలయం ఎదురుగా) మరోపక్క ఎస్పీఎఫ్‌ పోలీ్‌సస్టేషన్‌, ఆస్ప త్రి నిర్వహణ, డార్మెటరీ హాల్‌ తాత్కాలికంగా ఏర్పా టు చేయడంతో బస్టాండ్‌ పూర్తిగా మూసుకుపోయింది.

నిత్యం రద్దీకి అనుగుణంగా

నిత్యం రద్దీకి అనుగుణంగా సుమారు 10 ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులను కొండపైకి, కిందకు తరలిస్తున్నారు. 40సీట్ల మినీ బస్సులకు రూ.18వేలు, 60 సీట్ల కు రూ.25వేలు దేవస్థానం ఆర్టీసీకి చెల్లిస్తుంది. కొండపైకి, కిందకు తరలిస్తున్నందున మినీ బస్సులు ఇం జన్‌లో తరచూ మరమ్మతులు ఎదురవుతుండగా వాటిని రద్దుచేసి 10 రోజులుగా 60 సీట్ల బస్సుల ద్వా రానే సేవలందిస్తున్నారు. దేవస్థానం అధికారులు రద్దీ కి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచడం, తగ్గిస్తూ వస్తున్నారు. అధికారుల అంచనాలకు మించి భక్తులు రావడంతో కొండపై బస్టాండ్‌లో చేసిన వాహనాల పార్కింగ్‌ మూలంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వీరికి సరిపడా బస్సులు అందుబాటు లో లేక గంటల తరబడి కొండకింద తా త్కాలిక బస్టాండు, కొండపైన బస్టాండ్‌లో వేచి ఉంటున్నారు. ఆలస్యంగా వచ్చిన బస్సులకోసం పార్కింగ్‌ చేసిన వాహనాల మధ్య నుంచి బస్సులు మా త్రమే వెళ్లేందుకు వదిలిన స్థలంలో ఎగబడుతూ బస్సులు ఎక్కేటప్పుడు గుంపులుగా చేరిన భక్తులతో బస్టాండ్‌ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. ఇదే సమయంలో స్వల్ప తోపులాటలు, ఘర్షణలు, వాగ్వాదాలు, దాడులు జరుగుతున్నాయి. పార్కింగ్‌ తొలగించి రద్దీకి సరపడా బస్సులు నడిపితేనే సమస్య తీరనుంది.

Updated Date - Jun 16 , 2025 | 12:37 AM