Share News

ఇంటి పన్నులే ఆధారం

ABN , Publish Date - Jul 19 , 2025 | 01:04 AM

నిధుల్లేక పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిలిచాయి. కనీసం చెత్తను డంపింగ్‌ యార్డులో వేద్దామన్నా, ట్రాక్టర్‌లో డీజిల్‌ పోయించేందుకు కూడా డబ్బుల్లేవు. దాతలను అడిగి గ్రామకార్యదర్శులు అంతోఇంతో పనులు చేయిస్తున్నారు.

ఇంటి పన్నులే ఆధారం
ఆత్మకూరు(ఎస్‌) మండలం నెమ్మికల్‌లో వర్షం నీటితో నిండిపోయిన వీధి

నిధుల్లేక పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిలిచాయి. కనీసం చెత్తను డంపింగ్‌ యార్డులో వేద్దామన్నా, ట్రాక్టర్‌లో డీజిల్‌ పోయించేందుకు కూడా డబ్బుల్లేవు. దాతలను అడిగి గ్రామకార్యదర్శులు అంతోఇంతో పనులు చేయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర నిధులు నిలిచిపోయాయి. దీంతో నిధులకు కొరత ఏర్పడింది. గ్రామ కార్యదర్శులే ఆస్తిపన్నుతో పాటు సొంతంగా అప్పులు చేసి కొన్ని పనులను కొనసాగిస్తున్నారు.

- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)

వర్షాకాలం వ్యాధులు ప్రబలేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో గ్రామాలు ఎంతో పరిశుభ్రంగా ఉంచాల్సి ఉంటుంది. ఈ ఏడాది పంచాయతీల జనాభా ఆధారంగా 15వ ఫైనాన్స నిధులు విడుదలవుతాయి. ఒక వ్యక్తి రూ.99.05 చొప్పున విడుదల చేస్తారు. ఎస్టీ జనాభా ఉన్నచోట మొత్తం బడ్జెట్‌లో 15 నుంచి 20శాతం అధికంగా నిధులు విడుదలవుతాయి. అదేవిధంగా స్టేట్‌ ఫైనాన్స కార్పోరేషన ద్వారా జనాభాధారంగా నిధుల విడుదల ఉంటుంది. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గాలు లేకపోవడంతో 15 ఫైనాన్స నిధులు నిలిచిపోయాయి. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి ట్యాంకులు, వీధిలైట్లు ఏర్పాటుచేయాలి. అదేవిధంగా స్టేట్‌ ఫైనాన్స కార్పొరేషన నిధులతో ఇతర అనేక పనులు చేపట్టాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. వీటికోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. ప్రతిగ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ను అందజేశారు. ఆ సమయంలో కంపచెట్లను తొలగించడం, రోడ్ల నిర్మాణం, నర్సరీలను ఏర్పాటుచేయడం, శ్మశానవాటికల నిర్మాణాలను చేపట్టారు.

అదనంగా 11 పంచాయతీలు

ప్రస్తుతం జిల్లాలో 475 పంచాయతీలు ఉండగా మరో 11 పంచాయతీలను అదనంగా ఏర్పాటుచేశారు. మొత్తం 486 పంచాయతీలు కానున్నాయి. ఇటీవల కార్యదర్శుల నియామకం చేపట్టినప్పటికీ ఇంకా 20 పంచాయతీలకు కార్యదర్శుల కొరత నెలకొంది. జిల్లావ్యాప్తంగా 1925 మంది మల్టీపర్పస్‌ వర్కర్స్‌(పారిశుధ్య సిబ్బంది) పనిచేస్తున్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు అందజేస్తోంది. పంచాయతీ జనాభా ఆధారంగా ఇద్దరు నుంచి నలుగురి వరకు సిబ్బంది ఉన్నారు. 2022-23లో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.47.6కోట్లు మంజూరయ్యాయి. అదేసంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నిధులు రూ.6.75 కోట్లు మంజూరయ్యాయి.

ఇంటి పన్నులతోనే ప్రస్తుత పనులు

ఇంటి పన్నులు వసూలు చేసి పంచాయతీల్లో అత్యవసర పనులు చేపడుతున్నారు. జిల్లాలో రూ.12.24 కోట్ల ఇంటి పన్నులు వసూలు కావాల్సి ఉండగా నేటి వరకు రూ.11.15 కోట్లు వసూలయ్యాయి. సుమారు 92శాతం వసూలయినట్లు అధికారులు చెబుతున్నారు.

బిల్లులు రాక మాజీసర్పంచలు సతమతం

గ్రామాభివృద్ధి కోసం కొంతమంది సర్పంచలు కాంట్రాక్టర్‌ అవతారాలు ఎత్తి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. సీసీరోడ్లు, మురుగు కాల్వులు, మంచినీటి ట్యాంకులను నిర్మించారు. సొంత డబ్బులతో పనులు చేయగా వాటికి ఇంకా బిల్లులు రాలేదు. జిల్లావ్యాప్తంగా రూ.7.6కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది.

ఎన్నికలు అయితేనే నిధులు

పంచాయతీ ఎన్నికలు ఎంతతొందరగా పూర్తయితే నిధుల మంజూరు కూడా వేగవంతమవుతుంది. కేంద, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉటుంది. అప్పటి వరకు గ్రామకార్యదర్శులదే భారం. సర్పంచ ఎన్నికలు పూర్తయితే ఎమ్మెల్యేలు కూడా గ్రామాలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహించక ఆలస్యమవుతున్నా కొద్దీ అభివృద్ధి కుంటుపడుతుంది.

నిధులు చెల్లిస్తాం

ప్రభుత్వం నుంచి నిధులు రాగానే కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తాం. ఇప్పటికే రూ.7.6కోట్లు చెల్లించాల్సి ఉంది. 20మంది గ్రామకార్యదర్శుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం.

- యాదగిరి, డీపీవో

Updated Date - Jul 19 , 2025 | 01:04 AM