Share News

ఎలక్ట్రికల్‌ బస్సుల పరుగులు ఎన్నడో?

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:08 AM

పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంజూరుచేసిన ఎలక్ట్రికల్‌ బస్సులు ఇప్పటికే సూర్యాపేట డిపో పరిధిలో పరుగులు పెడుతూ ప్రయాణికుల కు సేవలు అందిస్తుండగా, నల్లగొండ జిల్లాలో మాత్రం రోడ్డెక్కడం లేదు.

ఎలక్ట్రికల్‌ బస్సుల పరుగులు ఎన్నడో?

ఇప్పటికే సూర్యాపేట డిపో పరిధిలో రోడ్డెక్కిన బస్సులు

నల్లగొండ జిల్లా బస్సులు మాత్రం నార్కట్‌పల్లి డిపోలో భద్రం

సబ్‌స్టేషన్‌ నిర్మాణంలో జాప్యం చేస్తున్న విద్యుత్‌శాఖ

చార్జింగ్‌ పాయింట్‌లకు విద్యుత్‌ లేక బస్సులు నడపని పరిస్థితి

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంజూరుచేసిన ఎలక్ట్రికల్‌ బస్సులు ఇప్పటికే సూర్యాపేట డిపో పరిధిలో పరుగులు పెడుతూ ప్రయాణికుల కు సేవలు అందిస్తుండగా, నల్లగొండ జిల్లాలో మాత్రం రోడ్డెక్కడం లేదు. విద్యుత్‌శాఖ అధికారులు ఆరు నెలలుగా 33/11కేవీ లైన్‌ను ఏర్పాటు చేయడంలో తాత్సారం చేస్తుండటంతో చార్జింగ్‌ పాయింట్లకు విద్యుత్‌ సౌకర్యం లేదు. దీంతో ఎలక్ట్రికల్‌ బస్సులు డిపోకే పరిమితమవుతున్నాయి.

సూర్యాపేట జిల్లాకు 79 ఎలక్ట్రికల్‌ బస్సుల ను మంజూరు చేయగా, ఇప్పటికే 45 బస్సులు డిపోకు చేరాయి. అవి ప్రయాణికులకు సేవలు కూడా అందిస్తున్నాయి. నల్లగొండ డిపోకు 75 బస్సులు మంజూరు చేయగా, ఇప్పటికే 40 బస్సులు చేరాయి. అయితే అవి నార్కట్‌పల్లి డిపో ఆవరణలో భద్రపరిచారు. ఆరు నెలల క్రితమే విద్యుత్‌ పనులు పూర్తి కావాల్సి ఉండ గా, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం తో బస్సులు నడవడం లేదు. ఇటీవల నల్లగొం డ రీజియన్‌ ఆర్టీసీ అధికారులు విద్యుత్‌శాఖ అధికారులకు లేఖ కూడా రాశారు. అయితే ఆ పనులు ఎప్పటికి పూర్తవుతాయో స్పష్టమైన సమాచారం లేదు. ఇప్పటికే ఎలక్ట్రికల్‌ బస్సులు రోడ్లపై తిరగాల్సి ఉండగా, సబ్‌స్టేషన్‌ లేకపోవ డం, చార్జింగ్‌ పాయింట్‌కు విద్యుత్‌ రాకపోవడంతో ఎలక్ట్రికల్‌ బస్సులు నార్కట్‌పల్లి డిపోలో నే నిలిపారు. బస్సులు రన్నింగ్‌లో లేకపోవడం, ఇలాగే జాప్యం చేస్తే చార్జింగ్‌ లేక అవి మరమ్మతులకు గురయ్యే అవకాశం ఉంది. యాదా ద్రి జిల్లాకు సంబంధించి విద్యుత్‌ బస్సుల కోసం ప్రతిపాదనలు పంపగా, ఆ జిల్లాకు ఎన్ని బస్సులు కేటాయించాలనే దానిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం

నల్లగొండ ఆర్టీసీ డిపోలో 33/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో పాటు లైన్‌ ఏర్పాటుకు సుమారు రూ.6కోట్లు కేటాయించారు. ఈ మినీ లైన్‌కు టెండర్‌ ఖరారు చేసి పనులు మొదలు ప్రారంభించగా, విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. చార్జింగ్‌ పాయింట్‌గా నల్లగొండ డిపో ఉన్నందున ఈ మినీ విద్యుత్‌లైన్‌తో పాటు సబ్‌స్టేషన్‌ ఏర్పాటు త్వరితగతిన పూర్తయితే ఎలక్ట్రికల్‌ బస్సులు నడిచే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రికల్‌ బస్సులు చార్జింగ్‌ కోసం స్విచ్‌ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ చార్జింగ్‌ పాయింట్‌లకు విద్యుత్‌ను ఓవర్‌లోడ్‌ లేకుండా సమానంగా సరఫరా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రోత్సహిస్తుండగా, హైదరాబాద్‌ నుంచి ఆపరేట్‌ చేస్తున్న ఇవి సూర్యాపేట డిపోలో విజయవంతంగా నడుస్తున్నాయి. నల్లగొండ డిపోలో మాత్రం జాప్యం జరుగుతోంది. దీనికి విద్యుత్‌శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

త్వరలో ఎలక్ట్రికల్‌ బస్సులు నడిపిస్తాం : కె.జానిరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం

పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకువస్తున్న ఎలక్ట్రికల్‌ బస్సులను త్వరలోనే నల్లగొండ డిపో నుంచి నడిపించనున్నాం. అందుకు సంబంఽధించి చార్జింగ్‌ పాయింట్‌ల ఏర్పాటు పూర్తయినా, 33/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యుత్‌శాఖ అధికారులకు లేఖలు రాశాం. ప్రస్తుతం నిర్వహణ పనులు నడుస్తున్నాయి. ఎలక్ట్రికల్‌ బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.

వారంలోపు సబ్‌స్టేషన్‌ పనులు పూర్తి : అన్నయ్య, విద్యుత్‌శాఖ డీఈ, నల్లగొండ

వారం రోజుల్లోపే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు పూర్తిచేసి చార్జింగ్‌ పాయింట్‌ల కోసం విద్యుత్‌ సరఫరా చేస్తాం. ఈ పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదు. రెండు టవర్‌లకు గాను ఒక టవర్‌ పనులు వారం రోజుల్లో పూర్తవుతాయి. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రికల్‌ బస్సుల కోసమే ఈ సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేస్తున్నాం.

Updated Date - Jul 07 , 2025 | 12:08 AM