Share News

వలస కార్మికులకు గుర్తింపు కార్డులు

ABN , Publish Date - May 10 , 2025 | 11:56 PM

కరోనా మహమ్మారి అనంతరం జిల్లా అంతటా వలస కార్మికులు గణనీయంగా పెరిగారు.

 వలస కార్మికులకు గుర్తింపు కార్డులు
వలస కార్మికులతో మాట్లాడుతున్న భువనగిరి పట్టణ పోలీసులు

వివరాలు, బయోమెట్రిక్‌ సేకరిస్తున్న పోలీసులు

భువనగిరి టౌన, మే 10 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి అనంతరం జిల్లా అంతటా వలస కార్మికులు గణనీయంగా పెరిగారు. ఉపాధి నిమిత్తం పలు ఉత్తరాది, ఈశాన్య రాష్ర్టాలకు చెందిన కార్మికులు వచ్చి స్థానికంగా స్థిరపడుతున్నారు. తాపీ పనులు, హోటల్స్‌, రోజు కూలీ పనుల నుంచి హెయిర్‌ కటింగ్‌ సెలూన్స వరకు పలు రంగాలలో స్థానిక కార్మికులు తగ్గి వలస కార్మికులు గణనీయంగా పెరుగుతున్నారు. దీంతో వలస కార్మికులతో పాటు గంజాయు తదితర మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం కూడా పెరిగాయని, అదే సమయంలో క్రిమినల్‌ ఘటనలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరగడానికి వలస కార్మికులే ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జిల్లాలో అతిపెద్ద లేబర్‌ అడ్డాగా పేరుగాంచిన భువనగిరిలో జగదేవ్‌పూర్‌ చౌరస్తాలో ప్రతిరోజు ఉదయం వందలాది మంది వలస కార్మికులు పనుల కోసం గుమికూడుతుంటారు. దీంతో గుత్తదారులు, మేస్ర్తీలు, యజమానులు కూలీ పనుల కోసం వలస కార్మికులకు తీసుకువెళుతున్నారు. స్థానిక కార్మికుల కూలీ ధరలతో పోలిస్తే వలస కార్మికుల కూలీధర తక్కువగా ఉండటం, అలాగే పని గంటల వ్యవధి కూడా అధికంగా ఉండటంతో అందరూ వలస కార్మికులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. భువనగిరి జగదేవ్‌పూర్‌ చౌరస్తా నుంచి స్థానిక పనులకే కాకుంగా పరుగు జిల్లాలైన మేడ్చల్‌, జనగాం, సిద్దిపేట తదితర జిల్లాలకు కూడా వాహనాలలో తీసుకు వెళ్తుతుంటారు. అంతేకాక పట్టణంలోని పలు బస్తీల్లో వలస కార్మికులు అద్దెకు ఉంటుండటంతో పలువురు యజమానులు వీరి అద్దెల కోసమే నూతన భవనాలను నిర్మించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వలస కార్మికులపై భువనగిరి పట్ణణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కార్మికుల వివరాలన్నీ సేకరించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భువనగిరిలోని వలస కార్మికుల గుర్తింపు ప్రక్రియను చేపట్టారు.

వలస కార్మికులకు గుర్తింపు కార్డులు

పెరిగిన వలస కార్మికులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, కార్మికులందరి వివరాలు, వారిని ఇక్కడికి రప్పించిన గుత్తదారులు వివరాలు సేకరించాలని, వారి నివాసాలను తరచుగా తనిఖీ చేయాలని గతంలో పట్టణ పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు గతంలో కొంతమేర కార్యాచరణ చేపట్టినప్పటికీ పలు కారణాలతో పూర్తి చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వలస కార్మికులందరి ఆధార్‌, బయోమెట్రిక్‌, కుటుంబ వివరాలు, సొంత చిరునామా, స్వరాష్ట్రం నుంచి ఇక్కడికి రప్పించిన గుత్తేదార్‌ తదితర వివరాల సేకరణ, నమోదు ప్రక్రియను పట్టణ పోలీసులు ఇటీవలే వేగవంతం చేశారు. పోలీ్‌సస్టేషన పక్కనే ఉన్న లేబర్‌ అడ్డాలో ప్రతిరోజు కార్మికులకు కౌన్సిలింగ్‌ చేస్తూ వివరాలు నమోదు చేస్తున్నారు. మాదకద్రవ్యాలు, మద్యపానం, చేడు అలవాట్లు, దొంగతనాలు, అసాంఘిక, మత ఆధారిత కార్యకలాపాలకు తదితర వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో ఉంటూ పనుల చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

వివరాల నమోదు, కౌన్సిలింగ్‌ పూర్తయ్యాక గుర్తింపు కార్డులు ఇస్తామని పోలీస్‌ అధికారులు అంటున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలలో వలస కార్మికులు ఉన్నట్టు నిర్థారణ అయితే వెంటనే అరెస్టు చేయడం, కేసులను చేధించడం సులువవుతుందని పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు.

ప్రత్యేక నిఘా

వలస కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించాం. పలు రాషా్ట్రలకు చెందిన వందలాది మంది కార్మికులు భువనగిరిలో నివాసముంటూ పలు ప్రాంతాలలో ఉపాధి పనులు చేస్తున్నారు. దీంతో పట్టణంలో కొత్త వ్యక్తుల సంచారం ఇటీవల గణనీయంగా పెరిగింది. అదే సమయంలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు తదితర క్రిమినల్‌ చర్యలు పెరిగాయి. దీంతో నేరాలకు పాల్పడితే ఎదురుకోవలసిన కఠిన చర్యలపై అవగాహన కల్పించడంతోపాటు వారి పూర్తి వివరాలు నమోదదు చేస్తున్నాము. త్వరలోనే గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇప్పటివరకు 70 మంది కార్మికుల వివరాల నమోదు పూర్తయింది.

-ఎం.రమేష్‌, ఇనస్పెక్టర్‌, భువనగిరి టౌన పోలీ్‌సస్టేషన

Updated Date - May 10 , 2025 | 11:56 PM