Share News

నామినేటెడ్‌పై ఆశలు

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:11 AM

స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్‌ పదవుల నియామకాలపై కాంగ్రెస్‌ కీలక నిర్ణ యం తీసుకుంది. గణేశ్‌ నిమజ్జనంలోపే నామినేటెడ్‌ పదవులను భర్తీచేయాలని శనివారం జరిగిన పార్టీ కోర్‌కమిటీ, పీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

నామినేటెడ్‌పై ఆశలు

పదవుల పందేరం అనంతరం స్థానిక ఎన్నికలకు

సెప్టెంబరు నెలా ఖరులోగా కొలిక్కితెచ్చే యోచన

వినాయక చవితి నుంచి నిమజ్జనంలోగా నామినేటెడ్‌ భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

కాంగ్రెస్‌ కోర్‌కమిటీలో కీలక నిర్ణయం

ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశావహులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్‌ పదవుల నియామకాలపై కాంగ్రెస్‌ కీలక నిర్ణ యం తీసుకుంది. గణేశ్‌ నిమజ్జనంలోపే నామినేటెడ్‌ పదవులను భర్తీచేయాలని శనివారం జరిగిన పార్టీ కోర్‌కమిటీ, పీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజ్యాంగ, న్యాయనిపుణులతో చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందకపోవడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులతో కూడిన కమిటీని కాంగ్రెస్‌ నియమించింది. వీరు రాజ్యాంగ, న్యాయనిపుణులతో సంప్రదించాలని నిర్ణయించింది. ఈనెల 29న జరిగే క్యాబినెట్‌ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తుది నిర్ణయం తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో వీలైనంతమేరకు అధికారికంగా 42శాతం బీసీ రిజర్వేషన్లతోనే వెళ్లాలని,లేని పక్షం లో పార్టీపరంగానైనా రిజర్వేషన్‌ కల్పించి స్థానిక ఎన్నికల ప్రక్రియను కోర్టు విధించిన సెప్టెంబరు నెలాఖరు గడువులోగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈలోగా గణేశ్‌ చతుర్థి నుంచి నిమజ్జనం జరిగే లోపు నామినేటెడ్‌ పదవుల భర్తీ పూర్తిచేయాలని నిర్ణయించింది. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు, వైస్‌చైర్మన్‌, డైరెక్టర్‌ పదవులనూ భర్తీ చేయాలని, ఇప్పటికే ఆశావహుల జాబితాలను పార్టీ జిల్లా పరిశీలకులు, ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అధిష్టానానికి, సీఎంకు చేరవేశారు. నామినేటెడ్‌ పదవుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఉమ్మడి జిల్లాలోనూ ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లా నేతల ప్రయత్నాలు

యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతు న్న అండెం సంజీవరెడ్డి, కీలక నేతలు పొత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, బర్రె జహంగీర్‌, పంజాల రామాంజనేయులుగౌడ్‌, పల్లె శ్రీనివా్‌సగౌడ్‌, లింగంయాదవ్‌, తదితర నేతలు కార్పొరేషన్‌ పదవులు ఆశిస్తున్నారు. వీరితో పాటు పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన నాయకుల పేర్లను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్‌ పదవులకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పదవుల పందేరం మొదలయ్యాక ఎవరికి అవకాశం దక్కుతుందో, అవి దక్కని వారిని ఎలా నచ్చజెబుతారనే అంశం తేలనుంది.

సూర్యాపేట జిల్లాలో..

ఉమ్మడి రాష్ట్రంలో ఐడీసీ సంస్థ డైరెక్టర్లుగా పనిచేసిన సాముల శివారెడ్డి (హుజూర్‌నగర్‌), కంచర్ల యాదగిరిరెడ్డి (తుంగతుర్తి) కూడా కార్పొరేషన్‌ పదవులు వస్తాయనే నమ్మకంలో ఉన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌గా పనిచేసిన ఎరగాని నాగన్న, పీసీసీ సభ్యుడు దొంగరి వెంకటేశ్వర్లు కూడా కార్పొరేషన్‌ పదవుల కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. కోదాడ నియోజకవర్గం నుంచి సీనియర్‌ నేతలు ముత్తవరపుపాండురంగారావు, చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి కూడా పరిస్థితులు అనుకూలిస్తే కీలక పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో..

