పునరావాసంపై ఆశలు
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:27 AM
నృసింహసాగర్ (బస్వాపూర్) రిజర్వాయర్ ముంపు బాధితులకు పునరావాసం కల్పన వేగవంతమైంది. యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి లో లప్పనాయక్ తండావాసుల కు సర్వేనెంబరు 294లో పునరావాసం కల్పిస్తున్నారు.
బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులకు పునరావాసం
లప్పనాయక్‌తండా వాసులకు దాతర్‌పల్లిలో లేఅవుట్ అభివృద్ధి
33ఎకరాల్లో రూ.33కోట్లతో పనులు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : నృసింహసాగర్ (బస్వాపూర్) రిజర్వాయర్ ముంపు బాధితులకు పునరావాసం కల్పన వేగవంతమైంది. యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి లో లప్పనాయక్ తండావాసుల కు సర్వేనెంబరు 294లో పునరావాసం కల్పిస్తున్నారు. ఇక్కడ 33 ఎకరాల్లోలే అవుట్‌ను రూపొందించి, రోడ్లు, విద్యుత్, తదితర సౌకర్యాలకల్పన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నృసింహసాగర్ పనులు గత ప్రభుత్వ హయాంలో ప్రా రంభం కాగా, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల స్థలాల కేటాయింపు,పరిహారం చెల్లింపులో జాప్యం చేసింది. నిధుల మం జూరు లేకపోవడంతో మూడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి. రిజర్వాయర్ నిర్మాణంతో భువనగిరి మండలంలోని బీఎన్.తిమ్మాపూర్, యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్‌తండా,లక్ష్మీనాయకుడితండా,చొంగల్‌నాయకుడితండా గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి.వారికి పరిహారం పంపిణీతో పాటు పునరావాసం కల్పించాల్సి ఉంది. కాగా,గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రక్రియలో తీవ్రంగా జా ప్యం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇటీవల సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో బస్వాపూర్ ముంపు బాధితులకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. దీంతో అంచనాలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్, ఇరిగేషన్‌శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించారు.
యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లిలో లప్పనాయక్‌తం డా వాసులకు సర్వేనెంబరు 294లో పునరావాసం కల్పించనున్నారు. తండాలో మొత్తం 220 కుటుంబాలు ఉన్నట్టు గతం లో నిర్వహించిన ఆర్థిక సర్వేలో అధికారులు నిర్ధారించారు. వీరికి పునరావాసం కల్పించేందుకు దాతర్‌పల్లిలో 33 ఎకరాల్లో లేఅవుట్‌ను రూపొందించి, రోడ్లు, విద్యుత్, తదితర సౌకర్యాలకల్పన పనులు సాగుతున్నాయి. అందుకు ప్రభుత్వం రూ.33కోట్లు కేటాయించింది. లప్పనాయక్‌తండా బాధితులకు త్వరలో ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేయనుంది. అదేవిధంగా బస్వాపూర్ ముంపు నిర్వాసితులైన లక్ష్మీనాయకుడితండా, చొంగల్‌నాయకుడితండా వాసులకు పునరావాసానికి ఏర్పాటు సాగుతున్నాయి. దాతర్‌పల్లిలోని సర్వేనెంబరు 294లోనే సుమారు 45ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. లేఅవుట్‌లో రోడ్లు, ఇళ్లస్థలాలు, పార్కులు, సామాజిక అవసరాలకు భూమిని సిద్ధం చేసి, అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ గుట్టలుగా ఉన్న భూమిని పూర్తిగా చదును చేసి ఫార్మేషన్ రోడ్లు ఏర్పాటుచేయనున్నారు. ఇళ్ల స్థలాలను కూడా త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
బీఎన్.తిమ్మాపూర్ వాసులకు
బీఎన్.తిమ్మాపూర్ నిర్వాసితుల కోసం భువనగిరి మండలంలోని హుస్సేనాబాద్‌లోని సర్వేనెంబర్ 107లో 95ఎకరాల ప్రభుత్వభూమిని అధికారులు గుర్తించారు. మొత్తం 95ఎకరాల లేఅవుట్‌లో రోడ్లు, ఇళ్లస్థలాలు, పార్కులు, సామాజిక అవసరాల కోసం భూమిని సిద్ధం చేసి అభివృద్ధి పనులు నిర్వహించనున్నారు. గుట్టలుగా ఉన్న భూమిని పూర్తిగా చదును చేసి ఫార్మేషన్ రోడ్లు పూర్తి చేశారు. ఇళ్ల స్థలాలను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక్కడ 1,056మందికి పునరావాసం కల్పించనున్నారు. పునరావాస ప్రాజెక్టు కింద ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, కొంతమంది ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. అయితే మౌలిక వసతుల కల్పనలో జాప్యం చోటుచేసుకుంది. రోడ్లు, మురుగునీటి కాల్వలు, విద్యుత్, కమ్యూనిటీ హాళ్లు, గ్రామపంచాయతీ భవనంతో ఇతర నిర్మాణాలకు రూ.42కోట్లు అవసరమని ఇరిగేషన్‌శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే నిధుల మంజూరులో జాప్యం కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి.
ఊర్లు ఖాళీ చేస్తేనే రిజర్వాయర్‌లోకి నీరు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపూర్‌లో నృసింహసాగర్ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. 16వ ప్యాకేజీ కింద ఆయకట్టుకు సాగు, తాగునీరు, పరిశ్రమిక అవసరాల కోసం ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. మొత్తం 11.39టీఎంసీల సామర్ధ్యంతో నిర్మాణం చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 7టీఎంసీల సామర్ధ్యం వరకు పనులు పూర్తయ్యాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో బీఎన్.తిమ్మాపూర్, లప్పనాయక్‌తండా, లక్ష్మీనాయకుడితండా, చొంగల్‌నాయకుడితండా పూర్తిగా మునిగిపోతున్నాయి. రిజర్వాయర్‌లోకి నీరు మళ్లించిన పక్షంలో గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఈ గ్రామాలను ఖాళీ చేస్తే తప్ప రిజర్వాయర్‌లోకి నీటిని విడుదలచేసే పరిస్థితి లేదు. రిజర్వాయర్ నిర్మాణ పనులు తుదిదశకు చేరినా, ముంపు గ్రామాలకు పునరావాసం కల్పనలో జాప్యం జరుగుతోంది. ఈ కారణంగానే రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించడంలేదు. పునరావాసంతో పాటు భూసేకరణ నిధులు మంజూరు చేస్తే గ్రామాలు ఖాళీచేసే అవకాశం ఉంది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం : ఖుర్షిద్, ఆర్‌అండ్‌బీ ఈఈ
నృసింహసాగర్ రిజర్వాయర్‌తో ముంపునకు గురవుతున్న నిర్వాసితుల కోసం యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లిలో సర్వేనెంబరు 294లో ప్రభు త్వ స్థలాన్ని గుర్తించాం. లప్పనాయక్‌తండా వాసులకు 33ఎకరాల్లో రూ.33 కోట్లతో లేఅవుట్‌ను రూపొందించాం. లేఅవుట్ పనులు పూర్తి కాగా, మౌలి క వసతులు, రోడ్డు, మురుగుకాల్వలు, ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. త్వరలోనే నిర్వాసితులకు ఇళ్లస్థలాల పట్టాలు మంజూరు చేయనున్నాం. బస్వాపూర్ ముంపు నిర్వాసితుల్లోని లక్ష్మీనాయకుడితండా, చొంగల్‌నాయకుడితండా వాసులకు పునరావాసం కోసం ప్రభుత్వానికి ప్ర తిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.