84,864
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:51 PM
రేషన సరుకులు తీసుకోని వారిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ఆరు నెలలుగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సరుకులు తీసుకోని కార్డుదారులు 84,864 ఉన్నట్లు గుర్తించింది. పేదలకు ఉచిత బియ్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం తెల్లరేషన కార్డులను ప్రభుత్వం మంజూరుచేసింది.
ఆరు నెలలుగా రేషనకు రాలే
సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో గుర్తింపు
క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆపై చర్యలు
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్)
రేషన సరుకులు తీసుకోని వారిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ఆరు నెలలుగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సరుకులు తీసుకోని కార్డుదారులు 84,864 ఉన్నట్లు గుర్తించింది. పేదలకు ఉచిత బియ్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం తెల్లరేషన కార్డులను ప్రభుత్వం మంజూరుచేసింది. అయితే ఈ కార్డు ద్వారానే ఆరోగ్యశ్రీ కూడా అమలవుతుండటంతో కొంతమంది ధనికులు కూడా తెల్లరేషన కార్డులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా రేషనకార్డులు కలిగిన లబ్ధిదారుల్లో కొంతమంది సుమారు ఆరు నెలలుగా సరుకులు తీసుకోవడంలేదు. దీంతో వారి వివరాలను ప్రభుత్వం ఇటీవల సేకరించింది. క్షేత్రస్థాయిలో విచారించి ఆయా కార్డులను తొలగించే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో మొత్తం 7,92,118 రేషనకార్డులు ఉన్నాయి. నల్లగొండలో 4,66,061 కార్డులు, సూర్యాపేటలో 3,26,057 రేషన కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుదారులకు ప్రతి నెలా ప్రస్తుతం కార్డులోని ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు చాలామంది లబ్ధిదారులు బియ్యం తీసుకునేవారు కాదు. ఒకవేళ తీసుకున్నా వాటిని ఇతరులకు విక్రయించేవారు. ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రజలు సన్నబియ్యం తీసుకుంటున్నారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 84,864 కార్డులు
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆరు నెలలుగా రేషన సరుకులు తీసుకోని లబ్ధిదారులు 84,864 మంది ఉన్నారు. నల్లగొండలో 62,143, సూర్యాపేట జిల్లాలో 22,721 రేషనకార్డుదారులు ఉన్నారు. కాగా ఇటీవల నల్లగొండ జిల్లాలో నూతన రేషన కార్డులకు 43వేల మంది దరఖాస్తులు చేసుకోగా వాటిని పరిశీలించిన అనంతరం 33వేల నూతన కార్డులను మంజూరు చేశారు. సూర్యాపేట జిల్లాలో నూతన రేషన కార్డులు 11,642 మంజూరుచేశారు. అదేవిధంగా గతంలో ఉన్న రేషనకార్డుల్లో వారి కుటుంబసభ్యులను చేర్చడానికి 56,766 దరఖాస్తులు రాగా వాటిని విచారించి రేషనకార్డుల్లో నమోదుచేశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి మొత్తం 44,760 నూతన రేషన కార్డులు మంజూరుచేశారు.
స్పష్టమైన ఆదేశాలు రాగానే విచారిస్తాం
ఆరు నెలలుగా రేషనదుకాణాల్లో సరుకులు తీసుకోని వారి జాబితాను ప్రభుత్వం గుర్తించింది. ఆయా రేషనకార్డుదారులు అర్హులా కాదా అనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే విచారణ చేస్తాం. వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ ఉండదు. దీంతో రెండు నెలల పాటు అర్హులైన వారికే రేషనకార్డులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అనర్హుల వద్ద ఉన్న కార్డులను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వం ఉంది.
పీ.రాంబాబు, అదనపు కలెక్టర్ సూర్యాపేట.