బీసీ కోటాలో పీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలా్‌షనేత కార్పొరేషన్‌ పదవిని ఆశిస్తున్నారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గుమ్ముల మోహన్‌రెడ్డికి రాష్ట్రస్థాయి పదవి వస్తుందని ఎంపీ ఎన్నికల సందర్భం గా మంత్రి కోమటిరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. అయినా ఇప్పటివరకు ఆయనకు పదవి రాలేదని, ఈ దఫా ఖాయమని క్యాడర్‌ లో చర్చ సాగుతోంది. నాగార్జునసాగర్‌ నియో జకవర్గంలో మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన అనుచరుడు జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డికి సైతం రాష్ట్ర కార్పొరేషన్లలో కీలక పదవి ఖాయమైందని చెబుతున్నారు. అయితే సామాజిక, జిల్లాల సమీకరణాల్లో మొదటి విడతలో ఆయనకు ఛాన్స్‌ దక్కలేదని, ఈ దఫా ఖాయమంటున్నారు.

నామినేటెడ్‌లో ఛాన్స్‌ దక్కింది కొందరికే..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీసీ సీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అద్దంకి దయాకర్‌కు, నల్లగొండ డీసీ సీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందే తొలిదశలో జరిగిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకాల్లో ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌గా పటేల్‌ రమే్‌షరెడ్డి (సూర్యాపేట), మహి ళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా బండ్రు శోభారాణి (ఆలేరు), రాష్ట్ర దివ్యాంగుల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ముత్తినేని వీర య్య (హుజూర్‌నగర్‌) నియమితులయ్యారు. వ్యవసాయ కమిషన్‌ సభ్యుడిగా సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా గుత్తా అమిత్‌రెడ్డి నియమితులయ్యారు.

గాడ్‌ఫాదర్లపై ఒత్తిడి తెస్తున్న ఆశావహులు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచింది. స్థాని క సంస్థల ఎన్నికలూ లేకపోవడంతో ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు మినహా ఇతర నాయకులెవ్వరికీ ప్రొటోకాల్‌ సైతం వర్తించకపోవడంతో అధికారిక కార్యక్రమాల నిర్వహణ, అధికారులతో సమీక్షల్లో సైతం స్థానిక నాయకత్వానికి ప్రాతినిథ్యం లేకుండాపోయింది. పార్టీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న సందర్భంలో బరిగీసి కొట్లాడిన వారికి నామినేటెడ్‌ పదవులిచ్చే కార్యక్రమం తరచూ వాయిదా పడతూ వచ్చింది. దీంతో తమ సంగతేంటని, నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న నాయకులు గాడ్‌ఫాదర్లపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా, నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయాలని నిర్ణయించడంతో జిల్లాలో ఆశావహులు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు.

అవకాశం దక్కేదెవరికో?

ఉమ్మడి జిల్లా నుంచి నామినేటెడ్‌ పదవుల ను ఆశిస్తున్న నేతల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందోననే అసక్తి సర్వత్రా నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు మొదలు కీలకమైన ద్వితీయశ్రేణి నేతలం తా నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్నారు. కీలకమైన యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మం డలి చైర్మన్‌, బోర్డు సభ్యుల పదవులతో పాటు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు, జిల్లా స్థాయిల్లో ఉండే గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మహిళా ఆర్గనైజర్‌ పదవులు, దేవాలయాల కమిటీల చైర్మన్‌ పదవులు, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అఽథారిటీల చైర్మన్‌ పదవులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్ల వంటి పదవులను ఆశించే నాయకులంతా మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్న పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, డాక్టర్‌ కుడుదుల నగేశ్‌ కీలకమైన పదవి వస్తుందనే విశ్వాసంలో ఉన్నారు. కీలకమైన యాదాద్రి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పదవి దక్కించుకోవడానికి ఉమ్మడి జిల్లా నేతలతో పాటు, ఇతర జిల్లాల నేతలూ, పారిశ్రామికవేత్తలూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పదవిని యాదాద్రి జిల్లాకు చెందిన నేతలకే ఇవ్వాలని స్థానిక నేతలు సీఎం, మంత్రుల వద్ద డిమాండ్‌ చేస్తుండడంతో దీనిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఫ నకిరేకల్‌ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్యకు సైతం రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఖాయమని తెలుస్తోంది. మరోవైపు దైద రవీందర్‌, అన్నెపర్తి జ్ఞానసుందర్‌ కూడా కార్పొరేషన్‌ పదవులకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జూలూరి ధనలక్ష్మి, నల్లగొండ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు గోపగాని మాధవి మహిళా కోటాలో కార్పొరేషన్‌ పదవులు ఇవ్వాలని ముఖ్య నేతలను కోరుతున్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:11 AM